అమ్మో అమ్మాయిలు 23
ఆ రాత్రి ఏడు గంటలప్పుడు వ్యాకర్ణ అబ్బులు జయచిత్ర వద్దకు వచ్చారు. “మీకు తోచదేమోనని కాసేపు కబుర్లు చెప్పిపోదామని వచ్చాము" అన్నారు. ముందే జాగ్రత్తపడ
జయచిత్ర కుర్చీలు తెచ్చి వరండాలో వేసి "కూర్చోండని" చెప్పింది.
“మీ బామ్మగారు ఊరెళ్ళేముందు మీకేం కావాలో చూడమని మరీ మరీ చెప్పెళ్ళారు" అన్నాడు వ్యాకర్ణ.
“ఆహా" అని వూరుకుంది జయచిత్ర.
“రేపటికి కూరలు కావాలా?” అన్నాడు వ్యాకర్ణ.
“ఉన్నాయండి" అంది జయచిత్ర.
“పాలు కావాలా?”
“పాలవాడు వస్తాడండి.”
“పోనీ పెరుగు కావాలా?”
“పాలు తోడేస్తా కదండీ అదే పెరుగవుతుంది.”
“వెచ్చాలు, అంటే ఉప్పు. పప్పు వగైరా....”
“నిండు డబ్బాలతో వున్నాయండి....”
“పోనీ యిస్త్రీ చాకలిని పిలవమంటారా?”
“నిన్ననే బట్టలేయించు కెళ్ళాడండి.”
“అబ్బబ్బా! అన్నింటికీ వున్నాయి, వున్నాయి. ఎలాండి?”
“ఏంటి?”
“అదే, మీ బామ్మగారు మీకేం కావాలో కనుక్కోమందా? మేమేం కనుక్కున్నా వున్నాయి, వద్దు అంటున్నారు, కనీసం మర్యాదకి మేం అడుగుతున్నాం కదా అని అయినా ఏదో ఒకటి లేదనకూడదూ?” అన్నాడు వ్యాకర్ణ యింకేం అడగాలో తెలియక.
“లాభం ఏమిటి? అంది జయచిత్ర.
“పాయింటే" అన్నాడు అబ్బులు. వ్యాకర్ణకి వళ్ళు మండింది.
“వెధవాయ్ నువ్వు 'లా' చదవటానికి తప్ప యింక దేనికి పనికిరావు" అన్నాడు.
జయచిత్ర నవ్వి "జోక్ బాగుందండోయ్ . తెలివితక్కువ నాగన్నలు 'లా' చదవటానికి పనికొస్తారని పాయింట్ లాగారు" అంది.
“మీరూ పాయింట్ కొచ్చారూ?” అన్నాడు వ్యాకర్ణ.
“ఇప్పుడు మీరు వచ్చారు" అంటూ మరోసారి నవ్వింది జయచిత్ర.
సరిగ్గా అప్పుడే జిడ్డు ధర్మరాజు బీడీ తాగుతూ అక్కడి కొచ్చాడు. బీడీ అవతల పారేసి వరండా మెట్లెక్కి పైకొస్తూ అబ్బాయిలు యిక్కడే వున్నారే? సరి సరి ఏమ్మా జయచిత్రా! మీ నాయనమ్మ వెళ్ళిపోయింది....” అంటూ చివరి మెట్టుమీద ఆగాడు.
“నీ శార్ధము, నీ పిండా కూడు" అని పైకే శాపనార్థాలు పెట్టింది జయచిత్ర.
ధర్మరాజు వరండాలో వున్న మోడా మీద కూలబడి "నానమ్మ వెళ్ళిపోతే మేమంతా లేమా? ఏం కావాలో చెపితే నేనున్నాను, అబ్బాయిలున్నారు. తెచ్చి పడేస్తాం" అన్నాడు.
“ఛాదస్తపు నానమ్మా! నా భారం ఈ జిడ్డు మీద కూడా పెట్టి వెళ్ళావా? ఖర్మ" స్వగతంగా అనుకుంది జయచిత్ర.
“పోనీలెండి. కాసేపు వాగి వెళతాడు" జాలి చూపించాడు వ్యాకర్ణ.
“ఆ తర్వాత ధర్మరాజు మధ్య జయచిత్ర మధ్య యీ విధంగా సంభాషణ జరిగింది. “కూరలున్నాయా అమ్మాయీ!” అన్నాడు ధర్మరాజు.
“ఉన్నాయి" అంది జయచిత్ర.
“లేవూ! సరి సరి రేప్పొద్దున నేను ఓ సంచీడు తెచ్చి పడేస్తాలే. మీ నానమ్మ ఎప్పుడొస్తానంది?”
“ఇంకా నాలుగు రోజులకి.”
“సరి సరి పది రోజులుంటుందన్న మాట. ఊరికి దేని కెళ్ళింది.”
“ఏం పనిలేక.”
“మరే, పెద్ద వాళ్ళకి బోలెడు పనులు. వెళ్ళకపోతే ఎలా?” ధర్మరాజు ఏమిటేమిటో అడుగుతూనే ఉన్నాడు.
జయచిత్ర వ్యాకర్ణ వైపు తిరిగి "తలనొప్పి వచ్చేసిందండీ!” అంది.
వ్యాకర్ణ గాభరాపడుతూ లేచి "ఆస్త్పో తెమ్మంటారా? నవాలజిన్ తేనా? విక్స్ తేనా? అమృతాంజనం తేనా?” అన్నాడు.
“ఏం వద్దు. ఈ జిడ్డు మారాజు వెళితే అదే పోతుంది" అంది.
“ఇటు కాలక్షేపం, అటు మీ తలనొప్పి పోగొడతా చూడండి.” అన్నాడు అబ్బులు.
'ఎలా?” అంది జయచిత్ర.
“వీడు కాకమ్మ కథలు చెప్పటంలో ఉద్ధండ పిండం లేండి" అన్నాడు వ్యాకర్ణ.
“మీకెందుకు , ధర్మరాజుగారి గాలి నా మీదకు మళ్ళేటట్టు చూడండి. మిగతా పని నే కానిస్తాను" అన్నాడు అబ్బులు.
జయచిత్ర వారు పిలుస్తున్రారనే అర్థం వచ్చేటట్లు అబ్బులి వైపు చేయి చూపించింది. ధర్మరాజు అబ్బులి వైపు చూశాడు. అబ్బులు పలకరింపుగా ఓ నవ్వు నవ్వి. “భోజనం అయిందా?” అన్నాడు.