అమ్మో అమ్మాయిలు 22
వ్యాకర్ణ అబ్బులి భూతద్దాల్లో తన చూపు దాచుకున్నాడు.
“అదేమిటే చిత్రా" అంటున్న బామ్మగారిని వారించి "మీకు పని లేదు. నానమ్మకి పని లేదు. నానమ్మ ఎందుకు ఊరికెళ్తుందో మీకెందుకండీ" అంటూ గుర్రుమని చూసింది జయచిత్ర.
“ఊరికే" అన్నాడు అబ్బులు.
“సంతోషం" అని వ్యంగ్యంగా అని బామ్మగారి చేయి పుచ్చుకు లాక్కెళ్ళింది జయచిత్ర.
“అబ్బబ్బబ్బ ఈ పిల్ల పిల్ల కాదురా తుఫాను" అన్నాడు అబ్బులు.
“అయితేనేం బాగుంటుంది" అన్నాడు వ్యాకర్ణ.
“ఉత్త పిల్ల కాదు పులి పిల్ల".
“అయితేనేం బాగుంటుంది".
“బాగుంటే సారా వినయం విధేయత అక్కర్లా. మన మాటలు వినే వుంటుంది. ఎప్పుడో మన భరతం పడుతుంది. వాళ్ల బామ్మని చూడూ ఎలా తరుముకెళ్ళిందో. ఊరికి వెళ్తున్నానని బామ్మగారు చెప్పబట్టే కదా ఊరికెందుకు అని మనం అడిగాం. దాంట్లో తప్పేముందీ. భద్రకాళిలా చూసేసింది".
“కానీ ఇవాళ పుట్టటం వల్లనో ఏమో జయచిత్ర పాలు కారుతూ వుంది" అన్నాడు వ్యాకర్ణ.
“నీళ్ళు కారుతూ లేదూ" అక్కసు వెళ్ళగక్కుతూ అన్నాడు అబ్బులు.
“ఊహూ మళ్ళీ మాట్లాడితే తేనెలూరుతూ పనసతొనలా వుంది".
“మంచిది వెంటనే బహుమతి ఇచ్చేసి రా"
“మనమేదీ కొనలేదుగా ఏం బహుమతి ఇస్తాం"
“మనని అని నన్ను వీడవకు"
“పంచదార చిలకకి పనస తొనకి ఏం బహుమతి ఇస్తారో అది కూడా తెలీదా? ఒంటరిగా వెళ్ళి కాస్త పొడిగి ఒక స్వీట్ కిస్ కుడి బుగ్గమీద ఇవ్వు"
“వెంటనే నాకూ ఇస్తుంది.
“ఏమిటీ"
“దవడపళ్ళు రాలేట్టు లెంపకాయ"
“ఆ మాత్రం గ్రహింపు వుంది కదా. నీకు తెలుసో తెలీదో గానీ ఆ పిల్ల కనబడగానే నీ కళ్ళు, నీ రెప్పలు నీలుక్కుపోయి అలా నిలబడిపోతున్నాయి నాలుగు కాలాలు బతకాలని లేదురా"
“వుందిరా, అదేంటో నా కళ్ళు నా ఒళ్ళు నా ఆధీనంలోఉండటం లేదురా అబ్బూ" బోలెడు దిగులుగా చెప్పాడు వ్యాకర్ణ.
“చ చ చ" అంటూ విచారం వ్యక్తం చేశాడు అబ్బులు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ అంతటితో ప్రసంగం చాలించి స్నానం వగైరాలు కానిచ్చి జయచిత్రకు ప్రెజెంటేషన్ తేవటానికి బజారున పడ్డారు. జజారంతా చెడ తిరిగి షాపులన్నీ గాలించి, ఏం కొనాలో తెలియక ఏదీ నచ్చిక పుస్తకాల షాపులోదూరారు. అందమైన కలలు, ప్రేమలు, అంతకన్న అందమైన యువతీ యువకులువుండే నవలలు అరడజను ఏరారు. సులోచనా రాణి, కౌసల్యాదేవి ప్రేమ నవలలు ఏరి, అందంగా పాక్ చేయించి ఇంటి దారి పట్టారు అబ్బులు వ్యాకర్ణ.
“ఎందుకండీ నా కోసం ఇంత ఖర్చు పెట్టారు. ఇదేం బావుండలేదు నాకు" అని ముద్దు ముద్దుగా ఆ పుస్తకాలు అందుకుని "థాంక్స్" అంది జయచిత్ర.
జయచిత్ర పుస్తకాల పురుగు అని తెలుసుకున్న వ్యాకర్ణ అబ్బులు పొంగిపోయారు. ఏ కళనుందో జయచిత్ర ఆ పూట నవ్వుతూ కాస్సేపు మాటల చెప్పింది. ఆ కాస్సేపూ వీళ్ళూ జోక్స్ కురిపించి నవ్వించారు. అలా జరిగిపోయింది జయచిత్ర పుట్టినరోజు. ఆ రోజు బామ్మగారు ఊరు వెళ్ళిపోయింది. వెళ్ళే ముందు జయచిత్రకు వంద జాగ్రత్తలు చెప్పి, అద్దెకున్న వాళ్ళకు అయిదొందలు జాగ్రత్తలు చెప్పి అబ్బులు, వ్యాకర్ణకు అదనంగా జాగ్రత్తలు చెప్పి వెళ్ళింది