అమ్మో అమ్మాయిలు 21

 

వ్యాకర్ణ అబ్బులు నామధేయంబులు కలిగిన అబ్బాయిలూ బామ్మగారి మాట విని ఓ... అన్నారు ఏక కంఠంతో.

“ఏం లేదురా అబ్బాయిలూ..... నేను ఎల్లుండి ఊరికి వెళ్తున్నాను. అదే మా వాడి దగ్గరికు. మా చిత్రమ్మ తల్లిని రావే అంటే పరీక్షలు దగ్గర పడుతున్నాయి రాను అంది. నేను నాలుగు రోజులుండి వస్తాను. మీరు ఓ కంట మా చిత్రను చూస్తూ వుండండి. నాకేం భయం. ఇండియా జనాభాలా మనింటినిండా జనం వున్నారు అని అది నామీద ఎగురుతుంది. కాలు నొచ్చేను చెయ్యి నొచ్చేను. మనిషికి మనిషి సాయం కావాలి కదా" ఏమంటారు?

“మీరు చెప్పటం మేము కాదనటమూనా. మీరు ఊరెందుకు వెళ్తున్నారు" అని వ్యాకర్ణ అడగగా బామ్మగారు ఏమి చెబుతుందో అని అబ్బులు భూతద్ధాలు సవరించుకుని, చెవులు రిక్కించాడు.

“నేను ఇప్పుడు ఊరు వెళ్ళటం ఎందుకు అంటేఅని అంతటితో ఆపి ఒక్కసారి అంటూ ముళ్ళకిరీటం సవరించుకుని "మా చిత్రమ్మ తల్లి" అంటూ ప్రారంభించి, మాట పూర్తి చేయకముందే ఆపేసింది.

కారణం జయచిత్ర ఎప్పుడొచ్చిందో కానీ, గుమ్మంలో నించుని "నానమ్మా" అంటూ పెద్దగా గావుకేక వేసింది.

“నువ్వేటే చిత్రా... భడవకానా. ఏమిటా గావుకేక. హడలిపోయాను చిన్నగా పిలవలేవూ" అంటూ బామ్మగారు ముద్దుగా కోప్పడింది.

“ఎక్కడకు కూర్చుంటే అక్కడే. అవతల మా ఫ్రెండ్స్ వచ్చారు. బామ్మ ఏదీ అని అడుగుతున్నారు పద పద"

“మీరు ఉదయమే చెప్పాల్సింది మీ బర్డ్ డే అని. ప్రెజెంటేషన్ ఏదన్నా తెచ్చి ముందుగా అందించే వాళ్లం" అన్నాడు వ్యాకర్ణ.

“ఏం తెచ్చేవాళ్ళూ పాలపీకా గిలక్కాయా?” వ్యాకర్ణ అబ్బులు ముఖ ముఖాలు చూసుకున్నారు. ఈ పిల్ల మనం అనుకున్నది విన్నదేమో రోయ్. మన అద్దె కొంప మునిగింది అనుకున్నారు.

“మళ్ళీ వస్తాం నాయనా" అని బామ్మగారు లేచింది.

గబుక్కున గుర్తొచ్చింది వ్యాకర్ణకి" మీరు ఇందాక ఊరెందుకు వెళ్తున్నారో చెప్పబోతూ ఆగిపోయారు బామ్మగారు" అన్నాడు.

“మా చిత్రమ్మ తల్లి...” బామ్మగారు మళ్ళీ మొదలుపెట్టింది.

“నానమ్మా" అంటూ జయచిత్ర అడ్డు తగిలింది ఖంగారుపడుతూ.

“తర్వాత మాట్లాడుకోవచ్చు తొందరగా పద" అని వ్యాకర్ణని నమిలి మింగేసేటట్టు చూసింది.