అమ్మో అమ్మాయిలు 19

 

ఓ రోజు జయచిత్ర పుట్టినరోజు వచ్చింది. జయచిత్ర అన్ని వాటాల్లో వాళ్ళకి స్వీట్స్ పంచిపెట్టింది. జయచిత్రకి ఇష్టం లేదు. బామ్మగారు బాధపడతార ని స్వీట్స్ పంచి పెట్టడం వరకే పరిమితం చేసింది. స్వీట్స్ తీసుకుని వ్యాకర్ణ అబ్బులు వున్న గదిలోకి వచ్చింది.

కట్ డ్రాయర్ ధరించి దండీలు, బస్కీలు తీస్తున్న వ్యాకర్ణ అబ్బులు జయచిత్రని చూస్తూనే గబుక్కున లుంగీలు కట్టుకుని వచ్చారు. 'రాని సమయంలో వచ్చానేమో'' అని నిజంగా సిగ్గుపడింది. జయచిత్ర అడుగులో అడుగు వేస్కుంటూ లోపలికి వచ్చి చేరి రెండు స్వీట్స్ ఇచ్చింది.

స్వీట్స్ పంచిపెడుతున్నారు. విశేషం ఏమిటండోయ్" అన్నాడు అబ్బులు.

“స్వీట్స్ ఎందుకు పంచిపెడతారో కనుక్కోండి" అంది జయచిత్ర.

అబ్బులు కాసేపు ఆలోచించి కనుక్కున్నానన్నట్లు గాలిలో ఓ చిటికెవేసి "ఆ...ఆ తెలిసింది తెలిసింది. పెద్దమనిషి అయినప్పుడు, పేరంటం అప్పుడు, పెళ్ళి చూపులప్పుడు" అంటూ ఇంకా ఏదో గుర్తు చేసుకుని చెప్పబోయాడు అబ్బులు.

వ్యాకర్ణ ని జబ్బ గిల్లాడు. “శీర్షాసనం వద్దురా అంటే రెండుసార్లు వేశావు. తెలివి మితిమీరిపోయింది" అంటూ కోప్పడ్డాడు

“నీవేం ఆసనం అఘోరించలేదుగా. నీ తెలివి చూసి స్వీట్స్ ఎందుకిచ్చారో చెప్పు" అన్నాడు అబ్బులు.

“జయచిత్ర గారినే అడిగితే పోలా" అన్నాడు వ్యాకర్ణ తెలివిగా....

“ఇదా నీ తెలివి! నీ ముఖంలా వుంది" కసురుకున్నాడు అబ్బులు.

"నా ముఖానికేం. కవచ కుండలాలకు తప్ప దేనికి లోటు లేదు ఎన్టి రామారావు చక్రధారి సినిమా తీసేటప్పుడు కాకి చేత కబురంపినా కర్ణుడి పాత్ర వేయటానికి పరిగెత్తుకువెళ్ళేవాడివి. ఈ అబ్బు నాధానికి మూతి మీద పళ్ళున్నాయి. మాటకి ముందు పళ్ళికిలిస్తాడు. మీరు నమ్మండి నమ్మకపోండి జయచిత్ర గారూ. నా చిన్నప్పుడు మా ఊళ్ళో హరిశ్చంద్ర నాటకం వేశారు. నాటకంలో బాలకర్ణుడిగా నన్నే పెట్టుకున్నారు. అదేమిటి మీరు నవ్వుతున్నారు" అన్నాడు వ్యాకర్ణ.

“శీర్షాసనం వేసి అబ్బుగారూ... శీర్షాసనం వెయ్యక మీరూ. ఎందుకులెండి చెబితే మీరు బాధపడతారు" అంటూ నవ్వింది జయచిత్ర.

అబ్బులు, వ్యాకర్ణ నీరు కారిపోతూ నిల్చున్నారు. 'ఈ పిల్ల మరీ ముఖం మీదే నవ్వేస్తుంది. బొత్తిగా మేనర్స్ తెలీదు' అని మనసులో తిట్టుకున్నాడు అబ్బులు.

“జయచిత్ర గడుగ్గాయి. ఓ సారి అల్లరి చేయాలి" అని వ్యాకర్ణ మనసులో మండి పడ్డాడు

జయచిత్రమీద వెంటనే చిరునవ్వు చెమట పట్టిన ముఖాన పులుముకుని పొగడ్త పాఠంలోని 16 అధ్యాయంలోకి వెళ్ళారు "ఏంటో జయచిత్ర గారూ... ఈ రోజు పదమూడేళ్ళ కన్యలా వున్నారు" అన్నాడు వ్యాకర్ణ.

“మరే" అంటూ

తరల తాటించి భూతద్దాలు సవరించుకున్నాడు అబ్బులు. “స్వీట్స్ చాలా తీయగా వున్నాయి"

“మరే... జయచిత్రగారిలాగానే"

“కోపంగా చూస్తున్నా అందంగా వున్నారు"

“వున్నారు వున్నారు ఎందుకని"

“ఏమో"

జయచిత్ర మధ్యలో కలగజేసుకుంది. “నేను వెళ్తున్నాను. మీరిద్దరూ ఇలా వాదులాడుకుంటూ వుండండి. ఈ రోజు స్వీట్స్ పంచి పెట్టడానికి కారణం నా బర్త్ డే" అని అంటూ పారిపోయింది అక్కడనుంచి.

“బర్త్ డే నా" నోరు తెరిచాడు వ్యాకర్ణ.

“అంటే పుట్టినరోజు" తల తడుముకున్నాడు అబ్బులు 'రెండు ఒకటే"

“తెలుసు"

“ఏం తెలుసు"

“రెండు ఒకటే అని... జయచిత్ర బర్త్ డే అని"

“అఘోరించావ్ ముందే చెప్పి ఏడవకూడదూ"

“ఏడవచ్చు నా బర్డ్ డే రోజూ ఏడుస్తారా అని పాత చెప్పు తీస్తుంది"

“పాయింటే ఇప్పుడేం చేద్దాం"

“ఏదన్నా ప్రెజెంటేషన్ కొనిద్దాం"

“ఏం ప్రెజెంటేషన్"

“పాలపీక"

“తీసెయ్"

“పోనీ గిలక్కాయ"

“అదీ తీసెయ్"

“రెండు జెళ్ళ సీత బొమ్మ"

“వద్దు వద్దు అజీర్తి"

“పళ్ళు రాలగొడతాను. ఏది చెప్పినా పనికి రాదంటావేంట్రా"

“జయచిత్ర పాలు తాగే పాపాయేంట్రా? పాల పీకలు, చీర పీలికలు ఇచ్చేదేంటి? బుద్ధుందా లేదా"

“ఉంటే అదేం చేస్తుంది. గడ్డి తింటుందా మనసంటూ వుందా? వుంటే అదేం చేస్తుంది మేత మేయటానికి వెళ్ళిందా?” అంటూ వ్యాకర్ణ కోపగించుకున్నాడు.