అమ్మో అమ్మాయిలు 18
తన ప్రశ్నలకి జవాబిస్తున్నారనుకుని సంతోష పడి "వినయ విధేయతలు మీ వద్ద బాగా వున్నాయి అబ్బాయిలూ, మంచి లక్షణం" అన్నాడు.
“ఇదీ నయమేరోయ్ అబ్బూ. ఈయనకి వినపడి ఛావకపోగా, వినపడినట్టు ప్రశ్నకి సమాధానం చెప్పుకుని ఊరుకుంటున్నాడు. ఏమిటీ ఏమిటీ అని వినబడ్డదాకా వేధించటం లేదు"
“నిజమేన్రోయ్" అంటూ ఒప్పేసుకున్నాడు అబ్బులు.
“మీరు చదివేది ఏమిటోయ్" అని ధర్మరాజు గారి ప్రశ్న.
"వాడు సెక్స్, నేను క్రైమ్"
“అదే మంచిదోయ్. ఐఎఎస్ పరీక్ష పాసవ్వాలంటే మాటలా రాత్రింబవళ్ళూ బాగా చదువుకోండి"
“రామ చంద్ర" అన్నాడు వ్యాకర్ణ.
“ప్రభో" అని పూర్తి చేశాడు అబ్బులు.
జిడ్డు ధర్మరాజు ప్రశ్నలు ఇంకా పూర్తి కాలేదు. “మీ స్వగ్రామం ఏది" అన్నాడు
“అదేలేండి" అన్నాడు అబ్బులు.
“అలాగా"
“మీ అమ్మ నాన్నగార్లు అక్కడే వుంటారా"
“అంతేలెండి"
“ఆయనేం చేస్తున్నారో"
“అదీ అంతేలెండి"
“ఆదాయం అదీ బాగా వస్తుందనుకుంటాను"
“ఇదీ అంతేలెండి" ఇహ నవ్వాపుకోలేక నవ్వేశాడు వ్యాకర్ణ వ్యాకర్ణ నవ్విన తరువాత అంత వరకు నవ్వు బిగబట్టుకున్న అబ్బులు కూడా నవ్వాడు. వీళ్ళిద్దరూ నవ్వటం చూసి, ఆ నవ్వటం తనను చూస్తేనే వచ్చిందనే అనుమానం వచ్చి ధర్మరాజు ముఖం ముడుచుకుని "మళ్ళీ వచ్చి కలుస్తానోయ్ అబ్బాయిలూ" అని లేచి వెళ్ళిపోయాడు విసుగ్గా.
ధర్మరాజు అటు వెళ్ళగానే" జిడ్డు వదిలే ఉపాయం తెల్సిందిరోయ్ అబ్బూ" అన్నాడు వ్యాకర్ణ.
అబ్బులు కళ్లజోడు సవరించుకుని "ఏంట్రా కర్ణ ఆ మహాస్త్రం" అని నవ్వు ఆపేసి సీరియస్ గా ఆడిగాడు అబ్బులు.
“ఏముందీ సింపుల్. ధర్మరాజు ముఖాన నవ్వేయటమే. బస్ జిడ్డు జారుకుంటుంది" అన్నాడు వ్యాకర్ణ.
“మన నవ్వు చూసి ఇది వీళ్ళ అలవాటనుకుని బంకలా పట్టుకు వదలకపోతే" అబ్బులు అనుమానం వ్యక్తం చేశాడు.
“ఏడుద్దాం జాయింట్ గా"
“ఇదీ అలావాటయిపోతే"
“తన్నుకు చద్దాం"
“ఇదీ అలవాటయిపోతే"
“నీ మూతి పళ్ళు రాలగొడతాను"
“ఇదీ అలవాటయి.... ఆ... ఏమిట్రా వాగావ్"
“ఆ జిడ్డు వలింది నువ్వు జిడ్డులా దాపురించావ్"
ఇంకేం మాట్లాడటానికి టాపిక్ లేక నవ్వి నోర్మూసుకున్నాడు.
బామ్మగారింట్లో అబ్బులు వ్యాకర్ణ చేరి వారం రోజులయిందిఅయింది . ఈ వారంలో ఆ కాంపౌండ్ లో వున్న అన్ని కుటుంబాల ఫార్స్ చూశారు. కాకాకీయోం ఉపయోగించి బామ్మగారి వద్ద చనువు సంపాదించి మంచి బుద్ధిమంతులనిపించుకున్నారు. బామ్మగారి కథ కమానిశం తెలుసుకున్నారు. బామ్మగారికి ఒక్కడే కొడుకు. ఆ కొడుక్కి ఒక్కతే కూతురు. ఆ కూతురే బామ్మగారి మనవరాలు జయచిత్ర.
బామ్మగారికి పల్లెటూరిలో ఓ ఇల్లుంది. ఇక్కడికి కాక, జయచిత్ర తల్లి తండ్రి పల్లెటూరిలో ఆ ఇంట్లో వుంటే, జయచిత్ర చదువు కోసం తోడుగా బామ్మగారు ఈ బస్తీలో ఈ ఇంట్లో వుంది. బామ్మగారికి తోడు కోసం బతుకుతెరువు సాధనాలలో కొంపను ముక్కలు ముక్కలు చేసి అద్దెలకి ఇవ్వటం మామూలుగా కాబట్టి బామ్మగారి కొంపను ముక్కలు చేసి అద్దెలకు ఇచ్చారు ఇది కథ.