పురుషులను స్త్రీలుగా మార్చే కుమారవనం

 

నైమిశారణ్యం - 15

శ్రీ మహావిష్ణువు నాభి కమలం నుంచి చతుర్ముఖ ప్రజాపతి (బ్రహ్మ) జన్మించాడు. బ్రహ్మ మానస పుత్రుడుగా మరీచి మహర్షి ఉద్ఢవించాడు. మరీచికి కశ్యప ప్రజాపతి జన్మించాడు. కశ్యపునకు...దక్ష ప్రజాపతి కుమార్తె అయిన అదితితో వివాహం జరిగింది. అదితి, కశ్యపులకు జన్మించినవాడే వివస్వంతుడు (సూర్యుడు). విశ్వకర్మ కుమార్తె అయిన సంఙ్ఞాదేవితో వివాహం జరిగింది. సూర్యునకు సంఙ్ఞ యందు కలిగిన కుమారుడే ‘శ్రాద్ధదేవుడు’. వివస్వంతునకు పుట్టిన కుమారుడు కనుక ఇతనిని ‘ వైవస్వతుడు’ అని కూడా అంటారు. ఇతడే ‘వైవస్వత మనువు’ కూడా. ప్రస్తుతం మనకు జరుగుతున్న మన్వంతరం ‘వైవస్వత మన్వంతరం’. వైవస్వత మనువు భార్య పేరు ‘శ్రద్ధాదేవి’. పుత్ర సంతాన కాంక్షతో వైవస్వత మనువు తన భార్య అయిన శ్రద్ధాదేతో కలిసి వసిష్టుని ఆధ్వర్యాన ఒక యాగం జరిపిస్తున్నాడు. అయితే, శ్రద్ధాదేవికి ఆడపిల్లలంటే ఇష్టం. అందుచేత ఆమె యాగకార్యం నిర్వహించే హోతను పిలిచి ‘స్త్రీ సంతానం’ కలిగేలా యాగం జరిపించమని రహస్యంగా అర్థించింది. ఆ హోత అదే విధంగా మంత్రాలు చదువుతూ యాగం జరిపించాడు. తత్ ఫలితంగా శ్రాద్ధదేవునకు ఆడపిల్ల జన్మించింది.

ఆ పాప పేరు ‘ఇళ’. ఆశ్చర్యపోయిన శ్రాద్ధదేవుడు, వసిష్టుని కలిసి ‘గురుదేవా..పుత్ర కాంక్షతో నేను యాగం చేస్తే..ఆడపిల్ల పుట్టిందేమిటి? మీవంటి మహర్షుల ఆధ్వర్యంలో జరిగిన ఈ యాగంలో ఈ అక్రమం ఎలా జరిగింది.’ అని నిలదీసాడు. వసిష్టడు దివ్యదృష్టితో జరిగినది తెలుసుకుని ‘రాజా..శాంతించు. హోత చేసిన తప్పిదనంవల్ల ఈ పొరపాటు జరిగింది. అయినా చింతించకు. ఈ బాలను నేను బాలునిగా మారుస్తాను.అని చెప్పి, శ్రీ మహావిష్ణువును ప్రార్థించాడు. ఆయన దయదలచి కరుణించగా.., వసిష్టుడు ‘ఇళ’ను బాలునిగా మార్చాడు. ఆ బాలుని పేరు ‘సుద్యుమ్నుడు’. సుద్యుమ్నుడు పెరిగి పెద్దవాడై రాజ్యపాలన బాధ్యతలు స్వీకరించాడు. ఒకరోజు తన పరివారంతో కలిసి సుద్యుమ్నుడు మేరే పర్వత ప్రాంతంలోనున్న కుమారవనంలోకి వేటకు వెళ్లాడు. వారు ఆ వనంలో ప్రవేశించగానే సుద్యుమ్నుడు అతని పరివారం ఆడవారుగా మారిపోయారు. వారి గుర్రాలు కూడా ఆడ గుర్రాలుగా మారిపోయాయి. జరిగిన ఈ విపరీత చర్యకు అందరూ ఆశ్చర్యపోయారు. ఈ మార్పుకు ఓ కారణం ఉంది. కుమారవనం పార్వతీ పరమేశ్వరుల ఏకాంత విహారభూమి. ఒకరోజు కొందరు మహర్షులు పరమేశ్వర దర్శనార్థం కుమారవనంలోకి వచ్చారు. ఆ సమయంలో పార్వతీ పరమేశ్వరులు ఏకాంత శృంగార తపస్సులో ఉన్నారు. మహర్షుల రాకను గమనించిన పార్వతి తటాలున  లేచి, తొలగిన చీరను సర్దుకుని, సిగ్గుతో పక్కకు వెళ్లింది.

రాకూడని సమయంలో వచ్చినందుకు మహర్షులు పశ్చాత్తాపం చెంది, క్షమించమని పరమేశ్వరుని వేడుకుని వెళ్లిపోయారు. అసంతృప్తి చెందిన పార్వతిని.. పరమేశ్వరుడు బుజ్జగిస్తూ.. ‘పార్వతీ బాధపడకు.. ఇక నుంచి ఈ వనంలో ఏ పురుషప్రాణి ప్రవేశించినా..స్త్రీప్రాణిగా మారిపోతుంది ’ అని వరమిచ్చాడు. ఆ కారణంగా సుద్యుమ్నుడు, అతని పరివారం, గుర్రాలు కూడా స్త్రీలుగా మారిపోయారు. తిరిగి ‘ఇళ’గా మారిన సుద్యుమ్నుడు.., చెలికత్తెలుగా మారిన తన అనుచరులతో కలిసి ఆ కుమారవనం వెలుపల విహరిస్తూంటే.., చంద్రుని కుమారుడైన ‘బుధుడు’  ఇళను చూసి, వలచి, మోహించి ఆమెను తనతో తీసుకు పోయాడు. ఇళ, బుధుల ప్రణయానికి ప్రత్యక్షసాక్షిగా పుట్టివాడే ‘పురూరవుడు’. ఈ విధమైన జీవితంతో విసుగు చెందిన ఇళ.., తిరిగి వసిష్టుని ప్రార్థించింది. వసిష్టుడు, శివుని ప్రార్థించి ఇళను తరిగి సుద్యుమ్నునిగా మార్చమని అర్థించాడు. శివుడు కరుణించి .. తాను పర్వతికిచ్చిన మాటకు భంగంకాని విధంగా., ఇళ ఒక నెల స్త్రీగా, ఒక నెల పురుషునిగా ఉండే విధంగా వరమిచ్చాడు. ఇళగా ఉన్నప్పుడు తన రాజమందిరంలో ఉంటూ.., సుద్యుమ్నుడుగా ఉన్నప్పుడు రాజ్యపాలన చేస్తూ కాలం గడుపుతున్నాడు. ఆ కాలంలో సుద్యుమ్నునకు.. ఉత్కళుడు, గయుడు, విమలుడు అను ముగ్గురు కుమారులు కలిగారు. వారు ఉత్తరరాజ్య భాగాలకు రాజులయ్యారు. సుద్యుమ్నునకు ఈ జీవితమంటే రోత పుట్టింది. అతను తన పుత్రుడు పురూరవునకు ప్రతిష్ఠానపుర రాజ్య సింహాసనం  అప్పగించి తపోవనాలకు వెళ్లిపోయాడు.

- యం.వి.యస్.సుబ్రహ్మణ్యం