ఆలపిద్దాం ఆనందభైరవి

ఆలపిద్దాం ఆనందభైరవి శ్రీమతి శారద అశోకవర్ధన్ పుడమితల్లి పొట్టచీల్చుకు పుట్టి     విస్తరించి నేలంతా నిగనిగలాడుతూ నిలిచి     వొయ్యారాలొలికి ఏపుగా ఎదిగి     తుషారబిందువుల మర్దించుకొని     అభ్యంగన వింజామరలను     సాంబ్రాణి ధూపంగా వేసుకుని     ఆకుపచ్చ రంగరించి కోకగా చుట్టుకుని     తూరుపు ప్రసవించిన చుక్కను నుదుట     తిలకంగా దిద్దుకుని     పిటపిటలాడే యౌవ్వనంతో     నోరూరించే జవ్వనిలా     అందాలన్నీ సంతరించుకున్న     ఆమని ప్రియపుత్రికలు గ్రామసీమలు     పౌష్యలక్ష్మీ వరప్రసాదాలు చిక్కని పంటచేలు     నాకు జన్మనిచ్చిన లోగిళ్లు!     ఆకాశాన్ని అందుకోవాలనీ     నీలిమబ్బుల్లో తెలిపోవాలనీ     గగన పుష్పాలుకోసి మణిహారాలుగా చేసి     మెడలో వేసుకోవాలని తపిస్తూ జపిస్తూ     గ్రీష్మంలో ఇనబింబపు పెనంమీద వేగిపోతూ     శిశిరంలో తీసిన సైనికుల్లా నిటారుగా నిలిచి     సరిహద్దు విభజించే కొలబద్దలుగా మిగిలి     నిశ్శబ్దంతో సైతం తియ్యగా మంతనాలాడుతూ     కోత్వధ్వనులు పుట్టిస్తూ తపోధనుల సృష్టిస్తూ     ఓంకారనాదాన్ని దిక్కులు పిక్కుటిల్లేలా ప్రతిధ్వనిస్తూ     తాము బండబరినా గుండె గుండెలో మధువులు నింపి     మమతలు పండించే ప్రకృతి కాంత ఆలయాలు     నా దేశం గర్వించే హిమాలయాలు!     గలగలా పారుతూ బిరబిరా సాగుతూ     దారిల్నీ దరుల్నీ రాసుకుంటూ తోసుకుంటూ     బీడువారిన చేళ్ళనోళ్ళు తడుపుతూ     ఎండిపోయిన యెదల సేదదీరుస్తూ     ఉరుగుల పరుగులతో నురుగుల్ని చిందుకుంటూ     పాపాలనూ శాపాలనూ తామందుకుని     తాపాలను తొలగిస్తూ     జడత్వాన్ని ఝడిపించి వెడలగొట్టి     చైతన్యానికి సంకేతంగా     మనుగడకు మార్గంగా     నిలిచిపోయిన పవిత్ర నదీనదాలు     నాదేశపుటౌన్నత్యానికి చిహ్నాలు!     నాతల్లి పసుపుపారాణి పాదాలు     కాశ్మీరం కన్యాకుమారి ప్రాంతాలు!     పంజాబూ గంజామూ పశ్చిమ బెంగాలు     తెలుగు తమిళ కన్నడ మళయాళ దేశాలు     నాతల్లి మేనులోని వొంపు సొంపుల హొయలు     ఉత్తర భారతం ఆమె పాపిట సింధూరం!     ఇతర దిక్కులు ఆమెకు శృంగార దివ్య అలంకారాలు     వేయేల? పేరేల? ప్రతి ప్రాంతం నాతల్లి మెడలో     ధగధగా మెరిసే వజ్ర వైఢూర్యాల ఆభరణం.     ఈ అందచందాల కదంబాన్ని     జడలో తురుముకున్న నవజవ్వని నన్ను గన్నతల్లి     నాకు ప్రాణంపోసి రూపు దిద్దిన కల్పవల్లి     గంపెడు బిడ్డలను కన్నా గారాబంగా     పెంచిన ఘనత ఆమెకే దక్కింది     ఒక్కొక్కరిని ఆణిముత్యాలుగా తీర్చిదిద్దిన     మురిపెం ఆమెకే మిగిలింది.     సంగీతం సాహిత్యం నాట్యం శిల్పం     అరవై నాలుగు కళలలో ఆమెదే అగ్రస్థానం     ధర్మపీఠానికి ఆమే మూలస్థానం     వేదం ఆమెనాదం!     శాస్త్రం ఆమెశ్వాస!     అటువంటి నాతల్లికి ఏ కంటి దిష్టి తగిలిందో     బెదరగొట్టి చెదర గొడుతున్నాయి     సుందర స్వప్నాల సౌధాలు     బెంబేలెత్తిస్తున్నాయి అణ్వస్తాల     భయంకర భూతపిశాచాలు     నాతల్లెకాడు యావద్ ప్రపంచ తల్లడిల్లిపోతోంది     గడగడలాడి పోతోంది వాటిని చూసి     ఊహకందని పరిణామాలు ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే     గజగజలాడిపోతోంది!     కులమతాల కుళ్లువ్యవస్థ కుష్ఠురోగంలా     పట్టి పీడిస్తూంటే     నివారణోపాయాలు లేక కృంగిపోతూన్న     మానవుడొక పక్కా     కలిమిలేముల ఒడుదుడుకుల ముంగిల్లో     ముద్దాయిలా మాట్లాడలేక     కార్పణ్యంతో బుసలుకొట్టే కోడెనాగులు     విషపుగాలులు మరోపక్కా     ఎరువుతెచ్చుకున్న నాగరికత ముదిరి     వెఱ్ఱితలలు వేస్తూ     నట్టింట్లో నగ్నంగా నర్తిస్తూంటే     రెచ్చగొట్టి జనతను పెడతోవ పట్టిస్తూంటే     మనసున్న మనిషి మనలేకపోతున్నాడు     బ్రతుకుంటేనే భయపడి పోతున్నాడు     మత్తుపదార్ధాల మిశాలో ఉషారుగా తేలిపోయే     తరాన్ని చూసి     బద్దలవుతూన్న గుండెని గుప్పిట్లో పట్టుకొని     బజారుపాలవుతూన్న పరువుని పట్టుకోలేక     ఉస్సురంటున్నాడు     దస్సిపోతున్నాడు!     పైశాచిక శక్తులకు ప్రాణం పోసి     తోటిమనిషి ప్రాణాలతో ఆడుకునే దానవుడిగా     మారిపోయిన మనుష్యుల వికృత చేష్టలను చూసి     మగ్గిబుగై పోతున్నాడు మనసున్న మనిషి-     మారణ హొమాల మంటలనార్పలేక     అండకుండా వ్యవస్థకి దూరంగా పారిపోతున్నాడు     పులినిచూసి పులి ఝడవడం లేదు     మనిషిని చూసి మనిషి బెదిరిపోతున్నాడు       అయినా నేను కృంగి పోను     నిరాశా నిట్టూర్పుల్లో కాలిపోను     తరతరాలుగా నాలో జీర్ణించుకు పోయిన     నా నమ్మకాలు వమ్ముకావు     యుగయుగాలుగా నాలో పాతుకు పోయిన     నరనరాల్లో ప్రవహించే నీతిబోధలు వృధాకావు     నాలో కొత్త ఆశలు రేపుతాయి     నాకు కొత్త ఊపిరి పోసాయి     నాతరం మారుతుంది     భావితరం బాగుపడుతుంది     శ్రామికుడి కళ్లల్లో కాంతిరేఖలు వెలుగుతాయి     కర్షకుడి ఇళ్లల్లో ధాన్యరాసులు నిండుతాయి     భారతావనిలో సమతా మమతలు     హరివిల్లై విరుస్తాయి!        ఎందుకంటే?     సహనం మన ధ్యేయం     శాంతి సాధన మన లక్ష్యం!     కులం మతం భేదం విడిచి     క్రూరత్వానికి కోరలుపీకి     భాషాభేదాలు బీజం మనలో నాటుకోకుండా     ప్రాంతీయ వాదాల తత్వల మనలో చోటు చేసుకోకుండా     చేయి చేయీ కలిపి ఎక్కుదాం ఐక్యత పడవ     చేరుదాం మమకారపు పందిళ్ల కింద తడవ తడవ!     తల్లడిల్లే తల్లి మనస్సును అర్ధం చేసుకుని     కల్లబొల్లి మాటలతో కాలం వృధా పుచ్చకుండా     విజ్ఞానాన్ని విధ్వంసకు వాడకుండా     వినాశనాన్ని కోరకుండా     వేద్దాం శాంతి బాటలు     నిర్మిద్దాం క్రాంతి తోటలు     నవభారత నిర్మాణంలో మనం సైతం     ఒక సమిధగా వెలుగుదాం     చీకట్లను తరుముదాం     ఇక్కట్లను దునుముదాం     అమ్మగుండెకు తగిలిన గాయాలను మాన్పుదాం     భారతావనికేకాదు ప్రపంచ మొత్తానికే     శాంతి సూత్రాలను ప్రభోదిద్దాం     సహనం మన ధ్యేయం     శాంతి సాధన మనలక్ష్యం!     ప్రతి రాష్రం ఒకచుక్కైతే     విడి  విడిగా వున్న చుక్క చక్కనీ     కలిపే చక్కని గీతగా మారుద్దాం     అందమైన ముగ్గుగా తీర్చి దిద్దుదాం     ముగ్గు ముగ్గునూ కలుపుకుంటూ పోయి     ముద్దు ముగిపాలతో వర్దిల్లుద్దాం     ఆడుకుంటూ పాడుకుంటూ ఏకకంఠంతో     ఆలపి ఆనందభైరవిని  

నా కళ్ళు

నా కళ్ళు శ్రీమతి శారద అశోకవర్ధన్ వెలుగు తప్ప వేరేదీ చూడనని భీష్మించుకున్న నా కళ్ళు     అన్నార్తుల ఆకలి మంటలు చూడలేక     ఆర్తితో అలమటించే నా కళ్ళు     అబలల మానభంగాలను చూసి     భరించలేక బావురుమనే నా కళ్ళు     అంధుల చీకటి బ్రతుకుల నాదుకోలేక     విలపించే నా కళ్ళు     దుర్మార్గుల దురంతాలకు     దుఃఖించే నా కళ్ళు     కట్నాల కోసం కట్టుకున్న ఇల్లాలిని     కాల్చి చంపే కిరాతకుల గాంచి     కన్నీరు కార్చే నా కళ్ళు     కడుపునిండా తిండిలేక చెత్తకుండీలోని     ఎంగిలాకుల మెతుకుల నేరుకుని కడుపు నింపుకునే     కటిక దరిద్రులు చూసి కుమిలిపోయే నా కళ్ళు     స్వార్ధపరులు అమాయకులను అందంగా మోసం చేస్తుంటే     కాంచలేక కృంగిపోయే నా కళ్ళు     నా దేశపు గత వైభవాలను నెమరు వేసుకుని     తళతళలాడలేక పోతున్నాయి.     తృప్తిని వెదజల్లి మెరవలేకపోతున్నాయి.     కలవారి వాకిట్లో రంగు రంగుల రంగవల్లులూ     అందమైన పూలకుండీల సోయగాల హరివిల్లులూ     చూసిన నా కళ్ళు     పూరి గుడిసెల ముందు మురికి కాలువల నిండా     చుక్కల్లా కొలువు తీర్చిన ఈగల గుంపులను     తలచుకుని గుండెలవిసేలా విలపించాయి     కన్నీరు కార్చాయి నా కళ్ళు!     కూటికీ నీటికీ కుమ్ములాడుకునే జనాన్ని చూసి     రేపనేది ఎలా వుంటుందో ఊహకందక     బిక్కు బిక్కుమంటూ బిత్తర చూపులు చూశాయి     గతుక్కుమన్నాయి నా కళ్లు!     ఐకమత్యం తరిగిపోయి  అరాచకం పెరిగిపోయి     కులంపేర మతం పేర మానవత్వానికి     సమాధులు కడుతూ వుంటే  మానవుడు     అభిమానం ఆదర్శం అన్నీ తుడిచిపెట్టి     అన్నదమ్ములు స్వార్ధంతో కుస్తీలు పడుతూవుంటే     చూడలేక ఆశ్చర్యంతో గుడ్లప్పగించాయి నా కళ్ళు!     కలత నిండిన నా కళ్ళు క్రాంతి కోసం కాంతి కోసం     కలువరేకుల్లా విచ్చుకుని కాచుకు కూచున్నాయి     కన్నీరు పన్నీరై నిలిచే రోజు కోసం     కోట్ల ఆశలు నింపుకున్నాయి నా కళ్ళు     కలువరేకులై వేచి వున్నాయి  

నా చరిత్ర

నా చరిత్ర శ్రీమతి శారదా అశోకవర్ధన్ నా పుట్టుకే ఒక చరిత్ర     ఈ ధరిత్రిపై సువర్ణ లిఖితమై     నిలిచి వెలిగే పవిత్ర గాథ     నా పుట్టుకే ఒక చరిత్ర.     నేను పుట్టాలని తహ తహ లాడుతూ     వేయికళ్ళతో  ఎదురు చూసే కొందరూ     నన్ను అరికట్టాలని రుసరుస లాడుతూ     కోటి ప్రయత్నాలు చేసిన మరికొందరూ     అందరూ గిజగిజలాడుతూన్న  సమయంలో     నేను పుట్టనే పుట్టేశాను     నా చిరునవ్వుల ఊసులాటలతో     అందరినీ మైమరపించాను.     ఎవరిదారిన వారు నడిచే నా అన్న లిద్దరూ     నేను పుట్టిన క్షణం నుంచి     జతగా నడవడం నేర్చుకున్నారు     పండగకీ పబ్బానికీ కలిసి     నిండుగా నవ్వడం అలవాటు చేసుకున్నారు     కలిమిలో కలలు పెంచుకుని     లేమిలో కన్నీళ్ళు పంచుకుని     ఏపుగా పెరిగారు     చిరునవ్వుతో ఎదిగారు!         ఏ ఖర్మ ఫలమో! ఏనోటి శాపమో !!     ఆ మధ్యన వారి మధ్య ఏర్పడ్డ  పొరపొచ్చాలు     నా గుండెను పిండేశాయి     నా మనస్సును ముక్కలు  ముక్కలు చేశాయి.     అయితే ఏం ?     కుళ్ళుబోతుల కుతంత్రాలు ఫలించలేదు     స్వార్ధపరుల  స్వప్నాలు నిజంకాలేదు.     నా అన్నదమ్ముల అనుబంధాన్ని     ఎవ్వరూ  తెంచలేకపోయారు     వారి మధ్య అల్లుకుపోయిన     అనురాగ లతలను తుంచలేకపోయారు.     నా కళ్ళలో  విరిసింది కొత్తకాంతి     నరనరాన ప్రవహించింది రక్తానికి బదులు శాంతి     నలువైపుల నవరాగ చైతన్య మారుతం వీచింది     మది మృదు మధుర మధుగీతి పాడింది.     నా తెనుగువాడ, అందాలపూల మేడయై నిలిచింది     నా ఎడదలో నావాకిటి ముంగిట్లో     నవ్వినవి విద్యుద్దీప మాలికలు      నేడు ప్రతి ఊరున నిల్చినవి     దీపావళిలా చీకట్లను పారద్రోలి     దీపాల తోరణాలు.     ప్రతి పౌరునికి విద్యామృతము     త్రాపు చూన్నది సరస్వతి స్వయముగా     ప్రతిశ్రామిక జీవికి, జీవితాశలు పండగా     లక్ష్మియే దిగి వచ్చి పంచుతూన్నది     ప్రజాస్వామ్య సంపద.     ఊరూరా పాఠశాలలూ, ఉచిత విద్యా సౌకర్యాలూ     ఆరోగ్యం, ఉద్యోగం, పొందగలిగే అవకాశాలు     ఎన్నెన్నో వెలిశాయి, ఎల్లరినీ ఆహ్వానిస్తున్నాయి.     భుజం భుజం తట్టి, చేయి చేయి కలిపి     ప్రజాబలం సాగుతోంది     సహకారం సమానత్వం మంగళగీతులు     పాడుతోంది.     కృష్ణవేణీ నదీ జలాల నిర్మించారు     నాగార్జున సాగర మహాలయము     కన్నుల విందుచేయు సౌందర్య నిలయమ్ము     చీకటులు గూళ్ళు కట్టిన గుడిసెలలో     ప్రగతి కాంతులు  వీచుచున్నవి     లేమివొడిలో నిదురించిన పేదబతుకులలో     కొత్త ఆశలు మొగ్గ తోడిగినవి.     నేడు అడుగడుగున అగుపిస్తూన్నది     జాతైక్యత, విశ్వప్రేమ కలిసి మెలిసి     నవ్య జీవితాభ్యుదయ మహోత్సవము చేయుచూ     గోదావరీ కృష్ణా కూడి నాట్యమాడుతూన్నవి     మహాంధ్రోదయ సౌభాగ్య మహిమ పాడుతూ         నా పుట్టుకకే ఒక అర్ధమేర్పడింది     నా జీవితానికొక  ధ్యేయమగుపడింది     అందరూ  అంటారు ఇప్పుడు     ఫ్రౌఢత్వంతో పాటు  సకల అందాలను     సంతరించుకున్న నన్ను చూసి,     "ఆంధ్రలక్ష్మీ ! నువ్వెంతో అదృష్టవంతురాలివనీ,     నీ కెంతో రమ్యమైన భవిష్యత్తు వుందనీ !!"     అందుకే నా కనిపిస్తుంది     నా పుట్టుక కాదు చరిత్ర !     నేనే చరిత్రనై నిలవాలని !!

కొత్త దనం

కొత్త దనం శ్రీమతి శారదా అశోకవర్ధన్ నిత్యంలాగే ఉదయిస్తాడు సూర్యుడు ఆ రోజూ...     రోజూలాగే వీస్తుంది గాలి ఆనాడూ...     అయినా ఆనాటికో ప్రత్యేకత!     కలుగుతుంది కొత్త పులకింత!!     అవే పూవులు అవే రాయలు     అదే చేదూ అదే తీపి     అన్నివేళలా  చూస్తూనే వున్నా     ఆరోజే వాటికేదో నూతనత్వం     అందరిలో రెట్టింపు ఉత్సాహం;     నిన్నటిని పాతచొక్కాలా వదిలేసి     ఆనాటిని కొత్తబట్టల్లా వేసుకుని     కొత్త చివుళ్ళలాంటి  ఉవ్విళ్ళూరించే     పచ్చని ఆశల మోపులతో     కోకిలమ్మ కంఠంలోని  కొత్తరాగాలవోలె పలికే     క్రొంగొత్త భావాలతో     హాలాహలాన్ని సయితం హారించుకున్న హరుడిలా     ఆనాడే మనిషిచేదుని దిగమింగే ధీరుడౌతాడు     మర్నాటికల్లా  షరామామూలే     మత్తుదిగిపోయిన తాగుబోతులా     భీరువుగా మిగిలిపోతాడు!     అందుకే నాకనిపిస్తుంది     'కొత్త' రోజుతోనో సంవత్సరంలోనో లేదని     మనలోనే మనమనస్సుల్లోనో వుందని!!     నిత్యంలాగే ఉదయిస్తాడు సూర్యుడు ఆ రోజూ...     రోజూలాగే వీస్తుంది గాలి ఆనాడూ...     అయినా ఆనాటికో ప్రత్యేకత     కలుగుతుంది కొత్త పులకింత!     అవే పూలూ అవే కాయలూ     అదే చేదూ అదే తీపీ     అన్నివేళలా చూస్తూనే వున్నా     ఆ రోజే వాటికేదో నూతనత్వం     అందరితో రెట్టింపు ఉత్సాహం!

నా కంటే బాగా తెలుసా నీకు?

నా కంటే బాగా తెలుసా నీకు? శ్రీమతి శారదా అశోకవర్ధన్ నీతులు చెబుతున్నావా మనిషీ నాకు?     నా కంటే బాగా తెలుసా నీకు?     ఆకలేస్తే విసిరి పారేసిన     ఎంగిలాకులు నాకి     కడుపు నింపుకుంటాను కానీ     అన్యాయం పొట్టలుకొట్టి     పొట్టనింపుకునే     పాడు పనులు చెయ్యను.     ప్రేమతో పాలుపోసి     చేరదీసిన వానికి     ప్రాణం పోయినా     విశ్వాసంతో సేవ చేస్తాను కానీ     స్వార్ధం కోసం     కసాయి వాడిలా         పచ్చినెత్తురు త్రాగే     పరమ కిరాతకుణ్ణి కాలేను     నీతులు చెబుతున్నావా మనిషీ! నాకు     నా కంటే బాగా తెలుసా నీకు?     నాటికి నేటికీ ఒకే విధంగా     ప్రపంచమంతా మారినా     ఇసుమంతైనా మారకుండా     మా జాతిని నిలబెట్టుకున్నాము     మా గౌరవం కాపాడుకున్నాము.     అడుగడుగునా రంగులుమార్చే నీవు     నాగరికత పేరిట     నీ దేశ సభ్యతను మంటగలిపి     పర సంప్రదాయాలతో     ఐకమత్యాన్ని వీడి     ఆత్మవంచన చేసుకుంటూన్న నీవు     నీతులు చెబుతున్నావా నాకు     నాకంటే బాగా తెలుసా నీకు?     ఒక కుక్క మొరిగితే.     పది కుక్కలూ మొరుగుతాయి.     ఒక కుక్కని కొడితే     పది కుక్కలూ మీదపడి     రక్కుతాయి.     ఏదీ మీలో ఈ సహజీవనం?     ఏదీ మీలో ఈ ఐకమత్యం?     పేరు తెచ్చే మచ్చలేని జీవితాలు మావి.     ఇప్పుడు చెప్పు__     నీతులు చెప్పే మనిషీ!     నాకంటే బాగా తెలుసా నీకు?    

వెన్నెల రాత్రి

వెన్నెల రాత్రి శ్రీమతి శారద అశోకవర్ధన్ అది వెన్నెల రాత్రి     కన్నెల హృదయాలను కదిలించే     కమ్మని రాత్రి         వధూవరుల యెదల్లోన     వలపులు చిందించే     పసిడి వెన్నెల రాత్రి.         మగువల మనసుల్లో     మల్లెలు వికసించే     మధురమైన వెన్నెల రాత్రి.     పడుచుదనం     పరవళ్ళు త్రొక్కే     యవ్వనుల కది     పండగ రాత్రి     తొట్టెలోని     చిట్టి పాపల్ని     జోలపాడి ఊరడించే     తల్లులకది     పాలవెన్నెల రాత్రి.     గతంలోని స్మృతులెన్నో     గళమెత్తి పాడుతూంటే     జారిపోయిన యవ్వనాన్ని     జాగృతం చేసే     వెండి వెన్నెల రాత్రి.     చల్లని రాత్రి అది     వెన్నెల రాత్రి కానీ     కట్నాల బరువుతో కృంగిపోతూన్న     కన్నవారి కష్టాలు చూడలేక     కన్నీరు కార్చే కన్నియ కది కాళరాత్రి.     ఆకాశాన్నంటే ధరలతో     చాలీచాలని జీతంతో     సాగుతూన్న జీవితాల కది     మహా శివరాత్రి.     పరిస్థితుల సంకెళ్ళలో చిక్కి     పవిత్రతను సయితం కాపాడుకోలేని     మానినుల కది, మచ్చతెచ్చే     మాయదారి రాత్రి.     పేదవాడి గుడిసెలో     పేలికల జోలెలో     నిదురించే పాపాయికి     వెలుగే చేరని కాటుక రాత్రి     తెలియరాని కలల రాత్రి.     కండరాల కరిగించి     కష్టాల కుంపట్లో  కాలిపోతూన్న     జీవితాల కది     కసితో హసిస్తున్న కటిక అమావాస్య రాత్రి     అయినా,     అది వెన్నెల రాత్రి.

ఒంటరితనం

ఒంటరితనం శ్రీమతి శారద అశోకవర్ధన్ ఒంటరితనాన్ని ఒక్కక్షణమైనా భరించలేను. అంతకన్నా తుంటరుల మధ్య మనగలుగుతా నేను. ఒంటరితనం భయంకర రాక్షసి ఒంటరిని చేసి మనస్సుని, జాలంవేసి పట్టేసి జ్ఞాపకాల గతంలో సముద్రంలోని అలల్లా ఎగిరెగిరి పడేస్తుంది కడలిలోని హోరులా బోరుమని ఏడిపిస్తుంది. అంతటితో ఊరుకోదు ఒంటరితనం ఒక పట్టాన ఒదిలి పెట్టదు గింజుకున్నా మనం వర్తమానపు కోరుకల్ని వలవేసి పట్టేసి సమిధల్లా వాడుతుంది మండుతూన్న మనస్సుకి. ఈ మంటల్లోంచి వెలుగే ఒస్తుందో చీకటే నిలుస్తుందో తెలియని అయోమయావస్థ భవిష్యత్తు చిత్తైన మనస్సుకి ఊహకందని శిఖరాల ఎత్తు. అందుకే నాకు ఒంటరితనమంటే భయం తెలిసిన నిజంకన్న తెలియని అబద్ధం నయంలా, నలుగురిలో వుంటే అన్నీ నవ్వుతూ భరిస్తాను, కానీ ఝడిపించే ఒంటరితనాన్ని ఒక్క క్షణమైనా భరించలేను.

స్నేహమా విడిపోకు నన్ను

స్నేహమా విడిపోకు నన్ను శ్రీమతి శారద అశోకవర్ధన్ స్నేహమా విడిపోకు నన్ను నీవు లేకుంటే లేనేలేను నేను. మనిషికి మనిషికి మధ్య మమతలకు ఆలంబనం నీవు ప్రేమకు మూలం నీవు సృష్టికి కారణం నీవు నీవు లేకుంటే జగతియే లేదు నీవు లేకుంటే లేనేలేను నేను. గొప్ప బీదల తారతమ్యం లేదు నీకు అంతస్థుల ప్రమేయం అసలే లేదు అందుకు నిదర్శనం కుచేలోపాఖ్యానం. అదొక్కటేనా! స్నేహంకోసం ప్రాణాలొడ్డిన కధలెన్నో ! ఆ గాథలెన్నో! స్నేహమా! నీవు త్యాగశీలివి దయామయివి కరుణా ప్రపూర్ణవి. స్వార్ధపు వలయాలు సుళ్ళు తిరుగుతూన్న ఈ రోజుల్లో మంచికి స్థానం ఇవ్వలేరు, ప్రజలు నిన్ను గౌరవించలేరు. నాకు తెలుసు నీ గుణం మరువలేను ఒక్క క్షణం. నీ పేరిట జరుగుతూన్న ఘోరాలు నా ప్రాణాలు తీస్తూన్న ఆయుధాలు. నీ నీడన జరిగే అక్రమాలు యమలోకానికి సోపానాలు. అన్యాయం పెరిగిపోతూన్న ఈనాడు అధర్మం రెచ్చిపోతూన్న ఈరోజు. చావ లేక నిలువ లేక నలిగావు నీవు. మిగిలాను నేను. అయినా నామాట నమ్ము ఇది అక్షరాలా నిజము. నీవు లేకుంటే లేనేలేను నేను ఓ స్నేహమా! విడిపోకు నన్ను.

అమ్మ

అమ్మ శ్రీమతి శారదా అశోకవర్ధన్ నవ మాసములు మోసి నన్ను గన్న ,మాయమ్మ నను జూసి మురిసేను మనసార పిలిచేను. ఆ పిలుపులో వుంది సరికొత్త రాగం ఆ పలుకులో వుంది మృదు మధుర భావం__ అమ్మ అనే తలపులో కమ్మదనం వుంది అమ్మ చూపు ప్రేమలో వెచ్చదనం వుంది. పలుకలేని పసిపాపకి మాట నేర్పును తల్లి ఎ గురలేని పసిగుడ్డుకి ఎగుర నేర్పును పక్షి. మమతానుబంధాలకి మాతృహృదయం నిలయం సమతా స్వభావానికి తల్లి గుణమే సాక్ష్యం. మన్నించును ఎన్ని తప్పులైన ఒప్పులుగా నెంచి ప్రేమించును ఎట్టి వారినైన అన్నీ మరచి అమ్మ అనే తలపులో కమ్మదనం వుంది అమ్మ చూపు ప్రేమలో వెచ్చదనం వుంది. అమ్మ అనే మాటలో హాయి ఎంతో వుంది అమ్మ పేరు తలిస్తే బాధంతా పోతుంది. అమ్మ అనే రెండక్షరాలూ జీవితంలో చెరగని శిలాక్షరాలూ ఆపదలో వున్నా ఏ పనిలో వున్నా అమ్మా అనే మాట అలుపు తీర్చు పాట అనునయించు మాట అనురాగపు బాట ఆనందాల మూట అమ్మ అనే తలపులో కమ్మదనం వుంది అమ్మ చూపు ప్రేమలో వెచ్చదనం వుంది అమ్మ పెట్టు పాలబువ్వ ప్రాణమిచ్చు అమృతం అమ్మపాడు జోలపాట సాటిలేని దీవెన. అమ్మ అనే రూపమే ప్రత్యక్ష దైవము అమ్మలో ఒక భాగమే జీవమున్న మనము. అమ్మ అనే తలపులో కమ్మదనం వుంది అమ్మ చూపు ప్రేమలో వెచ్చదనం వుంది.

ఎవడి గోల వాడిది

ఎవడి గోల వాడిది కండ్లకుంట శరత్ చంద్ర "ఛీ ఛీ....ఈ భావకవిత్వాలతో జనాన్ని నిద్ర పుచ్ఛుతున్నారు" భావకవులను ద్వేషిస్తూ, రింగులు రింగులుగా పొగ ఊదేస్తూ ఆవేశంగా విప్లవగీతాలు రాసిపారేస్తున్నాడు.....ఓ కవి! "విప్లవానికి నిర్వచనం తెలీదు-విప్లవ కవిత్వం రాస్తారట.... హ్హ హ్హ హ్హ హ్హ!"  విప్లవ కవుల్ని ఈసడిస్తూ, కలల్ని భోంచేస్తూ. సుశుప్తావస్టలో భావగీతాలు గీకిపారేస్తున్నాడు ఇంకో కవి! మందు కొడుతూ దిగంబర కవిత్వం రాసి  "వాస్తవాన్ని నగ్నంగా నిలబెడుతున్నా"నంటాడొక మందు జీవి! పెళ్ళాన్ని విరగబాదుతూ, స్త్రీవాద కవిత్వం రాసి, 'స్త్రీలు ఉద్యమించా'లంటాడొక  స్త్రీవాద  కవి!  ఏ.సీ. గదిలో జీడిపప్పు తింటూ, "పెద్దల మాట చెల్లదులే -పేదల మాటే నెగ్గునులే..." అంటూ అఠాణ రాగంలో పాడేందుకు అభ్యుదయ గీతం రాసి... స్వంతకారులో స్టూడియోకి బయలుదేరాడు సినీ కవి! "రాముడు అన్నం తిన్నాడు,నిద్రపోయాడు!" అనే వాక్యాల్ని  "తిన్నాడు రాముడు అన్నం,పోయాడు నిద్ర!"అనే వాక్య నిర్మాణం తో వ్రాసి కవిత్వమంటే అదేనని నమ్మేసి పబ్లిషర్లను వెతుక్కుంటున్నాడు ...ఆ అమాయక ఆశాజీవి! వొంటినిండా బంగారునగలు దిగేసుకుని,పట్టుచీర కట్టుకుని భక్తుల భారీ విరాళాలు స్వీకరిస్తూ... "అశాశ్వతమైన వాటిపై మోజు తగ్గించుకొండి "అని తత్వబొధలు  చేస్తూంది...ఓ ఆధ్యాత్మిక మాత! 'మా మతమే గొప్ప!మీ మతం..అబ్బ- యాక్..థూ!' ప్రతి మతంలోనూ దాగున్న కోట్లాది కుహనావేత్తల భాష! సత్యాన్ని అందరూ తొక్కేస్తే - అది పాతాళ కుహరాల్లొకి జారి  లావాతో కలిసి ప్రవహిస్తోందనీ- క్రోధావేశాలతో జ్వలిస్తోందనీ... సత్యాన్వేశాకులకు తెలీదు...!!!  

నువ్వు వస్తావని

నువ్వు వస్తావని      నువ్వు వస్తున్నావని చిరుగాలి కబురు తెచ్చింది     అది విన్న నా మనసు ఆనందంతో  నాట్యమాడింది     ఇప్పుడే నా చుట్టూ వెన్నెల విరబూసింది     నువ్వు లేక నా కంటి కాటుక కరిగింది     ప్రతిరోజు నా కన్నీరే నాకు తోడుంది     నేను వద్దన్నా నా మనసు నా మాట     వినకుండా నీతో  వచ్చేసింది నీ అండతో నా మనసు నామాట వినను అంటుంది     ఇంతవరకు పెదవులపై చిరునవ్వు దూరమైంది     నువ్వు వచ్చాకే  అది తిరిగి వచ్చింది     వెన్నెలకూడా నాపై ఇన్నాళ్ళు అలిగింది         ఇప్పుడు గుర్తొచ్చానా అని అద్దం నన్నుఅడిగింది.     ఆ ప్రశ్నకి నా సిగలోని  గులాబి  నవ్వింది     ఇది చూసిన నా హృదయం కొంగుచాటున దాగింది     నీలా నేను దాగలేనంటూ నా ముఖం చిన్నబోయింది     నువ్వే నా ఆనందాన్ని తిరిగి తీసుకొచ్చింది  

ఏదయినా పర్వాలేదు! నీ ఇష్టం!

ఏదయినా పర్వాలేదు! నీ ఇష్టం! కండ్లకుంట శరత్ చంద్ర (ప్రేయసీ ప్రియుల మద్య జరిగే సంభాషణ) ప్రియుడు:- లంచ్ ఏం తిందాం? ప్రేయసి:- ఏదయినా పర్వాలేదు.. ప్రియుడు:-సరే,ఐతే నూడిల్స్ తిందాం. ప్రేయసి:-అమ్మో,వద్దు.పొయిన సారి తింటే మొటిమలు వచ్చాయి. ప్రియుడు:-సరే,ఫ్రైడ్ రైస్ తిందాం. ప్రేయసి:-అబ్బా..వద్దు.పొయినసారి అదే తిన్నాం కదా. ప్రియుడు:-ఓక్! ఐతే చికెన్ బిర్యానీ తిందాం. ప్రేయసి:-రేపు ఒక పెళ్ళికి వెళ్ళాలి. అక్కడ తింటాను అది.ఇప్పుడు వద్దు. ప్రియుడు:-సరే మరి, ఇంతకూ ఎం తిందాం? ప్రేయసి:- ఏదయినా పర్వాలేదు.. (మొత్తానికి ఏదో తిని బయటికి వచ్చారు). ప్రియుడు:-ఇప్పుడు ఏం చేద్దాం? ప్రేయసి:-నీ ఇష్టం ప్రియుడు:-సినిమాకు వెళ్దామా? చూసి చాలా రోజులయ్యింది. ప్రేయసి:-అబ్బా..బోర్,టైం వేస్ట్. ప్రియుడు:-పోనీ,టాంక్ బండ్ కి వెళ్దామ. ప్రేయసి:-ఇంత ఎండలోనా? వద్దు. ప్రియుడు:-పొనీ,ఎన్.టీ.ఆర్ గార్డెన్ కి వెళ్దామా? ప్రేయసి:-అబ్బా, ఎన్నిసార్లు వెళ్తాం అక్కడికి? ప్రియుడు:-సరే, నువ్వే చెప్పు ఎక్కడికి వెళ్దాం? ప్రేయసి:-నీ ఇష్టం. (సరే, ఏవో తిరుగుళ్ళు తిరిగారు.) ప్రియుడు:-సరే మరి, ఇళ్ళకు వెళ్ళిపొదాం, రేపు కలుద్దాం.సరేనా? ప్రేయసి:-నీ ఇష్టం. ప్రియుడు:-పద బస్ ఎక్కుదాం. నేనూ సగం దూరం వస్తాను. ప్రేయసి:- అబ్బ,బస్సా!రష్ ఉంటుంది. ప్రియుడు:-సరే,ఆటోలో వెళ్దాం. ప్రేయసి:-ఆటో వాళ్ళు మీటర్ సరిగ్గా వెయ్యరు. ప్రియుడు:-ఐతే, క్యాబ్ లో వెళ్దాం. ప్రేయసి:-క్యాబ్ లో వెళ్ళేంత దూరం లేదుగా. డబ్బు దండగ! ప్రియుడు:-సరే, వాతవరణం బానే ఉంది కదా. నడిచి వెళ్దాం, పద. ప్రేయసి:-అమ్మో,నేను నడవలేను, నాకు ఆకలిగా ఉంది. ప్రియుడు:-సరే, నువ్వే చెప్పు ఏం చెయ్యలో? ప్రేయసి:-నీ ఇష్టం. ప్రియుడు:-డిన్నర్ చేసేసి వెళ్దామా? ప్రేయసి:-నీ ఇష్టం. ప్రియుడు:-ఏం తిందాం? ప్రేయసి:-ఏదయినా పర్వాలేదు.