అమ్మ
posted on Jul 12, 2013
అమ్మ
శ్రీమతి శారదా అశోకవర్ధన్
నవ మాసములు మోసి నన్ను గన్న ,మాయమ్మ
నను జూసి మురిసేను మనసార పిలిచేను.
ఆ పిలుపులో వుంది సరికొత్త రాగం
ఆ పలుకులో వుంది మృదు మధుర భావం__
అమ్మ అనే తలపులో కమ్మదనం వుంది
అమ్మ చూపు ప్రేమలో వెచ్చదనం వుంది.
పలుకలేని పసిపాపకి మాట నేర్పును తల్లి ఎ
గురలేని పసిగుడ్డుకి ఎగుర నేర్పును పక్షి.
మమతానుబంధాలకి మాతృహృదయం నిలయం
సమతా స్వభావానికి తల్లి గుణమే సాక్ష్యం.
మన్నించును ఎన్ని తప్పులైన ఒప్పులుగా నెంచి
ప్రేమించును ఎట్టి వారినైన అన్నీ మరచి
అమ్మ అనే తలపులో కమ్మదనం వుంది
అమ్మ చూపు ప్రేమలో వెచ్చదనం వుంది.
అమ్మ అనే మాటలో హాయి ఎంతో వుంది
అమ్మ పేరు తలిస్తే బాధంతా పోతుంది.
అమ్మ అనే రెండక్షరాలూ జీవితంలో చెరగని శిలాక్షరాలూ
ఆపదలో వున్నా ఏ పనిలో వున్నా అమ్మా అనే మాట
అలుపు తీర్చు పాట అనునయించు మాట
అనురాగపు బాట ఆనందాల మూట
అమ్మ అనే తలపులో కమ్మదనం వుంది
అమ్మ చూపు ప్రేమలో వెచ్చదనం వుంది
అమ్మ పెట్టు పాలబువ్వ ప్రాణమిచ్చు అమృతం
అమ్మపాడు జోలపాట సాటిలేని దీవెన.
అమ్మ అనే రూపమే ప్రత్యక్ష దైవము
అమ్మలో ఒక భాగమే జీవమున్న మనము.
అమ్మ అనే తలపులో కమ్మదనం వుంది
అమ్మ చూపు ప్రేమలో వెచ్చదనం వుంది.