ఐఫోన్ డేటా ధ్వంసం చేసిన బగీరథ్!..పోక్సో కేసులో అదనంగా సాక్ష్యాల మాయం సెక్షన్ జోడించిన పోలీసులు
Publish Date:May 20, 2026
Advertisement
తెలంగాణలో తీవ్ర సంచలనం సృష్టించిన పోక్సో కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఉన్న బండి భగీరథ్ చట్టం కళ్ళు కప్పి తప్పించుకునేందుకు.. పక్కా ప్లాన్ వేశారన్న సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు నేరానికి పాల్పడడమే కాకుండా.. ఆ నేరానికి సంబంధించిన అత్యంత కీలకమైన ఆధారాలను ఉద్దేశపూర్వకంగా మాయం చేసినట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు కాగానే పరారైన భగీరథ్.. పోలీసుల విచారణకు ముందే తన వద్ద ఉన్న సాక్ష్యాలన్నింటినీ ధ్వంసం చేసి, ఆ తరువాతే లొంగిపోయాడని ఉన్నతాధికారులు వెల్లడించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించే సమయంలో పోలీసులకు కేవలం ఒక ఖాళీ మొబైల్ ఫోన్ మాత్రమే లభించింది. అందులో సిమ్ కార్డ్ లేకపోవడంతో అధికారులు గట్టిగా ప్రశ్నించగా, ఎక్కడో పెట్టి మరిచిపోయానని బండి బగీరథ్ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినట్లు సమాచారం. ఈ నెల 8న పేట్‌బషీరాబాగ్ పోలీస్ స్టేషన్‌లో బండి బగీరథ్ పై పోక్సో కేసు నమోదు అయ్యింది. దీంతో బండి బగీరథ్ తన సెల్‌ఫోన్‌ను స్విచ్చాఫ్ చేసినట్లు టెక్నికల్ టీమ్ గుర్తించింది. ఈ క్రమంలోనే చట్టం నుండి పూర్తిగా విముక్తి పొందాలనే దురాలోచనతో బండి బగీరథ్.. తన సోషల్ మీడియా ఖాతాలను డిలీట్ చేయడమే కాకుండా.. తన ఐఫోన్‌ను పలుమార్లు ఫ్యాక్టరీ రీసెట్, ఫార్మాట్ చేసినట్లు విచారణలో తేలింది. సాక్ష్యాలను ఇంత దారుణంగా నాశనం చేయడానికి ప్రయత్నించడంతో.. పోలీసులు సాక్ష్యాలు మాయం చేసినందుకు ఆయనపై కేసులో బీఎన్ఎస్ సెక్షన్ 238ను అదనంగా జోడించారు. అయితే.. ఎంత తెలివిగా సాక్ష్యాలను తారుమారు చేయాలని చూసినా, ఆధునిక టెక్నాలజీతో పోలీసులు బండి బగీరథ్ చుట్టూ ఉచ్చు బిగిస్తున్నారు. ఐఫోన్‌లలో సెక్యూరిటీ ఫీచర్లు అత్యంత కఠినంగా ఉన్నప్పటికీ.. ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ నిపుణుల వద్ద అందుబాటులో ఉన్న అడ్వాన్స్‌డ్ అంతర్జాతీయ సాఫ్ట్‌వేర్ల ద్వారా డేటాను తిరిగి రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయి ఫోరెన్సిక్ టూల్ అయిన సెలిబ్రైట్' వంటి టెక్నాలజీని ఉపయోగించి, ఐఫోన్ లోని నంద ఫ్లాష్ మెమొరీ నుండి డిలీట్ అయిన వివాదాస్పద చాటింగ్స్, వీడియోలు, ఫోటోలను రికవరీ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ లోకల్ మెమొరీ పూర్తిగా డిలీట్ అయినా.. ఐక్లౌడ్ బ్యాకప్ ఆధారంగా ఆపిల్ సంస్థను కోర్టు ద్వారా సంప్రదించి నిందితుడి క్లౌడ్ అకౌంట్ యాక్సెస్‌ను కూడా సేకరించాలని భావిస్తున్నారు. మరోవైపు, నిందితుడి ఫోన్ స్విచ్చాఫ్ చేయడానికి ముందు ఎక్కడ ఉన్నాడు, ఎవరెవరితో మాట్లాడాడు, అతనికి ఆశ్రయం కల్పించిన తెరవెనుక సూత్రధారులు ఎవరు అనే వివరాలను సేకరించేందుకు సెల్ టవర్ మ్యాపింగ్, కాల్ డేటా రికార్డులను పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఒకవేళ నిందితుడి ఫోన్ నుండి డేటా రాబట్టడం సాంకేతికంగా ఆలస్యమైతే.. పోలీసులు బాధితురాలి మొబైల్ ఫోన్ నుండి నిందితుడు పంపిన బెదిరింపు మెసేజ్‌లు, ఫోటోలు, వీడియోలను సేకరించి వాటిని రిసీవ్డ్ డేటా కింద కోర్టు ముందు పటిష్టమైన ప్రాథమిక సాక్ష్యాలుగా ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. పోక్సో కేసులో సాక్ష్యాల ధ్వంసం నేర తీవ్రతను మరింత పెంచుతుందని న్యాయ నిపుణులు అంటున్నారు.
http://www.teluguone.com/news/content/bagirath-destroys-iphone-data-36-220364.html





