పాతిక బంతుల్లోనే సెంచరీ.. కెవిన్ పీటర్సన్ ఛాలెంజ్‌లో వైభవ్ సూర్యవంశీ!
Publish Date:May 25, 2026
Advertisement
ఐపీఎల్ 2026 సీజన్‌లో క్రికెట్ ప్రపంచం మొత్తాన్నీ తన వైపు తిప్పుకున్న సరికొత్త సంచలనం, రాజస్తాన్ రాయల్స్ యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ. కేవలం 15 ఏళ్ల వయసులోనే మైదానంలో పరుగుల విధ్వంసం సృష్టిస్తున్న ఈ టీనేజ్ బాస్ బేబీ తాజాగా మరో రికార్డుతో వార్తల్లో నిలిచాడు. ఇంగ్లండ్ మాజీ లెజెండరీ ఆల్‌రౌండర్ కెవిన్ పీటర్సన్ నిర్వహించిన ఒక ప్రసిద్ధ యూట్యూబ్ టాక్ షోలో పాల్గొన్న వైభవ్.. అక్కడ పీటర్సన్ విసిరిన ఊహించని సవాల్‌ను స్వీకరించాడు. ఆ షోలో వైభవ్ సూర్యవంశీ పాతిక బంతుల్లోనే 100 పరుగులు ( బాది సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు. ఈ ప్రత్యేక ఎపిసోడ్‌లో కెవిన్ పీటర్సన్ ఈ యువ బ్యాటర్‌కు ఒక కఠినమైన ఛాలెంజ్ ఇచ్చాడు. బౌలింగ్ మెషిన్ నుండి వచ్చే వేగవంతమైన బంతులను ఎదుర్కొంటూ 50 బంతుల్లో 100 పరుగులు చేయాలన్నదే ఆ చాలెంజ్. ఆ సవాల్ ను స్వీకరించిన వైభవ్ సూర్యవంశీ.. పీటర్సన్ చెప్పినట్లు 50 బంతులు కాకుండా కేవలం పాతిక బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకుని అబ్బురపరిచాడు. బౌలింగ్ మెషిన్ సంధించిన బంతులను తనదైన శైలిలో మైదానం నలుమూలలా భారీ సిక్సర్లుగా మలిచాడు. ఈ ఇన్నింగ్స్‌లో వైభవ్ 14 సిక్సర్లు, 4 క్లాసిక్ ఫోర్లతో పాటు ఒక డబుల్, రెండు సింగిల్స్ తీసి శతకం పూర్తి చేశాడు. కే ఈ అద్భుతమైన ఫీట్‌తో పీటర్సన్ షోలో అత్యంత వేగంగా సెంచరీలు బాదిన ఆటగాళ్ల జాబితాలో వైభవ్ సూర్యవంశీ రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఇదే షోలో గతంలో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నెలకొల్పిన 22 బంతుల ఆల్-టైమ్ రికార్డును మాత్రం వైభవ్ బద్దలుకొట్టలేకపోయాడు. కేవలం 3 బంతుల తేడాతో అయ్యర్ రికార్డును బ్రేక్ చేసే సువర్ణావకాశాన్ని కోల్పోయాడు. ప్రస్తుతం ఈ జాబితాలో శ్రేయస్ అయ్యర్ (22 బంతులు) మొదటి స్థానంలో ఉండగా, వైభవ్ సూర్యవంశీ (25 బంతులు) రెండో స్థానంలో ఉన్నారు. ఇక వైభవ్ సహచర ఓపెనర్ యశస్వి జైస్వాల్ 47 బంతుల్లో వంద పరుగులు సాధించడం గమనార్హం. ఇదే షోలో సూర్యవంశీ మాట్లాడుతూ.. అంతర్జాతీయ టి20 క్రికెట్ ఫార్మాట్‌లో డబుల్ సెంచరీ చేయడమే తన లక్ష్యమని చెప్పాడు. ప్రస్తుతం టి20 క్రికెట్ చరిత్రలోనే అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డు వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ పేరిట ఉంది. 2013 ఐపీఎల్ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున గేల్ ఈ చారిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడాడు. ఆ యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ రికార్డును బద్దలుకొట్టడంతో పాటు, టి20 ఫార్మాట్‌లో ప్రపంచంలోనే మొట్టమొదటి డబుల్ సెంచరీ చేయడమే తన లక్ష్యమని అని ఈ 15 ఏళ్ల బాస్ బేబీ సూర్యవంశి అన్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2026 సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతున్నాడు. రాజస్తాన్ రాయల్స్ తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఈ యువ ఆటగాడు ఈ సీజన్‌లో మొత్తం 14 మ్యాచ్‌లు ఆడి ఏకంగా 583 పరుగులు సాధించి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.
http://www.teluguone.com/news/content/a-century-in-just-25-balls-36-220826.html





