political-news-img

మమతా బెనర్జీ కారుపై దాడి.. బెంగాల్‌లో తీవ్ర ఉద్రిక్తత..!

పశ్చిమ బెంగాల్‌ రాజకీయంలో మరోసారి తీవ్ర కలకలం రేగింది. పర్యటనలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ వాహనాన్ని ఆందోళనకారులు చుట్టుముట్టి తీవ్ర స్థాయిలో నిరసన తెలిపారు. ఉత్తర 24 పరగణాల జిల్లా పరిధిలోని హలీసహర్‌ ప్రాంతంలో ఆదివారం ఈ ఉద్రిక్త ఘటన చోటుచేసుకుంది. పోలీసు కస్టడీలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన తమ పార్టీ కార్యకర్త బిర్జూ కేఓట్ కుటుంబాన్ని పరామర్శించేందుకు మమతా బెనర్జీ అక్కడికి వెళ్లారు. ఆమె కాన్వాయ్ గ్రామంలోకి ప్రవేశించగానే వందలాది మంది ఆందోళనకారులు ఆమె కారును చుట్టుముట్టారు. వాహనంపై పెద్ద ఎత్తున రాళ్లు, ఇటుకలు రువ్వడమే కాకుండా, బురద చల్లి, చెప్పులు, నీళ్ల బాటిళ్లు విసిరేశారు. నిరసనకారులు మమతను ఉద్దేశించి ‘చోర్ భగావ్’ (దొంగను తరిమికొట్టండి) అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ ఊహించని ఘటనతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా గందరగోళ వాతావరణం ఏర్పడింది. అక్కడే ఉన్న పోలీసులు, భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి నిరసనకారులను చెదరగొట్టి, మమతా బెనర్జీ వాహనాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ దాడి ఘటనపై మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున రాళ్లు, ఇటుకలు విసిరారని, వాహనం కిటికీ అద్దాలు మూసి ఉండకపోతే తన ప్రాణాలే పోయేవని ఆమె వ్యాఖ్యానించారు. పోలీసులు కళ్లముందే ఉన్నప్పటికీ రక్షణ కల్పించడంలో విఫలమయ్యారని, ఇది తనను మట్టుబెట్టేందుకు జరిగిన ముందస్తు కుట్ర అని ఆమె ఆరోపించారు. కొద్ది రోజుల క్రితం హలీసహర్ పోలీసులు ఒక కేసు విషయమై టీఎంసీ కార్యకర్త బిర్జూ కేఓట్‌ను అరెస్ట్ చేశారు. పోలీసు కస్టడీలో ఉండగానే అతని ఆరోగ్యం క్షీణించి మృతి చెందగా, పోలీసుల చిత్రహింసల వల్లే అతను చనిపోయాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై స్థానికుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్న నేపథ్యంలోనే మమత పర్యటన సందర్భంగా నిరసనలు మిన్నంటాయి. మరోవైపు ఈ దాడి ఆరోపణలను రాష్ట్ర బీజేపీ తీవ్రంగా ఖండించింది. హింసాత్మక ఘటనలతో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. స్థానిక ప్రజలే ఆగ్రహంతో నిరసన తెలిపారని పేర్కొంది. అయితే ప్రాంతంలో కావాలనే ఉద్రిక్తతలు పెంచేందుకు మమత వచ్చారని ప్రతిపక్ష నేతలు ఎదురుదాడికి దిగారు. ఈ సంఘటన పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. శాంతిభద్రతల సమస్యపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. ఉద్రిక్తతల దృష్ట్యా హలీసహర్‌లో పోలీసులు భారీగా భద్రతను పెంచారు. ఈ దాడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీఎంసీ వెల్లడించడంతో రానున్న రోజుల్లో బెంగాల్ రాజకీయ పరిణామాలు ఏ మలుపు తిరుగుతాయోనన్న ఉత్కంఠ నెలకొంది. Mamata Banerjee, West Bengal Politics, Mamata Banerjee's car attacked, Halisahar tension, TMC BJP dispute

Publish Date: Aug 9, 2026 5:28PM

political-news-img

పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబానికి కేసీఆర్ పరామర్శ..!

మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి నివాళులర్పించి.. కుటుంబసభ్యులను ఓదార్చిన కేసీఆర్.. ! ఇటీవల అనారోగ్య కారణాలతో అకాల మరణం చెందిన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి నివాసానికి వెళ్లిన బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు దివంగత నాయకుని కుటుంబసభ్యులను ప్రత్యక్షంగా కలిసి పరామర్శించారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి దశదినకర్మ సందర్భంగా వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సుదర్శన్‌రెడ్డి తల్లి, భార్య, పిల్లలతో సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ క్లిష్ట సమయంలో కుటుంబానికి బీఆర్‌ఎస్ పార్టీ అన్ని వేళలా అండగా ఉంటుందని వారికి కొండంత భరోసా ఇచ్చారు. కేసీఆర్ రాకతో నల్లబెల్లి ప్రాంతంలో ఉద్విగ్న వాతావరణం కనిపించగా, గులాబీ శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. తమ అధినేతను చూసేందుకు కార్యకర్తలు మరియు నాయకులు ఒక్కసారిగా ముందుకు రావడంతో నివాసం వద్ద తీవ్ర రద్దీ ఏర్పడి స్వల్ప తోపులాట జరిగింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు పరిస్థితులను చక్కదిద్ది కేసీఆర్ కాన్వాయ్‌ను సురక్షితంగా లోపలికి పంపించారు. దివంగత సుదర్శన్‌రెడ్డి కుటుంబ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని బీఆర్‌ఎస్ పార్టీ తరఫున రూ. 2.25 కోట్ల భారీ ఆర్థిక సాయాన్ని అందించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా సుదర్శన్‌రెడ్డి ఇద్దరు పిల్లల భవిష్యత్తు కోసం చెరో కోటి రూపాయలు, అలాగే ఆయన తల్లి అమృతమ్మ సంరక్షణ నిమిత్తం మరొక రూ. 25 లక్షలను బ్యాంక్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయనున్నారు. నర్సంపేట నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ పార్టీని బలోపేతం చేయడంతో పాటు ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడిన నాయకునిగా సుదర్శన్‌రెడ్డికి మంచి పేరుంది. ఆయన అకాల మరణం పార్టీకి తీరని లోటని, నమ్ముకున్న నేతను కోల్పోవడం వల్ల స్థానిక కార్యకర్తల్లో తీవ్ర విషాదం నెలకొందని పలువురు గులాబీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల చదువులు, ఇతర సంక్షేమ బాధ్యతలను నిరంతరం పర్యవేక్షిస్తామని బీఆర్‌ఎస్ అధినేత తెలపడం పట్ల స్థానిక ప్రజలు, సుదర్శన్‌రెడ్డి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విపత్తు వేళ కేసీఆర్ స్వయంగా వచ్చి ఓదార్చడం ఆ కుటుంబంలో ఎంతో మానసిక ధైర్యాన్ని నింపిందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. నర్సంపేట నియోజకవర్గంలో పెద్ది సుదర్శన్‌రెడ్డి వేసిన మార్గంలోనే ముందుకు సాగుతామని స్థానిక నాయకులు స్పష్టం చేస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఈ కుటుంబానికి అన్ని రకాలుగా సహకరిస్తూ, ప్రజా సమస్యల పరిష్కారంలో ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని బీఆర్‌ఎస్ ప్రతినిధులు తెలిపారు. KCR Nallabelli Visit, Peddi Sudarshan Reddy, BRS Party Financial Assistance, Warangal News Today, Telangana Politics

Publish Date: Aug 9, 2026 5:18PM

political-news-img

బోనాల భద్రతకు పటిష్ఠ బందోబస్తు.. 2,400 మంది పోలీసులతో నిరంతర నిఘా..!

ఆషాఢ మాస బోనాల సందర్భంగా లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిని మహం కాళి అమ్మవారి ఆలయం వద్ద పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆదివారం నగర పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనర్‌, ఐపీఎస్‌ ఆలయ పరిసరా ల్లో భద్రతా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. బోనాల ఉత్సవాలను పురస్కరిం చుకుని ఆలయ పరిసర ప్రాంతాల్లో 48 గంటల పాటు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తుల సహకా రంతో ఉత్సవాలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా కొనసాగుతున్నాయని చెప్పారు. శాంతిభద్రతల పరిరక్షణలో అత్యాధునిక ఏఐ సాంకేతికతను వినియోగిస్తున్నామని సీపీ తెలిపారు. ముఖ్యంగా దొంగతనాలు, చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడే వ్యక్తులను త్వరగా గుర్తించేందుకు ఏఐ ఆధారిత కెమెరాలతో నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు వివరించారు.భద్రతా విధుల కోసం 2,400 మంది పోలీసు సిబ్బందిని రెండు షిఫ్టులుగా విభజించి విధులు కేటాయించినట్లు తెలిపారు. భక్తుల రక్షణ కోసం షీ టీమ్‌లు, క్రైమ్‌ టీమ్‌లను రంగంలోకి దించడంతో పాటు ఆలయాల వద్ద ప్రత్యేక పికెటింగ్‌ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆలయ ప్రాంగణాలతో పాటు బోనాల ఊరేగింపు సాగే మార్గాల్లో డ్రోన్లు, అదనపు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి భద్రతను పర్యవేక్షిస్తున్నట్లు సీపీ వెల్లడించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు బృందాలు నిరంతరం అప్రమత్తంగా ఉంటాయని తెలిపారు. భద్రతా ఏర్పాట్లను సమన్వయం చేసేందుకు లాల్‌దర్వాజా యూనియన్‌ బ్యాంక్‌ వద్ద ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపారు. భక్తులు పోలీసులకు సహకరించి బోనాల ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఆయన సూచించారు. Hyderabad Bonalu, Laldarwaja Mahankali Temple, Ashadha Bonalu Jatara, Minister Seethakka, Telangana Spiritual News, Commissioner VC Sajjanar, She-teams, crime team

Publish Date: Aug 9, 2026 4:49PM

political-news-img

ఆదివాసుల చరిత్రంతా పోరాటాల చరిత్రే : మంత్రి సీతక్క

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ స్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క ముఖ్య అతిథిగా పాల్గొని కొమరం భీం విగ్రహావిష్కరణ చేశారు. అనంతరం సీతక్క మాట్లాడుతు..ఆదివాసుల చరిత్రంతా పోరాటాల చరిత్రే అని మంత్రి సీతక్క అన్నారు. హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం కోసం ఆదివాసులు ఎన్నో పోరాటాలు చేశారని తెలిపారు. సమ్మక్క–సారలమ్మ నుంచి బిర్సా ముండా, రాంజీ గోండు, కొమురం భీమ్ వరకు అనేక మంది ఆదివాసీ నాయకులు పోరాటాలు చేశారని గుర్తు చేశారు. వారి పోరాటాల్లో అనేక మంది ప్రాణత్యాగాలు చేశారని చెప్పారు. రాజ్యాంగం ఆదివాసులకు ప్రత్యేక హక్కులు కల్పించిందని.. ఐదో షెడ్యూల్ ద్వారా ప్రత్యేక రక్షణలు ఉన్నాయని సీతక్క తెలిపారు. అయితే వాటిని సక్రమంగా అమలు చేయకపోవడంతో ఆదివాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. తమకు ఎవరిపైనా శత్రుత్వం లేదని.. ఏ ప్రాంత ప్రజలనూ వ్యతిరేకించడం లేదని స్పష్టం చేశారు. న్యాయంగా దక్కాల్సిన హక్కుల కోసం మాత్రమే పోరాడాలని ఆదివాసులకు పిలుపునిచ్చారు. అడవిపై హక్కులు, ఉద్యోగాలు, ఇళ్లపై హక్కులు తమ ప్రధాన డిమాండ్లని సీతక్క చెప్పారు. అధికారులు పేద ఆదివాసులను, ఇతరులను వేర్వేరుగా చూడకూడదని.. అందరినీ సమానంగా చూడాలని సీతక్క సూచించారు. ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధి, ప్రత్యేక నిధుల కోసం ఆరుగురు ఆదివాసీ ఎమ్మెల్యేలం కలిసి మంత్రులను కలుస్తున్నామని తెలిపారు.ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేదలు, ఆదివాసీలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నారని సీతక్క అన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువ ఇళ్లను కేటాయించిన ఘనత సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి దక్కుతుందని చెప్పారు. కొమురం భీమ్ ‘జల్, జంగల్, జమీన్’ కోసం పోరాడారని.. తెలంగాణ ఉద్యమంలో ‘నీళ్లు, నిధులు, నియామకాలు’ కోసం పోరాడి రాష్ట్రాన్ని సాధించుకున్నామని గుర్తు చేశారు.ఆదివాసులు తమ భాష, వేషధారణ, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలని సీతక్క సూచించారు. ఇవే తమ అస్తిత్వానికి, గుర్తింపునకు ప్రతీకలని అన్నారు. కొమురం భీమ్ ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగాలని ఆదివాసులకు మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. Seethakka,Telangana Minister Seethakka,Tribal Rights, Adivasi Rights, Tribal Welfare, Tribal History,Tribal Struggles, Komaram Bheem, Jal Jangal Zameen,Sammakka Sarakka

Publish Date: Aug 9, 2026 4:41PM

political-news-img

నాలుగేళ్ల కొడుకుని తండ్రి నేలకేసి కొట్టిన ఘటనలో.. చిన్నారి మృతి..!

గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆగస్టు 5న చోటుచేసుకున్న హృదయ విదారక ఘటన విషాదాం తమైంది. తండ్రి దాడిలో తీవ్రంగా గాయపడిన నాలుగేళ్ల బాలుడు అర్మాన్ ఆదివారం చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబ విభేదాల నేపథ్యంలో సల్మాన్ (25) తన నాలుగేళ్ల కుమారుడు అర్మాన్‌ ను తీసుకొని గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని.. పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్ నంబర్ 104 సమీపంలో బాలుడి తల ను పిల్లర్‌కు బలంగా కొట్ట డంతో పాటు, పైకి ఎత్తి నేలపై పడేసినట్లు స్థాని కులు తెలిపారు. అనంతరం బాలుడిని లారీ కిందకు నెట్టేందుకు సల్మాన్ ప్రయత్నించినట్లు సమాచారం. అయితే ఘటనను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి సల్మాన్‌ను అడ్డుకున్నారు. తీవ్రంగా గాయపడిన బాలుడిని అతడి చెర నుంచి రక్షించి, నిందితుడిని పట్టుకుని గుడిమల్కాపూర్ పోలీసులకు అప్పగించారు. తీవ్ర గాయాలతో ఉన్న అర్మాన్‌ను వెంటనే నిలోఫర్ చిన్నపిల్లల ఆస్పత్రికి తరలించారు. ఆగస్టు 5 నుంచి వైద్యులు బాలుడికి చికిత్స అంది స్తున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆదివారం ఉదయం సుమారు 11 గంటల సమయంలో అర్మాన్ మృతి చెందినట్లు వైద్యులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. చిన్నారి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. నాలుగు రోజులుగా మృత్యువుతో పోరాడిన బాలుడు చివరకు ప్రాణాలు కోల్పో వడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. అర్మాన్ మృతిపై సల్మాన్ సోదరుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సల్మాన్‌కు తమ కుటుం బంలో ఎవరూ మద్దతు ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. అతడిని కఠినంగా శిక్షించాలని పోలీస్ కమిషనర్, ప్రభుత్వాన్ని కోరారు. సల్మాన్ తరచూ డ్రగ్స్, ట్యాబ్లెట్లు, మద్యం సేవించే వాడని, అతడి ప్రవర్తన కారణంగా కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొందని సోదరుడు ఆరోపించారు. పెళ్లి తర్వాత సల్మాన్ తన కుటుంబానికే కాకుండా తమకు కూడా తీవ్ర సమస్యగా మారాడని తెలిపారు. సల్మాన్ మా జీవితాలను నరకంగా మార్చాడు. అతనితో మాకు ఎలాంటి సంబంధం లేదు. బాలుడిపై దాడి చేసిన అతడిని జైలుకు పంపించి కఠినంగా శిక్షించాలి’ అని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఘటనపై గుడిమల్కా పూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బాలుడి మృతితో కేసులో తదుపరి చర్యలపై పోలీసులు దృష్టి సారించారు. Four yearold boy Armaan, Salman, Gudimalkapur Police, PVNR Express, CM Revanth reddy, Nilofer Childrens Hospital, CP Sajjanar

Publish Date: Aug 9, 2026 4:16PM

political-news-img

ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు.. ఆగస్టు 17 నుంచి ప్రారంభం..!

ఆంధ్రప్రదేశ్ రాజకీయం మరోసారి తీవ్ర రసవత్తరంగా మారబోతోంది. రాష్ట్ర శాసనసభ, శాసనమండలి వర్షాకాల సమావేశాల నిర్వహణకు సంబంధించిన అధికారిక ముహూర్తం ఖరారైంది. ఈ నెల 17వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నట్లు రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అధికారిక నోటిఫికేషన్‌ను జారీ చేశారు. ఈ సారి శాసనసభ సమావేశాల్లో అనేక కీలకమైన బిల్లులు, ప్రజోపయోగ నిర్ణయాలపై విస్తృత స్థాయి చర్చ జరగనుంది. గవర్నర్ జారీ చేసిన ప్రకటన వివరాల ప్రకారం, ఈ నెల 17వ తేదీ ఉదయం 9:00 గంటలకు శాసనసభ సమావేశాలు అధికారికంగా ప్రారంభమవుతాయి. అదే విధంగా ఉదయం 10:00 గంటలకు శాసన మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. విశేషమేమిటంటే, ఇది ఆంధ్రప్రదేశ్ శాసనసభ చరిత్రలోనే మైలురాయిగా నిలిచే 50వ వర్షాకాల సమావేశం కావడం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఐదు దశాబ్దాల వర్షాకాల సమావేశాల చరిత్రలో ఈ 50వ సమావేశం ఒక ప్రత్యేక అధ్యాయంగా నిలవబోతోంది. ఈ చారిత్రాత్మక ఘట్టంలో శాసనసభ పరిధిలో జరిగే చర్చలు, నిర్ణయాలపై రాష్ట్ర ప్రజలందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సమావేశాల తొలిరోజైన 17వ తేదీ ఉదయమే ఉభయ సభల బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) అత్యవసరంగా భేటీ కానుంది. స్పీకర్ అధ్యక్షతన జరిగే ఈ కీలక సమావేశంలో శాసనసభను ఎన్ని రోజుల పాటు నిర్వహించాలి, సభలో ఏ ఏ ప్రజా సమస్యలపై ప్రాధాన్యత ప్రకారం చర్చించాలి, ప్రభుత్వం వైపు నుంచి ప్రవేశపెట్టే బిల్లులు ఏమిటి అనే సమగ్రమైన అజెండాను ఖరారు చేస్తారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ వర్షాకాల సమావేశాలు మొత్తం నాలుగు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది. తక్కువ రోజుల వ్యవధి ఉన్నప్పటికీ, సభను అత్యంత సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పలు కీలకమైన ప్రజా సమస్యలు, రైతాంగ సంక్షేమం, శాంతిభద్రతలు, మౌలిక వసతులు, మరియు అభివృద్ధి కార్యక్రమాలపై ఈ సమావేశాల్లో ఉభయ సభల సభ్యులు విస్తృతంగా చర్చించనున్నారు. అదే సమయంలో ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే పలు ముఖ్యమైన సవరణ బిల్లులకు ఉభయ సభలు ఆమోదం తెలపనున్నాయి. ప్రతిపక్షాలు సైతం ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమవుతుండటంతో, నాలుగు రోజుల పాటు జరిగే ఈ అసెంబ్లీ సమావేశాలు ఎంతో హీటెక్కనున్నాయి. అమరావతి శాసనసభ ప్రాంగణంలో భద్రతను పటిష్టం చేయడంతో పాటు అన్ని రకాల సదుపాయాలను సిద్ధం చేశారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అమరావతి పరిసర ప్రాంతాల్లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. 50వ వర్షాకాల సమావేశాల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి ప్రజలు, రాజకీయ విశ్లేషకులు సభలో జరిగే పరిణామాలపై దృష్టి సారించారు. ఉదయం 9:00 గంటలకు అసెంబ్లీ, 10:00 గంటలకు మండలి ప్రారంభం కానుండగా, బీఏసీ నిర్ణయం ఆధారంగా చర్చల శైలి ఖరారు కానుంది. నాలుగు రోజుల పాటు సాగే ఈ సభలలో రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి ఏ విధమైన కీలక నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది. AP Assembly Monsoon Session 2026, AP Legislative Council, Governor Abdul Nazeer Notification, August 17 Assembly Session, Andhra Pradesh Politics, AP Assembly BAC Meeting

Publish Date: Aug 9, 2026 3:37PM

MOVIE NEWS