తమిళనాడు అసెంబ్లీలో కుప్పం ఎయిర్ పోర్టు ప్రస్తావన.. లింకేంటి?
తమిళనాడు అసెంబ్లీలో కుప్పం ఎయిర్ పోర్టు ప్రస్తావన.. లింకేంటి?

ఏపీ సీఎం చంద్రబాబు తాను ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గ అభివృద్ధి విషయంలో తగ్గేదేలే అన్నట్లుగా ముందుు సాగుతున్నారు. ఆ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుప్పంలో విమానాశ్రయం ఏర్పాటు చేయతలపెట్టింది. అయితే కుప్పంలో ఏపీ ప్రభుత్వంనిర్మించతలపెట్టిన విమానాశ్రయం తమిళనాడు రాజకీయాల్లో హీట్ పెంచింది. తమిళనాడుఅసెంబ్లీ వేదికగా హోసూరు విమానాశ్రయ ప్రాజెక్టు నిర్మాణంపై జరిగిన చర్చలో కుప్పం విమానాశ్రయం ప్రస్తావనకు వచ్చింది. తమిళనాడు శాసనసభ సమావేశాల సందర్భంగా డిఎంకె ఎమ్మెల్యే శ్రీనివాసన్ హోసూరు ఎయిర్‌పోర్ట్ ప్రతిపాదనపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తమిళనాడులోని హోసూరు సమీపంలో ఎయిర్‌పోర్ట్ రాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయంటూ ఆరోపణలు చేశారు. సరిహద్దు ప్రాంతాల అభివృద్ధితో పాటు పారిశ్రామిక పురోగతికి హోసూరు ఎయిర్‌పోర్ట్ కీలకమని, ఇతర రాష్ట్రాల వ్యూహాల వల్ల ఈ ప్రాజెక్టు ఆలస్యమవుతోందని ఆయన ఆరోపించారు. శాసనసభలో ఎడీఎంకే మ్మెల్యే ఈ ఆరోపణలను తమిళనాడు పరిశ్రమల శాఖ మంత్రి తోసిపుచ్చారు. హోసూరు ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్టును ఇతర పొరుగు రాష్ట్రాలేవీ అడ్డుకోవడం లేదంటూ.. సోషల్ మీడియా ప్రచారాలనూ, నిరాధార వార్తలనూ నమ్మి అసెంబ్లీ వేదికగా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం తగదని మంత్రి నిష్కర్షగా చెప్పారు. హోసూరు విమానాశ్రయ ప్రాజెక్టు పురోగతికి సంబంధించి ఆధారాలతో మాట్లాడాలన్నారు. అసలు కుప్పంలో విమానాశ్రయం, హోసూరు ఎయిర్ పోర్టులకు లింకేంటి? కుప్పం విమానాశ్రయం గురించి తమిళనాడు అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం లేవనెత్తిన అభ్యంతరమేంటి? అంటే.. వాస్తవానికి హోసూరు ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్టు పలు సాంకేతిక సవాళ్లను ఎదుర్కొంటోంది. కర్ణాటక రాజధాని బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి హోసూరు అత్యంత సమీపంలో ఉంటుంది. విమానయాన నిబంధనల ప్రకారం ఒక ప్రధాన విమానాశ్రయానికి నిర్ణీత దూరంలో మరొక విమానాశ్రయాన్ని నిర్మించడంపై పరిమితులు ఉన్నాయి. దీనికితోడు హోసూరు ప్రాంతంలో హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ పరిశోధనా కేంద్రాలు, సంస్థలు ఉండటం వల్ల ఆ పరిసరాల్లో విమానాల రాకపోకలపై భద్రత దృష్ట్యా ఆంక్షలు ఉన్నాయి. ఈ కారణాల వల్ల హోసూరు విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వ అనుమతులు ఇవ్వడానికి ముందు వెనుకలాడుతోంది. అయితే బెంగళూరుకు సమీపంలోనే నిర్మించతలపెట్టిన ఆంధ్రప్రదేశ్‌లోని కుప్పం ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్టు కు సంబంధించిన పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయి. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం కూడా కుప్పంకు దగ్గరగానే ఉన్నప్పటికీ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్థవంతంగా సంప్రదింపులు జరిపింది. ఏపీ సర్కార్ బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ నుంచి కుప్పం ఎయిర్ పోర్టుకు అవసరమైన షరతులతో కూడిన నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ను విజయవంతంగా సాధించింది. దీంతో కుప్పం విమానాశ్రయ సాధ్యాసాధ్యాల అధ్యయనం జాప్యం లేకుండా పూర్తయ్యింది. కుప్పం వద్ద విమానాశ్రయం నిర్మాణం చేపడుతుండటంతో ప్రాజెక్టుకు దాదాపు 1,788 ఎకరాల భూమి అవసరమని అధికారులు అంచనా వేశారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే సుమారు 1,300 ఎకరాల భూసేకరణను పూర్తి చేసింది. ఈ ఎయిర్‌పోర్ట్‌ను క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ నమూనాలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. విమానాశ్రయ నిర్మాణం, తదనంతర నిర్వహణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా పర్యవేక్షించేలా నిర్ణయం జరిగింది. కుప్పం విమానాశ్రయం అందుబాటులోకి వస్తే ఉమ్మడి చిత్తూరు జిల్లాతో పాటు పరిసర సరిహద్దు ప్రాంతాల రూపురేకలు మారిపోతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. కుప్పం ప్రధాన లాజిస్టిక్స్ హబ్‌గా మారడమే కాకుండా, ఈ ప్రాంతంలో పరిశ్రమల స్థాపనకు ప్రాధాన్యం పెరుగుతుంది. స్థానిక రైతులకు, ఉద్యానవన పంటల సాగుదారులకు ఈ విమానాశ్రయం ఎంతో ప్రయోజనకరంగా మారుతుంది. తాజా పండ్లు, కూరగాయలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను దేశ విదేశీ మార్కెట్లకు వేగంగా ఎగుమతి చేయడానికి దోహదపడుతుంది. ఒకే భౌగోళిక ప్రాంతానికి సమీపంలో ఉన్న కుప్పం విమానాశ్రయం అనుమతులు సాధించి పనుల్లో ముందంజ వేస్తుండగా.. హోసూరు ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్టు పురోగతి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. ఇదే తమిళనాడు రాజకీయాలలో కాకరేపుతోంది. Kuppam Airport, Tamil Nadu Assembly, Hosur Airport, Andhra Pradesh Infrastructure, Bengaluru Airport NOC

Publish Date: Aug 13, 2026 3:23PM
పవన్ కల్యాణ్ ను వదిలేసి.. తెలుగుదేశం టార్గెట్.. వైసీపీ వ్యూహమేంటి?
పవన్ కల్యాణ్ ను వదిలేసి.. తెలుగుదేశం టార్గెట్.. వైసీపీ వ్యూహమేంటి?

గత ఎన్నికలకు ముందు అంటే 2024 ఎన్నికలకు ముందు వరకూ జగన్ తన విమర్శలను పవన్ కల్యాణ్ పై ఎక్కు పెట్టారు. అందరూ వ్యతిరేకిస్తున్నా.. పవన్ వ్యక్తిగత వ్యవహారాలను తరచురగా ప్రస్తావిస్తూ వచ్చే వారు. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తెలుగుదేశం కూటమిలో మూడు పార్టీలు ఉంటే.. వాటిలో రెండింటిని వదిలేసి వైసీపీ ఇప్పుడు కేవలం తెలుగుదేశం పార్టీనే టార్గెట్ చేసుకుని విమర్శలు సంధిస్తోంది. ఆరోపణలు గుప్పిస్తోంది. ఇందుకు కారణం ఏంటి? వైసీపీ వ్యూహం ఏంటి? అన్న చర్చ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై గతంలో తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన వైసీపీ.. ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయిపోయింది. దీని వెనుక వైసీపీ 2029 ఎన్నికల వ్యూహం ఉందంటున్నారు పరిశీలకులు. కేవలం రాజకీయ విమర్శల విషయంలో వచ్చిన మార్పు కాదనీ, 2029 ఎన్నికల దిశగా వైసీపీ వైసీపీ వ్యూహాత్మకంగా ముందుకు కదులుతోందంటున్నారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో మూడు పార్టీలు ఉన్నాయి. అయితే వైసీపీ మాత్రం తెలుగుదేశం పార్టీని మాత్రమే టార్గోట్ చేసింది. ప్రభుత్వంలో నిర్ణయాలను తూర్పారపడుతూ చేస్తున్న విమర్శల్లోనూ, ఏదైనా సమస్య ఉత్పన్నమైతే.. కూటమిలో తెలుగుదేశం తరువాత పెద్ద భాగస్వామ్య పార్టీగా ఉన్న జనసేననూ, బీజేపీనీ వదిలేసి తెలుగుదేశం పార్టీపైనే విమర్శలు గుప్పిస్తోంది. వైసీపీ అధినేత సహా ఆ పార్టీ నేతలు చంద్రబాబు, లోకేష్, అలాగే తెలుగుదేశం మంత్రులను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. జనసేన పైనా, ఆ పార్టీకి చెందిన మంత్రులపైనా ఎటువంటి విమర్శలూ వైసీపీ నుంచి రావడం లేదు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాగే ఆ పార్టీకి చెందిన నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ లు కీలక మంత్రిత్వ శాఖలు చూస్తున్నారు. అయితే వారి శాఖలకు సంబంధించిన అంశాలపై విమర్శలు గుప్పించాలన్న వైసీపీ తెలుగుదేశం పార్టీనీ, ఆ పార్టీకి చెందిన మంత్రులనే టార్గెట్ చేసుకుంటోంది. 2024 ఎన్నికల్లో పవన్‌ను టార్గెట్ చేసిన తీరు వైసీపీకి రాజకీయంగా నష్టం చేసిందని వైసీసీ భావిస్తోంది. అందుకు విమర్శల జోలికి పోకుండా ఉంటేనే బెటర్ అని భావిస్తోంది. అంతకు మించి.. ఒకే సారి జనసేన, తెలుగుదేశంలు టార్గెట్ గా ముందుకు వెడితో.. ఒకే సారి ఇద్దరు ప్రత్యర్థులతో తలపడాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీకి అంత బలం, శక్తి, క్యాడర్, నాయకత్వం కూడా లేదు. అందుకు ఉన్న పరిమితుల్లోనే తెలుగుదేశం పార్టీని టార్గోట్ చేస్తే.. వచ్చే ఎన్నికల నాటికి జనసేన నుంచి వైసీపీ టార్గెట్ గా విమర్శల తీవ్రత పెద్దగా ఉండదని వైసీపీ భావిస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జనసేనకు ఉన్న సామాజిక, రాజకీయ ప్రభావాన్ని వైసీపీ ఇప్పుడు మరింత జాగ్రత్తగా చూస్తోందని కొందరు విశ్లేషకులు అంటున్నారు.అలాగే వచ్చే ఎన్నికల నాటికి కూటమి ఇన్ టాక్ట్ గా ఉన్న పరిస్థితి తెలుగుదేశం వర్సెస్ వైసీపీ అన్నట్లుగా మారిపోతుందని వైసీపీ భావిస్తుంది. అప్పుడు ఎన్నికలలో కూటమిగా మూడు పార్టీలూ కలిసి పోటీ చేసినా.. కూటమి ఇంపాక్ట్ కంటే తెలుగుదేశం, వైసీపీ వార్ అన్న ఇంపాక్టే ఉంటుందని, అది తమకు రాజకీయంగా లబ్ధి చేకూరుస్తుందని బీజేపీ భావిస్తున్నట్లుగా పరిశీలకులు అంటున్నారు.

Publish Date: Aug 12, 2026 1:30PM
జగన్ తీరు.. వైసీపీ బేజారు.!
జగన్ తీరు.. వైసీపీ బేజారు.!

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరి రెండేళ్లయ్యింది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి సమన్వయంతో ముందుకు సాగుతోంది. క్షేత్రస్థాయిలో కూటమి భాగస్వామ్య పార్టీల నేతలు, శ్రేణుల మధ్య ఏవైనా ఇబ్బందులూ, విభేదాలూ పొడసూపినా.. అగ్రనాయకత్వం జాప్యం లేకుండా జోక్యం చేసుకుని, అవి మరింత ముదరకుండా చర్యలు తీసుకుంటోంది. మరో వైపు 2024 ఎన్నికలలో 11 సీట్లకే పరిమితమైన ఘోర పరాజయం పాలైన వైసీపీ ఈ రెండేళ్లలోనూ ఇసుమంతైనా కోలుకున్నట్లు కనిపించదు. అందుకు ప్రధాన కారణం.. ప్రజలు తిరస్కరించినా, ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకపోయినా, ఆ హోదా కోసం నానాయాగీ చేస్తూ, మంకుపట్టుపట్టి ప్రజల దృష్టిలో మరింత చులకల అయ్యింది. ప్రతిపక్ష హోదా కోసం అభ్యర్థించడం, డిమాండ్ చేయడం, చివరకు కోర్టుకు కూడా వెళ్లి జగన్ వృధా ప్రయత్నాలు చేశారు. చివరకు విపక్ష హోదా కోసం అలిగి అసెంబ్లీ బాయ్ కాట్ చేశారు. ఈ రెండేళ్ల కాలంలో జగన్ రెండు మూడు సార్లు వినా అసెంబ్లీకి వెళ్లింది లేదు. జగన్ మాత్రమే కాదు.. ఆయనతో సహా వైసీపీ ఎమ్మెల్యేలెవరూ అసెంబ్లీ ముఖం చూడటం లేదు. కేవలం అహంభావంతో ఆయన విపక్ష హోదా కోసం పట్టుబట్టి అసెంబ్లీకి ముఖం చాటేసి పార్టీకి మరింత నష్టం చేస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏం చేసినా ఆయనకు ప్రతిపక్ష నాయకుడి హోదా, వైపీ ప్రతిపక్ష పార్టీ గుర్తింపు దక్కే అవకాశాలు ఇసుమంతైనా లేవని విస్పష్టంగా చెబుతున్నారు. ఇక వైసీపీలో విషయ జ్ణానం ఉన్న వారందరికీ కూడా ఈ వ ిషయం తెలిసినప్పటికీ ఆ సంగతిని జగన్ కు చెప్పే ధైర్యం చేయలేకపోతున్నారని పరిశీలకులు అంటున్నారు. అంతెందుకు జగన్ మద్దతు దారు అయిన ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా విపక్ష హోదా కోసం జగన్ తాపత్రేయపడటం శుద్ధ వేస్టని కుండబద్దలు కొట్టేశారు కూడా. ఎంత పాకులాడినా ఆయనకు విపక్ష నేత హోదా వచ్చే అవకాశం లేదనీ, ఆ విషయంలో జగన్ చేస్తున్నదంతా వృధా ప్రయాసేనని గతంలోనే కుండబద్దలు కొట్టేశారు. రాజ్యాంగబద్ధంగా రాని…ప్రజలు ఇవ్వని విపక్ష హోదా కోసం జగన్ పోరాడి ఉపయోగం లేదు. అయినా ప్రజా సమస్యలపై పోరాడడానికి ప్రతిపక్ష హోదా అవసరం ఏముందని పరిశీలకులు అంటున్నారు. అయితే ఆ విషయాన్ని గుర్తించని, లేదా గుర్తించడానికి ఇష్టపడని జగన్.. తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లన్నట్లుగా వ్యవహరిస్తూ.. పార్టీ ప్రతిష్ఠను మరింత మసకబారుస్తున్నారు. ఆయన తీరు ఇలాగే ఉంటే.. రాష్ట్రంలో పార్టీ ఉనికి మాత్రంగా మిగిలే అవకాశం కూడా ఉండదనీ, ఈ విషయాన్ని జగన్ ఎంత త్వరగా గుర్తిస్తే ఆయనకు రాజకీయంగా అంత మేలు జరుగుతుందని అంటున్నారు. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు కనుకే తాను అసెంబ్లీకి రావడం లేదని జగన్ అంటున్నా.. సీఎంగా చక్రం తిప్పిన అసెంబ్లీలో ఇప్పుడు ఒక సాధారణ ఎమ్మెల్యేగా కూర్చోవడానికి జగన్ కు అహం అడ్డొస్తోందనీ, ఆ కారణంగానే ఆయన అసెంబ్లీకి డుమ్మా కొడుతున్నారన్న అభిప్రాయం రాజకీయవర్గాలలో వ్యక్తమౌతోంది. . ఇక ప్రస్తుతానికి వస్తే..రాష్ట్రంలో వైసీపీ అధికారం కోల్పోయి రెండేళ్లయ్యింది. ఈ రెండేళ్లలో జగన్ ప్రజాక్షేత్రంలోకి వచ్చింది లేదు. బెంగళూరు ప్యాలెస్ కు పరిమితమై ఏదో చుట్టపు చూపుగా ఏపీకి వస్తున్నారు. అలా వచ్చి కూడా ప్రెస్ మీట్ లకే పరిమితమై ప్రజలకు దూరంగానే ఉంటున్నారు. అధవా బయటకు వచ్చినా.. పరామర్శ యాత్రల పేర బల ప్రదర్శన చేస్తున్నారు. ఆయన బయటకు వచ్చిన ప్రతి సారి ఏదో ఒక సమస్యతో పార్టీ, శ్రేణులూ చిక్కుల్లో పడుతున్నారు. లా అండ్ ఆర్డర్ సమస్య ఉత్పన్నమౌతోంది. అయినా.. పార్టీ నాయకులు బయటకు వచ్చి నిరసన కార్యక్రమాలు నిర్వహించమని జగన్ అప్పుడప్పుడు పిలుపునిస్తున్నారు. అయితే సమస్య ఏంటంటే.. జగన్ స్వయంగా పిలుపునిచ్చిన నిరసన కార్యక్రమాలలో ఆయన పాల్గొనరు. దీంతో వైసీపీ నిరసనలు తూతూమంత్రంగానే మిగిలిపోతున్నాయి. జగన్ క్షేత్రస్థాయిలోకి రాకుండా ఆ పార్టీ పుంజుకునే అవకాశాలు దాదాపు మృగ్యమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికైనా అంటే ఘోర పరాజయానికి రెండేళ్లు పూర్తయిన తరువాతైనా వాస్తవం గ్రహించి అసెంబ్లీ సమావేశాలకు హాజరౌతారేమో అన్ని చిన్న ఆశ ఆ పార్టీ నేతలు, శ్రేణుల్లో నిన్నమొన్నటి వరకూ ఉండేది. కానీ సోమవారం (ఆగస్టు 10) నుంచి ఆరంభమైన అసెంబ్లీ సమావేశాలకు కూడా జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు గైర్హాజర్ కావడంతో ఆ ఆశ కూడా అడుగంటి పోయింది. క్షేత్రస్థాయిలోనూ, అసెంబ్లీలోనూ జగన్ లేకపోవడంతో.. ఈ రెండేళ్లలో వైసీపీ రాష్ట్రంలో పట్టు కోల్పోయింది. జగన్ ఇప్పటికైనా వాస్తవం గ్రహించి తీరు మార్చుకోకుంటే.. తమ రాజకీయ భవిష్యత ఏమిటి? అన్న బెంగ వైసీపీయులలో కనిపిస్తోంది. Jagan, AP Assembly Sessions, YCP, Jagan Assembly Attendance, AP Politics, Teluguone

Publish Date: Aug 11, 2026 9:20AM
వల్లభనేని వంశీ.. రాజకీయ అజ్ఝాత వాసం వీడినట్లేనా?
వల్లభనేని వంశీ.. రాజకీయ అజ్ఝాత వాసం వీడినట్లేనా?

వల్లభనేని వంశీ రాజకీయ భవిష్యత్ పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఒకప్పుడు రాజకీయంగా దూకుడు ప్రదర్శించిన వంశీ ఇప్పుడు పూర్తిగా సైలంటైపోయారు. గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా విజయాలు సాధిస్తూ వచ్చిన వంశీ.. 2019 ఎన్నికల అనంతరం అప్పటి వరకూ ఉన్న తెలుగుదేశం ను వీడి వైసీపీ పంచన చేరారు. జగన్ ప్రభుత్వ హయాంలో ఆయన వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. తనకు రాజకీయ భిక్ష పెట్టిన తెలుగుదేశం పార్టీనీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన కుటుంబంపై వంశీ నోరు పారేసుకున్న తీరు అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇక 2024 ఎన్నికలలో వల్లభనేని వంశీ గన్నవరం నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. జగన్ హయాంలో వంశీ వ్యవహరించిన అరాచక తీరు కారణంగా న్యాయపరమైన చిక్కుల్లో ఇరుక్కున్నారు. భూ కబ్జా ఆరోపణలు, గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్ధం, అలాగే కిడ్నాప్ బెదరింపులు వంటి కేసులు వంశీని చుట్టుముట్టాయి. అరెస్టయ్యారు. రిమాండ్ ఖైదీగా నెలల తరబడి జైల్లో ఉన్నారు. అనారోగ్యం కారణంగా బెయిలుపై బయటకు వచ్చిన తరువాత వంశీ పూర్తిగా మౌనాన్ని ఆశ్రయించారు. నియోజకవర్గంపై పట్టు కోల్పోయారు. దీంతో సొంత నియోజకవర్గంలోనే పట్టించుకునే నాథుడు లేక దాదాపు రాజకీయంగా అజ్ణాత వాసం చేస్తున్నట్టుగా రోజులు నెట్టుకొస్తున్నారు. అటువంటి వంశీ..తాను రాజకీయంగా క్రియాశీలంగానే ఉన్నానని చెప్పుకోవడానికా అన్నట్లు.. తాజాగా వైసీపీ పిలుపు మేరకు డీఎస్సీ అక్రమాలకు వ్యతిరేకంగా నిరసనలో పాల్గొనేందుకు బయటకు వచ్చారు. ఈ సందర్భంగా వంశీ చేసిన ప్రసంగం చాలా చాలా క్లుప్తంగా ముగిసింది. బయట కనిపించిన ఆ కాసేపు కూడా చాలా నిరాసక్తంగా, ముభావంగా కగడిపారు. గతంలో లా హడావుడి లేదు. ఉత్సాహం లేదు. తాను రాజకీయంగా మళ్లీ క్రియాశీలం అవుతున్నానని చెప్పుకోవడానికి ఇటీవల ఆయన వరుసగా చంద్రబాబుకు రాసిన బహిరంగ లేఖలు, ఇప్పుడు తాజాగా వైసీపీ నిరసనలో పాల్గొన్న సమయంలో ఆయన వ్యవహరించిన తీరు కూడా గత వంశీకి పూర్తి భిన్నంగా ఉన్నాయి. వంశీ తీరుపై పరిశీలకులు వంశీ పొలిటిల్ కెరీర్ ఇక అంతే సంగతులు అంటున్నారు. ఆరోగ్య కారణాలా, కేసుల భయమా చెప్పలేం కానీ, పొలిటికల్ గా వంశీ పుంజుకోవడానికి ఇసుమంతైనా ఆసక్తి కనబరచటం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. Vallabhaneni Vamsi, Gannavaram to jail, Political carrer, political downfall, Incognito, Gannavaram Former MLA

Publish Date: Aug 10, 2026 12:44PM
కూటమి ఐక్యత విచ్ఛిన్నానికి వైసీపీ కుట్రలు.. ఒక్క పదంతో విచ్ఛిన్నం చేసిన లోకేష్!
కూటమి ఐక్యత విచ్ఛిన్నానికి వైసీపీ కుట్రలు.. ఒక్క పదంతో విచ్ఛిన్నం చేసిన లోకేష్!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు అధికార తెలుగుదేశం కూటమిలోని భాగస్వామ్య పార్టీల మధ్య బంధం ఎంత పటిష్ఠంగా ఉందో చెప్పకనే చెబుతున్నాయి. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మధ్య పెనవేసుకున్న అన్నా తమ్ముళ్ల బంధం కూటమి ఐక్యతను మరింత బలోపేతం చేస్తున్నది. జనసేన, తెలుగుదేశం పార్టీల మధ్య విభేదాలు సృష్టించి, నాయకుల మధ్య ఆధిపత్య పోరు జరుగుతోందన్న పొలిటికల్ ఎట్మాస్మఫియర్ క్రియేట్ చేయడానికి వైసీపీ చేస్తున్నప్రయత్నాలను పవన్, లోకేష్ సమర్ధంగా తిప్పికొట్టడానికి నారా లోకేష్ అనుసరిస్తున్న వ్యూహాత్మక విధానం ఊతంగా నిలిచింది. వైసీపీ అనుకూల మీడియా, సోషల్ మీడియా లోకేష్, పవన్ కళ్యాణ్ మధ్య పోటీ ఉందన్న ప్రచాన్ని విస్తృతంగా, నిరంతరాయంగా కొనసాగిస్తూ వస్తోంది. ముఖ్యంగా పాలనా విషయాల్లో పవన్ కళ్యాణ్‌ను తోసి రాజని.. లోకేష్ ఎక్కువగా ప్రొజెక్ట్ అవుతున్నారంటూ ఊదరగొడుతోంది. ఆ మేరకు వైసీపీ సోషల్ మీడియా వింగ్, ఆ పార్టీ అనుకూల మీడియా కథనాలను వండి వారుస్తోంది. అసందర్భంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయుడు తర్వాతి స్థానం ఎవరిదన్న చర్చను లేవనెత్తుతో.. జనసేన శ్రేణుల్లో అనుమానాలు రేకెత్తించేందుకు శతధా ప్రయత్నిస్తున్నది. అయితే.. వైసీపీ వ్యూహాన్ని మంత్రి నారా లోకేష్ సమర్ధంగా, వ్యూహాత్మకంగా తిప్పికొడుతున్నారు. మీడియా సమావేశాల్లో, బహిరంగ సభల్లో, సోషల్ మీడియా వేదకగా షేర్ చేసే పోస్టుల్లో.. లోకేష్ పవన్ కల్యాణ్ ప్రస్తావన వచ్చిన ప్రతి సారీ పవనన్నా అంటూ ఆత్మీయ సంబోధన చేస్తున్నారు. ఇది కేవలం ఒక మాట వరసకు అన్న పదంగా కాకుండా, కూటమి ఐక్యతను దెబ్బతీయాలనుకున్న ప్రత్యర్థుల వ్యూహాలను చిత్తు చేస్తున్న పొలిటికల్ స్ట్రోక్ గా, స్ట్రాటజీగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. తుత్తునియలు చేసిన ఒక పక్కా పొలిటికల్ మాస్టర్‌స్ట్రోక్. ప్రతివేదికపైనా లోకేష్ పవనన్నా అంటూ పదే పదే సంబోధించడం ద్వారా.. జనసేన శ్రేణులకు, అలాగే టీడీపీ వర్గాలకు తెలుగుదేశం, జనసేన నాయకుల మధ్య విభేదాలు లేవనీ, అన్నదమ్ముళ్లలా కలిసి మెలిసి ఉంటున్నామన్న బలమైన సందేశాన్ని ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్‌కు ఇచ్చే గౌరవంలో గానీ, హోదాలో గానీ తగ్గేదే లే అన్న విస్పష్ట సందేశం ద్వారా నారా లోకేష్ వైసీపీ కూటమి పార్టీల మధ్య విభేదాలంటూ చేస్తున్న ప్రచారాన్ని పూర్వపక్షం చేయగలుగుతున్నారు. లోకేష్ పవన్ కల్యాణ్ కు ఇస్తున్న గౌరవం, ఆయన పట్ల చూపుతున్న అభిమానం జనసేన శ్రేణుల్లో కూడా కూటమి ఐక్యతపై విశ్వాసాన్ని పెంపొందేలా చేస్తున్నది. పవన్ కళ్యాణ్, లోకేష్ కలివిడి తనం, పరస్పర అభిమానంతో కలిసి మెలిసి పని చేస్తుంటే.. రాష్ట్రాభివృద్ధి పరుగులు పెడుతుందన్న అభిప్రాయం జనబాహుల్యంలోనూ బలంగా వ్యక్తమౌతోంది. దీంతో వైసీపీ విభజించు, పాలించు సూత్రం ఇసుమంతైనా పని చేయడం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. నారా లోకేష్ చూపుతున్న రాజకీయ పరిణతి ఆయనలోని నాయకత్వ లక్షణాలను ప్రస్ఫుటం చేసిందంటున్నారు. ఒకవైపు ఐటీ, విద్యా శాఖల మంత్రిగా కీలక నిర్ణయాలు తీసుకుంటూ, రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులను, కీలక పరిశ్రమలనూ ఆకర్షిస్తూ ముందుకు సాగుతున్న లోకేష్ అదే సమయంలో.. ప్రత్యర్థుల రాజకీయ కుట్రలు, వ్యూహాలను సమర్ధంగా తిప్పికొడుతున్నారు. పవన్ అన్నా అ సంబోధనతో.. కూటమిలో విభేదాలు, కూటమి విచ్ఛిన్నం అంటూ వైసీపీ కంటున్న కలలను కల్లలు చేయగలుగుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. Nara Lokesh Strengthes kutami unity, Pawan Kalyan, Pawan Anna Strategy, AP Politics, TDP Janasena Alliance

Publish Date: Aug 6, 2026 3:45PM
పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ పొలిటీషియన్ గా నిలదొక్కుకునేనా?
పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ పొలిటీషియన్ గా నిలదొక్కుకునేనా?

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్.. దేశ రాజకీయాలలో గుర్తింపు పొందిన ప్రశాంత్ కిశోర్ సొంత రాష్ట్రంలో సొంత పార్టీ పెట్టి బొక్కబోర్లా పడ్డారు. జన సురాజ్ పార్టీని స్థాపించి.. బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో అన్ని స్థానాలలోనూ అభ్యర్థులను నిలబెట్టారు. కానీ ఒక్క స్థానంలో కూడా జనసురాజ్ అభ్యర్థి విజయం సాధింలేదు సరికదా, కనీసం డిపాజిట్ కూడా దక్కనంత ఘోరంగా ఆ పార్టీ అభ్యర్థులంతా పరాజయం పాలయ్యారు. దీంతో తొలి అడుగులోనే ప్రశాంత్ కిశోర్ జనసూరజ్ పార్టీకి నూకలు చెల్లిపోయాయన్న ప్రచారం అప్పట్లో జోరుగా సాగింది. ప్రశాంత్ కిశోర్ మళ్లీ ఎన్నికల వ్యూహకర్తగా కెరీర్ ను కొనసాగించక తప్పదన్న విశ్లేషణలు జోరందుకున్నాయి. అయితే ప్రశాంత్ కిశోర్ మాత్రం ఈ సారి ఇంట గెలవాలన్న కృత నిశ్చయంతో ముందుకు సాగారు. ఎందరో నేతలను అధికార పీఠంపై కూర్చోబెట్టగలిగిన తాను బీహార్ అసెంబ్లీలో అడుగు పెట్టడం ద్వారా సత్తా చాటి.. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాలన్న లక్ష్యంతో... బంకీపూర్ నియోజకవర్గ ఉప ఎన్నికల బరిలోకి దిగి దాదాపు 20 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ విజయం నిస్సందేహంగా ప్రత్యేకమైనది ఎందుకంటే.. ప్రశాంత్ కిశోర్ పోటీ చేసి గెలిచిన బంకీపూర్ నియోజకవర్గం బీజేపీకి పెట్టని కోట లాంటిది. అదీకాక.. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం నితిన్ నబిన్ రాజీనామా చేయడంతో.. ఖాళీ అయిన ఈ స్థానం నుంచి ప్రశాంత్ కిషోర్ విజయాన్ని పరిశీలకులు బీహార్ రాజకీయాల్లో ఒక నూతన శకానికి నాందిగా అభివర్ణిస్తూ విశ్లేషణలు చేస్తున్నారు. ఎందుకంటే.. సాధారణంగా ఉప ఎన్నికలలో అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థి విజయం నల్లేరు మీద బండి నడక. ప్రత్యేక పరిస్థితుల్లో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉంటే.. ఉప ఎన్నికలో ప్రధాన ప్రతిపక్ష అభ్యర్థికి జనం ఓటు వేస్తారు. అయితే బంకీపూర్ ఉప ఎన్నికలో అందుకు భిన్నంగా.. బీజేపీ, ఆర్జేడీలను జనం ఏకకాలంలో తిరస్కరించి.. ప్రశాంత్ కిశోర్ కు జై కొట్టారు. ఈ తీర్పు కేవలం ప్రధాన పార్టీలను తిరస్కరించడంగానే కాకుండా.. తమ సమస్యల కోసం నిలబడతారన్న నమ్మకాన్ని ప్రశాంత్ కిశోర్ పై జనం ఉంచారనడానికి తార్కానంగా చూడాలంటున్నారు పరిశీలకులు. ఈ కారణంగానే బంకీపూర్ లో ప్రశాంత్ కిశోర్ సాధించిన విజయం ప్రత్యేకమైనది. శాసనసభలో తన జన సురాజ్ పార్టీ తరఫున ఏకైక ప్రతినిధిగా అడుగుపెడుతున్న ప్రశాంత్ కిశోర్ సభలో తన గళం ఎలా వినిపిస్తారు? అన్న దానిపైనే రాష్ట్రంలో జనసురాజ్ పార్టీ భవిష్యత్ ఆధారపడి ఉంది. రానున్న నాలుగేళ్లూ.. పీకేకీ, జనసురాజ్ పార్టీకి అత్యంత కీలకమైనవనడంలో సందేహం లేదు. అసెంబ్లీలో ప్రజల గొంతుక వినిపించడమే కాకుండా.. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీస్ పైనే ఆయన రాజకీయ భవిష్యత్, జనసురాజ్ భవిష్యత్ ఆధారపడి ఉంది. rashant Kishor victory, Jan Suraaj party Bihar, Bankipur assembly by-election, Prashant Kishor MLA win, Bihar political updates, Prashant Kishor strategy

Publish Date: Aug 5, 2026 12:39PM
కాషాయ పార్టీకి వార్నింగ్ బెల్స్.!
కాషాయ పార్టీకి వార్నింగ్ బెల్స్.!

బీజేపీకి వార్నింగ్ బెల్స్ మోగాయి. సోమవారం (ఆగస్టు 3) వెలువడిన మూడు ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీ గ్రాఫ్ వేగంగా పడిపోతోందన్న సంకేతాలు ఇచ్చాయి. ఈ మూడు ఉప ఎన్నికలలో రెండింటిలో బీజేపీ పరాజయం పాలైంది. మరీ ముఖ్యంగా బీజేపీకి దశాబ్దాలుగా కంచుకోటలుగా ఉన్న నియోజకవర్గాలలో ఆ పార్టీ చతికిల పడటంతో మోడీ, షా మ్యాజిక్ పని చేయడం లేదా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించిన 8 నెలలకే, పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఖాళీ చేసిన సీటును నిలబెట్టుకోవడంలో కమలం పార్టీ విఫలమైంది. ప్రధాని మోడీ అధికార పగ్గాలు చేపట్టిన తరువాత.. అంటే దాదాపు పుష్కర కాలం తరువాత.. ప్రస్తుతం బీజేపీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోందనడానికి ఈ ఫలితాలు నిదర్శనం అంటున్నారు పరిశీలకులు. ముఖ్యంగా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనకు తలొగ్గి మెట్టు దిగిన రోజుల వ్యవధిలో.. కమలం పార్టీ కంచుకోట లాంటి నియోజకవర్గాలు బద్దలు కావడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్డీఏ ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతకు ఈ ఫలితాలు నిదర్శనమని అంటున్నారు. నీట్ పేపర్ లీక్ కు జవాబుదారీతనం కోరుతూ జరిగిన విస్తృత నిరసనలు, రామ మందిర నిధుల దుర్వినియోగం, , ఈ20 ఇంధనంపై పెరుగుతున్న ఆగ్రహం వంటి సమస్యల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వెనకడుగు వేయాల్సి వచ్చింది. ఈ సమస్యలకు తోడు, అవినీతి కారణంగా పార్టీలోని కొందరు నాయకులు చట్టపరమైన చిక్కులను ఎదుర్కొంటుండటంతో పార్టీలో గందరగోళం నెలకొంది. ఈ ఉప ఎన్నికలలో ఓటమికి పార్టీ దృక్కోణం నుండి వివిధ రాజకీయ కారణాలను చెప్పుకోవచ్చు కానీ.. పార్టీలకు అతీతంగా.. వివిధ వర్గాల ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్న పలు సున్నితమైన సమస్యలను పట్టించుకోని ఫలితమే ఈ ఫలితాలుగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్‌డౌన్ త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఈ ఉప ఎన్నికల ఫలితాలు కచ్చితంగా కమలం పార్టీకి డేంజర్ బెల్స్ గానే పరిగణించాల్సి ఉంటుంది. Warning bells to BJP, By Poll, Results, Defeat, Two Seats, Bihar, Madhya Pradesh

Publish Date: Aug 4, 2026 12:40PM
హద్దులు దాటిన పొగడ్తలు.. ఎబ్బెట్టుగా మారిన ప్రసంగాలు.!
హద్దులు దాటిన పొగడ్తలు.. ఎబ్బెట్టుగా మారిన ప్రసంగాలు.!

ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఆగస్టు 1, 2026 సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజుగా చరిత్రలో నిలిచిపోతుంది. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల సాకారమైన రోజది. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఘనంగా ప్రారంభమైన దినమది. ఈ మెగా ప్రాజెక్టు ద్వారా ఉత్తరాంధ్ర రూపురేకలు మారిపోతాయని, విమానయాన అనుసంధానత పెరగడంతో పాటు పెద్ద ఎత్తున పెట్టుబడులు, పర్యాటకం, వేలాది కొత్త ఉద్యోగ,ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం సగర్వంగా ప్రకటించింది. ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్ సాధించిన అతిపెద్ద మౌలిక వసతుల పురోగతిలో భోగాపురం విమానాశ్రయం ప్రధానమైనదనడంలో ఇసుమంతైనా సందేహానికి తావులేదు. అయితే.. ఈ విమానాశ్రయ ప్రారంభోత్సవ వేదికపై నుంచి సాగిన ప్రసంగాలు.. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పోటీలు పడి మరీ కురిపించిన ప్రశంసలు వర్షం ఇప్పుడు రాష్ట్రంలోనే కాదు.. జాతీయ స్థాయిలోనూ చర్చకు దారి తీశాయి. సాధారణంగా కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కూటమి ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రులు లేదా ఉప ముఖ్యమంత్రులు ప్రధానిని ప్రశంసించడం రివాజే. కేంద్రం నుంచి నిధులు, ప్రాజెక్టులు, సహకారం కేంద్ర, రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఎంతో దోహదపడతాయి. అయితే భోగాపురం వేదికగా జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రశంసల హద్దులు దాటిపోయాయన్నది పరిశీలకుల విశ్లేషణ. ప్రధాని నరేంద్ర మోదీ దేశానికి అందిస్తున్న సేవను కొనియాడుతూ, సభకు హాజరైన వేలాది మంది ప్రజలచేత మోదీ.. మోదీ అంటూ నినాదాలు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా కోరడం ఏ సందేశం ఇస్తోందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అభివృద్ధి ప్రాజెక్టుల కంటే మోదీ వ్యక్తి పూజకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లుగా చంద్రబాబు తీరు ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన భావోద్వేగ ప్రసంగంలో మోడీ వ్యక్తి పూజ ఆకాశమే హద్దుగా సాగిందన్న విమర్శలూ వినవస్తున్నాయి. జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా విద్యార్థులు, యువత, రైతులు ఆందోళన బాట పట్టిన సమయంలో.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ప్రధాని నరేంద్ర మోడీని ఆకాశానికెత్తేస్తూ పొగడ్తల వర్షం కురిపించడం ఒకింత ఎబ్బెట్టుగా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రశంసలైనా, విమర్శలైనా సమతుల్యత పాటించినప్పుడే రాణిస్తాయని అంటున్నారు. భోగాపురం విమానాశ్రయం వంటి చారిత్రాత్మక ప్రాజెక్టు ద్వారా రాష్ట్రానికి లభించే ఆర్థిక ఉద్దీపన, ఉత్తరాంధ్ర ప్రగతి ప్రాధాన్యతను వివరించి, అందుకు సహకరించిన ప్రధానిని ప్రశంసించి, కృతజ్ణతలు తెలపడంలో ఎవరికీ అభ్యంతరం ఉండదు కానీ, రాజును మించి రాజభక్తి అన్నట్లుగా.. మోడీని ప్రశంసించడం కోసమే ఆ సభ అన్నట్లుగా పోటీలు పడి మరీ ప్రసంగించడం.. ప్రజలను సైతం విస్మయపరిచింది. ఆంధ్రప్రదేశ్ లో జనం కూటమి ప్రభుత్వానికి ఓటేసి గెలిపించినా.. రాష్ట్రం వరకూ ప్రధాన పార్టీ తెలుగుదేశం, ఆ తరువాత జనసేనలు ఉంటే.. రాష్ట్రంలో బీజేపీ ఉనికిమాత్రంగానే ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే భోగాపురం సభ వేదికగా పవన్, చంద్రబాబు ప్రసంగాలు.. పొలిటికల్ గా వారి వారి పార్టీలకు నష్టం చేకూర్చేలా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రజాబలంతో తాము గెలిచినా.. మోడీ ప్రాపకం లేకుంటే.. తాము చేయగలిగింది శూన్యం అని చెప్పుకున్నట్లుగా ఉందని అంటున్నారు. భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవ సభ మోడీకి పంచరత్నాలు చదవడానికే ఏర్పాటు చేశారా అన్న అనుమానం కలిగేలా సాగిందన్న అభిప్రాయం జనబాహుల్యంలో బలంగా వ్యక్తమౌతోంది. Bhogapuram Airport, Narendra Modi, Chandrababu Naidu, Pawan Kalyan, AP Politics, Uttarandhra Development

Publish Date: Aug 3, 2026 11:12AM
కుప్పం ప్రజలకు భువనేశ్వరి భరోసా.!
కుప్పం ప్రజలకు భువనేశ్వరి భరోసా.!

రాష్ట్రంలో కుప్పం అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం ఇది. గత నాలుగు దశాబ్దాలుగా చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం కుప్పం. అయితే 2019 - 24 మధ్య కాలంలో చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో అప్పటి జగన్ ప్రభుత్వం.. కుప్పం నియోజకవర్గంలో పాగా వేసి 2024 ఎన్నికలలో విజయం కోసం వ్యూహాలు రచించింది. ఆ క్రమంలో స్థానిక ఎన్నికలలో తెలుగుదేం పార్టీ పరాజయం పాలయ్యేలా చేసింది. దీంతో అప్రమత్తమైన చంద్రబాబు అప్పట్లో కుప్పంపై ప్రత్యేక దృష్టి సారించి.. పరిస్థితిని చక్కదిద్దారు. 2024 ఎన్నికలలో కుప్పం నుంచే విజయం సాధించి పట్టు నిలుపుకున్నారు. ప్రస్తుతం చంద్రబాబు ముఖ్యమంత్రిగా రాష్ట్ర స్థాయి పాలనా వ్యవహారాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో క్షణం తీరిక లేకుండా బిజీగా గడుపుతుండటంతో.. కుప్పం బాధ్యతలను ఆయన అర్థాంగి నారా భువనేశ్వరి భుజానికెత్తుకున్నారు. తరచుగా కుప్పంలో పర్యటిస్తూ.. నియోజకవర్గ అభివృద్ధి పనుల పర్యవేక్షణ, సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టడంతో పాటు నియోజకవర్గ ప్రజలతో నేరుగా మమేకమౌతున్నారు. కుప్పం తన తాజా పర్యటనలో భాగంగా భువనేశ్వరి పలు సమావేశాల్లో మాట్లాడుతూ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో జగన్ సర్కార్ తీరుపై విమర్శలు గుప్పించారు. జగన్ హయాంలో జరిగిన ఆర్థిక అక్రమాలు, నిధుల మళ్లింపు, ప్రాజెక్టుల పురోగతిని దెబ్బతీసిన విధానాలను ఆమె కుప్పం ప్రజల కళ్లకుకట్టినట్లు వివరించారు. జగన్ పాలనలో జరిగిన అక్రమాలను, అన్యాయాలను గుర్తుచేస్తూనే.. ప్రస్తుతం అధికారంలో ఉన్న చంద్రబాబునాయుడి నాయకత్వంలోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, సాధిస్తున్న అభివృద్ధిని స్పష్టంగా గణాంకాలతో సహా వివరించారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను కల్పించడానికి ప్రభుత్వం తీసుకున్న, తీసుకుంటున్న చర్యలను వివరించారు ముఖ్యమంత్రి సతీమణి స్వయంగా క్షేత్రస్థాయికి వచ్చి నియోజకవర్గ సమస్యలు, సంక్షేమ పథకాల అమలు తీరును పర్యవేక్షించడం స్థానిక ప్రజలలో, నాయకులలో జోష్ ను నింపింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా యావత్ రాష్ట్ర ప్రగతి కోసం అలుపెరుగకుండా శ్రమిస్తూ.. నియోజకవర్గానికి క్రమం తప్పకుండా రాలేకపోయినప్పటికీ, కుప్పం ప్రజల పట్ల తన బాధ్యతను నెరవేరుస్తున్నారనే భావన భువనేశ్వరి పర్యటనలతో స్థానికుల్లో బలంగా వ్యక్తమవుతోంది. భువనేశ్వరి చొరవతో కార్యకర్తల్లో నూతన ఉత్సాహం నెలకొనడమే కాకుండా, స్థానిక సమస్యలను నేరుగా సీఎం దృష్టికి నేరుగా తీసుకెడుతున్నారని జనం భావిస్తున్నారు. ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటూ ఆమె ముందుకు సాగుతున్న తీరు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలలో సానుకూలత ఏర్పడేందుకు దోహదపడుతోంది. మొత్తానికి, కుప్పం నియోజకవర్గానికి తన భర్త అందిస్తున్న సుదీర్ఘ సేవలకు మద్దతుగా నారా భువనేశ్వరి తీసుకుంటున్న శ్రద్ధ, చూపిస్తున్న చొరవ రాబోయే రోజుల్లో కుప్పం రాజకీయాల్లో కీలక పాత్ర పోషించనుందనడంలో సందేహం లేదు. ప్రజలతో నేరుగా మమేకమవుతూ సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం చేయడం ద్వారా కుప్పం ప్రజలకు తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామనే స్పష్టమైన సంకేతాన్ని నారా కుటుంబం అందించింది. Bhuvaneswari assures the people of Kuppam, Chandrababu Naidu Kuppam Constituency, TDP Kuppam, Andhra Pradesh, TeluguOne News

Publish Date: Jul 30, 2026 2:35PM
నిజమైన పసుపు సైనికుడు పిఠాపురం వర్మ.!
నిజమైన పసుపు సైనికుడు పిఠాపురం వర్మ.!

తెలుగుదేశం పార్టీలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా వ్యవహారం కలకలం రేపుతున్న సంగతి విదితమే. . బోండా ఉమ వైసీపీ నేత అంబటి రాంబాబుతో వేదికను పంచుకోవడమే కాకుండా, పార్టీ ఇచ్చిన షోకాజ్ నోటీసుకు ఇచ్చిన ఘాటైన సమాధానం పార్టీ అధిష్టానానికి సవాలు విసురుతున్నట్లుగా మారింది. అధికారంలోకి వచ్చి ఇంకా సగం పదవీకాలం కూడా పూర్తి కాకముందే ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తూ, అధినాయకత్వంపై తిరుగుబాటు బావుటా ఎగురవేయడం సంచలనంగా మారింది. బోండా ఉమ త్వరలోనే వైసీపీ గూటికి చేరతారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. అదలా ఉంటే.. బోండా ఉమ వైఖరి వల్ల పార్టీకి, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి జరుగుతున్న నష్టాన్ని అడ్డుకుని బోండా ఉమా తీరును గట్టిగా ఖండిచి, విమర్శించాల్సిన తెలుగుదేశం కీలక నేతలు మౌనం వహించారు. పార్టీలో పదవులు అనుభవిస్తున్న వారు, భవిష్యత్తులో మంత్రి పదవులు లేదా ఉన్నత స్థానాలు ఆశిస్తున్న అగ్రనేతలు బొండా ఉమా వ్యాఖ్యలపై స్పందించడం లేదు. అయితే.. పిఠాపురం వర్మ మాత్రం నిజమైన పసుపు సైనికుడిగా బోండా ఉమ తీరును గర్హించారు. ఇటీవల పార్టీ అధిష్టానం తనను పిఠాపురం నియోజకవర్గ ఇన్చార్జ్ పదవి నుంచి తొలగించింది. ఆ సమయంలో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. పవన్ కల్యాణ్ కోసం గ2024 ఎన్నికలలో తన సీటును త్యాగం చేసి మరీ ఆయన విజయం కోసం పాటుపడిన వర్మకు.. పార్టీలో త్యాగానికి తగిన గుర్తింపు లభించలేదు. అయినా అదే పిఠాపురం వర్మ.. బొండా ఉమా విమర్శలపై మిగిలిన నేతలంతా మౌనంగా ఉండిపోయిన వేళ.. మీడియా సమావేశం పెట్టి మరీ బోండా ఉమాకు గట్టి కౌంటర్ ఇచ్చారు. 2019 ఎన్నికల్లో కాపు ఉద్యమం వల్లే టీడీడీపీ ఓడిపోయిందన్న ఉమా వ్యాఖ్యలు సరికాదని స్పష్టం చేశారు. జగన్ ఒక్క ఛాన్స్ పిలుపుతోనే ప్రజలకు ఆ పార్టీకి ఓటేశారని.. వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీకి అంటగట్టడం సరికాదని ఉమాకు హితవు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కాపులకు పెద్ద పీట వేశారని.. రిజర్వేషన్ల అంశం, కాపు కార్పొరేషన్‌కు నిధులు కేటాయింపు, కాపు భవనాల నిర్మాణం, విదేశీ విద్య పథకం, స్వయం ఉపాధి వంటి కార్యక్రమాలను అమలు చేసినది చంద్రబాబునని పిఠాపురం వర్మ పేర్కొన్నారు. 2014 ఎన్నికల సమయంలో కాపుల్ని బీసీల్లో చేరుస్తామని ఇచ్చిన హామీ మేరకు కమిటీని ఏర్పాటు చేసిన సంగతిని వర్మ గుర్తు చేశారు. 2019 నుంచి 2024 వరకూ అధికారంలో ఉన్న జగన్ సర్కార్ కాపులకు చేసిందేమీ లేదని విమర్శించారు. కూటమి స్థిరత్వం కోసం, రాష్ట్ర సంక్షేమం కోసం నాయకత్వం కొన్నిసార్లు క్షేత్రస్థాయి లాయలిస్టులను పక్కన పెట్టాల్సి రావచ్చు, కానీ నిజమైన శ్రేయోభిలాషి ఎవరు అనేది బయటపడేది సంక్షోభ సమయంలోనేననీ, ఆ విషయం వర్మ బోండా ఉమాకు ఇచ్చిన కౌంటర్ తో మరోసారి రుజువైందనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. SVSN Varma, Pithapuram Varma, Chandrababu Naidu, Bonda Uma, TDP Political News

Publish Date: Jul 28, 2026 11:23AM
rss-imgRss Feeds