వైసీపీ కార్యాలయానికి మరోమారు నోటీసులు

తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయానికి పోలీసులు మరోమారు నోటీసులు పంపారు. తాడేపల్లి ప్యాలెస్ బయట ఇటీవల స్వల్ప అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఆ ప్రమాదంపై వైసీపీ సోషల్ మీడియా ఇష్టారీతిగా ఆరోపణలు గుప్పించింది. జగన్ పై హత్యాయత్నం అంటూ వార్తలను వండి వార్చింది. ఈ అగ్నిప్రమాదం తాడేపల్లి ప్యాలెస్ బయట రోడ్డు పక్కన ఉన్న లాన్ లో జరిగింది. అయితే దీని వెనుక బారీ కుట్ర ఉందంటూ వైసీపీ ఆరోపణలు గుప్పించింది. ప్రతిగా.. ఏపీ మద్యం కుంభకోణం కేసుకు సంబంధించిన ఆధారాలు మాయం చేయడానికి వైసీపీయే స్వయంగా ఈ అగ్నిప్రమాదాన్ని సృష్టించిందంటూ తెలుగుదేశం ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు తాడేపల్లి ప్యాలెస్ బయట జరిగిన అగ్నిప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించారు. తాడేపల్లి ప్యాలెస్ లోని సీపీ ఫుటేజీ ఇవ్వాలంటూ తాడేపల్లి కార్యాలయానికి నోటీసులు ఇచ్చారు. అయితే పోలీసుల నోటీసుల మేరకు సీసీ ఫుటేజీ ఇవ్వడానికి వైసీపీ నిరాకరించింది. దీంతో పోలీసులు మరోమారు నోటీసులు పంపించారు. తాడేపల్లి ప్యాలెస్ బయట అగ్ని ప్రమాదం జరిగిన రోజు కార్యాలయానికి వచ్చిన సందర్శకులు, నాయకుల జాబితా ఇవ్వాలనీ, అలాగే సీసీ కెమెరా డేటా, పార్కింగ్ లోని వాహనాల వివరాలను మంగళవారం (ఫిబ్రవరి 11) తాడేపల్లి పీఎస్ లో సమర్పించాలని పోలీసులు ఆ నోటీసులో పేర్కొన్నారు. ఈ నోటీసులకు వైసీపీ కార్యాలయం ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.  గతంలో జగన్ పై కోడి కత్తి దాడి కేసులో కూడా పట్టుబట్టి ఎన్ఐఏ దర్యాప్తు కు ఆదేశాలు జారీ చేయించుకున్నప్పటికీ, ఆ కేసులో బాధితుడిగా జగన్ కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇవ్వక పోవడంతో సంవత్సరాల తరబడి ఆ కేసు విచారణ సాగుతూనే ఉంది. అలాగే వైఎస్ వివేకా హత్య కేసులో కూడా సంఘటన జరగ్గానే ఇష్టారీతిగా ప్రత్యర్థులపై ఆరోపణలు గుప్పించిన వైసీపీ అధినేత ఆ తరువాత దర్యాప్తునకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. తనపై గులకరాయి దాడి కేసులో కూడా జగన్ అదే విధంగా వ్యవహరించారు. ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ బయట జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై కూడా ఇష్టారీతిగా ఆరోపణలు గుప్పించడమే తప్ప.. వివరాలను, ఆధారాలను సమర్పించడానికి మాత్రం ముందుకు రావడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.    
Publish Date: Feb 11, 2025 8:59AM

ముందస్తు బెయిలు కోసం హైకోర్టుకు విడదల రజని

మాజీ మంత్రి విడదల రజనీ హైకోర్టును ఆశ్రయించారు. తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ ఆమె ఏపీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు తనను వేధించారంటూ కోటి అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు కోర్టు ఆదేశాలతో విడదల రజనీపై కేసు నమోదైన సంగతి తెలసిందే. ఈ కేసులోనే ముందస్తు బెయిలు కోసం విడదల రజనీ హైకోర్టును ఆశ్రయించారు. రజనీ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో మంగళవారం (ఫిబ్రవరి 11) విచారణ జరగనుంది.  సైబరాబాద్ మొక్క విడదల రజినీపై చిలకలూరిపేట పోలీసు స్టేషన్ లో అట్రాసిటీ కేసు నమోదైన సంగతి తెలిసిందే. తెలుగుదేశం నాయకుడు పిల్లి కోటి పిటిషన్ పై హైకోర్టు ఆదేశాల మేరకు చిలకలూరి పేట పోలీసులు మాజీ మంత్రి విడదల రజినీపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు.  వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఐటీడీపీకి సంబంధించి సోషల్ మీడియా పోస్టుల విషయంలో  విడదల రజినీ ఆదేశాల మేరకు తనను వేధించారని పేర్కొంటూ తెలుగుదేశం నాయకుడు పిల్లి కోటి హైకోర్టును ఆశ్రయించారు. పిల్లి కోటి పిటిషన్ న పరిశీలించి కేసు నమోదు చేసి చర్యలు చేపట్టాలని హైకోర్టు జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో చిలకలూరి పేట పోలీసులు విడదల రజినీపై కేసు నమోదు చేశారు.  విడదల రజినీతో పాటు  ఆమె పీఏలు దొడ్డా రామకృష్ణ, ఫణి సహా అప్పటి సీఐ సూర్యనారాయణపై కూడా కేసు నమోదు అయ్యింది.  2019లో చిలకలూరి పోలీస్ స్టేషన్‌లో తనను చిత్రహింసలకు గురి చేశారనీ,  అప్పట్లో దీని పై ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలూ తీసుకోలేదని పిల్లి  తన పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిపై   రెండు వారాల్లోగా కేసు నమోదు చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించింది.  కోర్టు ఆదేశాల మేరకు విడదల రజనీపై కేసు నమోదైంది. ఆ కేసులోనే ముందస్తు బెయిలు కోసం విడదల రజనీ హైకోర్టును ఆశ్రయించారు. 
Publish Date: Feb 11, 2025 8:41AM

అర్చకుడు రంగరాజన్ పై దాడి కేసులో వీర రాఘవరెడ్డి అరెస్ట్ 

చిలుకూరు బాలాజీ దేవాలయ అర్చకుడు రంగరాజన్ పై దాడి కేసులో ప్రధాన నిందితుడు వీర రాఘవరెడ్డిని మొయినాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం 22 మంది రామ రాజ్యం పేరిట  ప్రయివేటు సైన్యం తన ఇంట్లో దూరినట్టు రంగరాజన్ చెప్పారు. సీసీటీవీ రికార్డు ఆధారంగా నిందితులను పోలీసులు గుర్తించారు. తాను  తన నివాసంలో క్రింద కూర్చున్న సమయంలో  దుండగులు బూట్లతో లోపలికి ప్రవేశించి దుర్బాషలాడటమే గాకుండా భౌతిక దాడులకు పాల్పడ్డారన్నారు. ఘటన అనంతరం బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ రంగరాజన్ ను పరామర్శించారు. ఎపి డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
Publish Date: Feb 10, 2025 4:57PM

పవన్ కల్యాణ్ ఆధ్యాత్మిక యాత్ర ఎప్పటినుంచంటే..?

జనసేనాని పవన్ కల్యాణ్ వైరల్ ఫీవర్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. వైద్యుల సలహా మేరకు విశ్రాంతి తీసుకున్న ఆయన ఇక ముందగా తాను నిర్ణయించుకున్నట్లు ఆధ్యాత్మిక యాత్రకు బయలుదేరడానికి రెడీ అయిపోయారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాలలోని ప్రముఖ ఆలయాలను దర్శించాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఇందు కోసం ఆయన ఈ నెల 12న తమిళనాడు, కేరళ రాష్ట్రాల పర్యటనకు బయలుదేరనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన రెండు రాష్ట్రాలలోని ప్రముఖ ఆలయాలను దర్శించుకుంటారు. ఆయన దర్శించుకునే ఆలయాల్లో అనంత పద్మనాభ స్వామి ఆలయం, మధుర మీనాక్షి, శ్రీ పరసురామస్వామి ఆలయాలు ఉన్నాయి. అలాగే అగస్త్య పజీవ సమాధి, కుంభఏశ్వర ఆలయం, స్వామి మలయి, తిరుత్తాయ్ సుబ్రహ్మణ్వేస్వరస్వామి ఆలయాలను కూడా ఆయన సందర్శిస్తారు. సనాతన ధర్మ పరిరక్షణే తన అభిమతంగా చెప్పుకునే పవన్ కల్యాణ్ అందుకే ఆధ్యాత్మిక యాత్రకు బయలు దేరారు. తాను సనాతన ధర్మాన్ని మనసావాచాకర్మణా నమ్ముతానని పవన్ కల్యాణ్ పలు సందర్భాలలో చెప్పిన సంగతి తెలిసిందే.  సనాతన వ్యతిరేక మేధావుల మాటలు తనను ప్రభావితం చేయలేవని ఆయన అన్నారు.   
Publish Date: Feb 10, 2025 3:47PM

ఉండవల్లి కాదు ఊసరవెల్లి..!

రాజమహేంద్రవరం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పరిచయం అక్కర్లేని పేరు. స్వయం ప్రకటిత మేధావిగా ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చిరపరిచితుడు. వైఎస్ కు నమ్మిన బంటుగా ఉండవల్లి రాజకీయాలలో గుర్తింపు పొందారు. ఆయన ఆశీస్సులతో రాజమహేంద్రవరం నుంచి రెండు సార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. లోక్ సభ సభ్యుడిగా  ఆయన రాజమహేంద్రవరం అభివృద్ధికి ఏం చేశారో తెలియదు కానీ, రాష్ట్ర విభజన తరువాత రాజకీయ సన్యాసం ప్రకటించి.. తన గురువు వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు వైఎస్ జగన్మోహనరెడ్డి శ్రేయోభిలాషిగా మిగిలిపోయారు. ఐదేళ్ల జగన్ పాలనలో రాష్ట్రం అన్ని విధాలుగా భ్రష్టుపట్టిపోయినా, అవినీతి, అరాచకత్వం రాజ్యమేలినా.. ఉండవల్లి ఉలకలేదు, పలకలేదు. కానీ జగన్ ఇబ్బందుల్లో ఉన్న ప్రతి సారీ.. ఆయనకు మద్దతుగా మీడియా ముందుకు వచ్చి తనకు మాత్రమే సాధ్యమైన వితండ వాదంతో ఆయన తరఫున మాట్లాడే వారు. ఈ నేపథ్యంలో ఆయన తన వాదనను తానే ఖండించుకుంటూ గతంలో తాను ఔనన్న దానికి కాదంటూ, కాదన్న దానికి ఔనంటూ అపర ఊసరవెల్లిలా మారిపోయారు.  సీనియర్ రాజకీయ నాయకుడు అయి ఉండీ వాస్తవాలను గుర్తించకుండా జగన్ కు అనుకూలంగా ఆయన చేసిన విశ్లేషణలూ, వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలూ అప్పట్లో నవ్వుల పాలయ్యాయి. ఆయన ప్రతిష్ట పూర్తిగా మసకబారి జనంలో క్రెడిబులిటీ కోల్పోయారు.   తన రాజకీయ గురువు వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు, జగన్ కు మద్దతుగా నిలవడం కోసం వాస్తవాలను  ఆయన వక్రీకరించిన విధానంపై వైసీపీయులు కూడా ఒకింత అసహనానికి లోనైన సందర్భాలు గతంలో ఎన్నో ఉన్నాయి.  మరీ ముఖ్యంగా జగన్ అధికారంలో ఉండగా స్కిల్ కేసు అంటూ చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసినందుకు ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారంతా రోడ్లపైకి వచ్చి నిరసన బాట పడితే.. ఒక్క ఉండవల్లి మాత్రం స్కిల్ కేసు సీబీఐకి అప్పగించాలంటూ హైకోర్టును ఆశ్రయించారు.  స్కిల్ కేసులో చంద్రబాబుకు సంబంధించి ఒక్కటంటే ఒక్క ఆధారం లేకుండా అన్యాయంగా అరెస్టు చేసిన విషయాన్ని దేశం మొత్తం గుర్తించినా, అపర మేధావి ఉండవల్లికి మాత్రం అందులో న్యాయం కనిపించింది. తన రాజకీయ గురువు వైఎస్ జగన్ కు అండగా నిలవడమే తక్షణ కర్తవ్యంగా అనిపించింది.  వాస్తవానికి స్కిల్ కేసులో  చంద్రబాబుకు వ్యతిరేకంగా   ఒక్క ఆధారమూ చూపకుండా? ఆయనను జనంలో తిరగనీయకూడదన్న ఏకైక లక్ష్యంతో జగన్ సర్కార్ కుట్రపూరితంగా ముందు అరెస్టు చేసి ఆనక తీరిగ్గా ఆయనకు వ్యతిరేకంగా ఆధారాల కోసం ప్రయత్నాలు ప్రారం భించామని చెప్పుకుంది.   అటువంటి స్కిల్ కేసుపై సీబీఐ విచారణ కావాలంటూ ఉండవల్లి అప్పట్లో హైకోర్టును ఆశ్రయించారు.  ఇలా ఒక్కటనేమిటి.. జగన్ ఐదేళ్ల పాలనలో జగన్ కు వత్తాసు పలకడానికి మాత్రమే ఈ స్వయం ప్రకటిత మేధావి, రాజకీయ సన్యాసం పుచ్చుకున్న యోగి పుంగవుడు మీడియా ముందుకు వచ్చే వారు. అందు కోసం తటస్థుడనన్న ముద్ర వేసుకునే వారు. సరే జనం తీర్పుతో జగన్ అధికారం కోల్పోయారు. అత్యంత అవమానకరమైన ఓటమి వైసీపీకి జనం కట్టబెట్టారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. ఇక ఓటమి తరువాత వైసీపీ నుంచి ఒక్కరొక్కరుగా బయటకు వెళ్లిపోతున్నారు. చివరాఖరికి  పార్టీలో నంబర్ 2, జగన్ అక్రమాస్తుల కేసులో సహనిందితుడు, ఏ2 అయిన విజయసాయి కూడా వైసీపీని వీడి పోయారు. దీంతో ఇక ఉండవల్లి రంగంలోకి దిగడానికి సిద్ధమైపోయారు. ఇంక ముసుగులెందుకు అనుకున్నారో ఏమో, రాజకీయ సన్యాసానికి ఫుల్ స్టాప్ పెట్టేసి వైసీపీలో చేరి యాక్టివ్ పాలిటిక్స్ లోకి దూకేస్తానం టున్నారు. గత రెండు రోజులుగా  ఉండవల్లి వైసీపీలో చేరికపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అదే వాస్తవమైతే మేధావి ముసుగు తొలగించుకుని ఉండవల్లి తనలోని జగన్ భక్త హనుమాన్ ను జనానికి చూపించినట్లే. ఉండవల్లి ప్రజా నాయకుడేం కాదు. మీడయా సమావేశాలలో గంటల తరబడి ప్రసంగించగలరేమో కానీ, బహిరంగ సభ పెడితే ఆయన ప్రసంగం వినడానికి పట్టుమని పది మంది కూడా వచ్చే పరిస్థితి లేదు. అటువంటి ఉండవల్లి వైసీపీ గూటికి చేరితే ఆయన మీడియా సమావేశాలకూ క్రెడిబులిటీ ఉండదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆయన వైసీపీ గూటికి చేరడమంటే.. తెలుగుదేశం కూటమి నెత్తిన పాలు పోసినట్లేనంటున్నారు. 
Publish Date: Feb 10, 2025 3:17PM