సెప్టెంబర్ 24 నుంచి తిరుమల బ్రహ్మోత్సవాలు
posted on Sep 16, 2025 5:17PM
.webp)
మత మార్పిడుల నివారణకు దళిత వాడల్లో 1,000 ఆలయాలు నిర్మిస్తామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు హెచ్చరించారు. ఇవాళ టీటీడీ పాలక మండలి సమావేశమైంది. ఈ సమావేశం ముగిసిన అనంతరం టీటీడీ చైర్మన్ చైర్మన్ మాట్లాడుతూ..తిరుమల దేవస్థానంపై తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వారిపై క్రిమినల్ కేసులు పెడతామని పేర్కొన్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పాలక మండలి సమావేశంలో తీర్మానం చేశామన్నారు.
బ్రహ్మోత్సవాల వేళ.. వాహన సేవను తిలకించెందుకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ పాలక మండలి నియమించిన తర్వాత జరుగుతున్న మొదటి బ్రహ్మోత్సవమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది ఈ బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని ప్రకటించారు.
సెప్టెంబర్ 24వ తేదీ సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు స్వామి వారికీ పట్టు వస్త్రాలు సమర్పిస్తారన్నారు. అదే రోజు.. 2026 క్యాలెండరు, డైరీలను సీఎం ఆవిష్కరిస్తారని ఆయన తెలిపారు. ఇక సెప్టెంబర్ 25వ తేదీ ఉదయం యాత్రి సముదాయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని తెలిపారు.
బ్రహ్మోత్సవాలు జరిగే 10 రోజులు..వీఐపీ సిపార్సు లేఖలను అనుమతించబోమన్నారు. ఆ రోజుల్లో ఈ లేఖలను రద్దు చేశామని చెప్పారు. శ్రీవాణి ట్రస్టు నిధులతో కర్ణాటకలో 7ఎకరాల్లో శ్రీవారి ఆలయ నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు. అనంతవరంలోని స్వామి వారి ఆలయంలో రూ. 7.2 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.
సీఎం చంద్రబాబు ఆదేశాలు మేరకు దళిత వాడల్లో రూ.10 నుంచి రూ. 20 లక్షల నిధులతో 1000 ఆలయాలు నిర్మాణానికి ఆమోదం తెలిపినట్లు బీఆర్ నాయడు తెలిపారు. తిరుమల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24 నుంచి ఆక్టోబర్ 2 వరకు జరగనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమం కోసం 8 లక్షల లడ్డూలు తయారు చేసి అందుబాటులో ఉంచనున్నామని వివరించారు. భక్తుల భద్రత కోసం 4500 మంది పోలీసులు, 3500 మంది వాలంటీర్లు సేవలు అందిస్తామని చెప్పారు. భక్తుల రద్దీని పర్యవేక్షించడానికి ఇస్రో సాంకేతిక సహాయం తీసుకోనున్నగట్లు వెల్లడించారు.