రాజ్యాంగాన్నే మార్చుకున్నాం.. బిజినెస్ రూల్సెంత.. చంద్రబాబు
posted on Dec 10, 2025 1:23PM

మెరుగైన పాలన కోసం అవసరమైతే బిజినెస్ రూల్స్ మార్చుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. ఏపీ సచివాలయంలో మంత్రులు, హెచ్ ఓడీలు, కార్యదర్శులతో ఏర్పాటు చేసిన సదస్సులో మాట్లాడిన ఆయన దేశంలో రాజ్యాంగాన్నే అనేక సార్లు సవరించుకున్నాం.. ప్రజలకు మంచి చేయడానికి బిజినెస్ రూల్స్ మార్చుకుంటే తప్పేంటన్నారు. ఫైళ్ల క్లియరెన్స్ వేగవంతం చేయడంతో పాటు అనవసర ఫైళ్లు సృష్టించే విధానం మారాలనీ, దీని కోసం అవసరమైన మార్పులకు వెనుకాడొద్దని చెప్పారు. పరిపాలనను సులభతరం చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్న ఆయన ఇందు కోసం అధికారులు అనవసరంగా ఉన్న నిబంధనలను తొలగించాలని సూచించారు.
టెక్నాలజీ, డేటా లేక్ ద్వారా మరింత సమర్థంగా పాలన అందించానీ, ప్రతి శాఖలో ఆడిటింగ్ జరగాలని చంద్రబాబు ఆదేశించారు. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేకుండా పాలన ఉండాలని నిర్దేశించారు. ఆన్ లైన్ సేవలు పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా అవసరమైతే బిజినెస్ రూల్స్ ను మార్చాలన్నారు. సంక్షేమ, అభివృద్ధి పథకాలకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే నిధులను వాడుకోవడానికి తమ ప్రభుత్వం నూతన నిబంధనలు తెచ్చిందని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేశారు.