ఉప్పల్ స్టేడియంలో రేవంత్ వర్సెస్ మెస్సీ.. ఎప్పుడంటే?
posted on Dec 10, 2025 4:18PM

సీఎం రేవంత్ రెడ్డి ఫుట్‌బాల్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ నెల 13న స్టార్ ఫుట్ బాల్ ప్లేయర్ మెస్సీతో ఫుట్ బాల్ మ్యాచ్ ఆడేందుకు ప్రాక్టీస్ ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి చెప్పారు. “తెలంగాణ రైజింగ్ - 2047” విజన్‌ను క్రీడా వేదిక నుంచి మెస్సీ సహకారంతో ప్రపంచానికి మరింతగా పరిచయం చేయాలనే వ్యూహంతో తానే స్వయంగా గ్రౌండ్‌లోకి దిగుతున్నట్లు తెలిపారు.
తెలంగాణలో స్పోర్ట్స్ స్పిరిట్‌ను నలుమూలలా చాటి చెప్పడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారు. స్వయంగా ఫుట్‌బాల్ ఆటగాడైన రేవంత్.. తన బిజీ షెడ్యూల్స్ మధ్య కూడా సమయం చిక్కినప్పుడల్లా ఫుట్ బాల్ మైదానంలో పరుగులు తీస్తూ, గోల్స్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. గత పార్లమెంటు ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే, మే 12న హైదరాబాద్‌లోని సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్లి సీఎం ఫుట్‌బాల్ ఆడారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఆట మధ్యలో షూ పాడైపోయినప్పటికీ, ఆయన ఏమాత్రం వెనుకడుగు వేయలేదు.. షూ లేకుండానే తన ఆటను కొనసాగించారు. ఈ మ్యాచ్‌లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఫహీం ఖురేషి, హెచ్‌సీయూ విద్యార్థులు పాల్గొన్నారు.
ఇక ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాత ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ తన ఇండియా పర్యటనలో భాగంగా భాగంగా డిసెంబర్ 13న హైదరాబాద్‌కు రానున్నారు. ఈ సందర్భంగా, హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో మెస్సీ టీమ్‌తో సీఎం రేవంత్ రెడ్డి టీమ్ మ్యాచ్ ఆడనుంది. ఈ ప్రతిష్ఠాత్మక మ్యాచ్‌కు సీఎం సన్నద్ధమౌతున్నారు.
రోజంతా అధికారిక కార్యక్రమాలతో అలసిపోయినా, కూడా విశ్రాంతి అన్న మాటే మదిలోకి రానీయకుండా ఫుట్‌బాల్ ఆటగాళ్లతో కలిసి సీఎం ఆదివారం రాత్రి గ్రౌండ్‌లోకి దిగారు. యువతతో కలిసి ఆయన ఉత్సాహంగా ఫుట్‌బాల్ ఆడారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా రాష్ట్రంలో క్రీడా రంగాన్ని కూడా బలోపేతం చేసేందుకు, ప్రోత్సహించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చర్యలు చేపట్టారు. మెస్సీతో మ్యాచ్ ఏర్పాటు చేయడం ద్వారా ప్రపంచం దృష్టిని తెలంగాణ వైపు తిప్పుకోవడానికి, రాష్ట్రంలో క్రీడలకు ఉన్న ప్రాధాన్యతను అంతర్జాతీయ స్థాయిలో తెలియజేయడానికి ఈ మ్యాచ్ దోహదపడుతుందని భావిస్తున్నారు.
గోట్ టూర్లో భాగంగా ఈ నెల 13న హైదరాబాద్‌కు వస్తున్న మెస్సీ టీంతో రేవంత్‌రెడ్డి ఫుట్ బాల్ మ్యాచ్‌లో తలపడనున్నారు. 13న ఉప్పల్ స్టేడియంలో జరిగే ఈ ఫ్రెండ్లీ ఫ్లెండ్లీ మ్యాచ్ లో రేవంత్.. 9వ నెంబర్ జెర్సీని.. మెస్సీ.. 10వ నెంబర్ జెర్సీ ధరించి గ్రౌండ్‌లోకి దిగుతారు. ఒక ముఖ్యమంత్రి.. ప్రముఖ అంతర్జాతీయ ఫుట్‌బాల్ ప్లేయర్ గ్రౌండ్‌లో తలపడనుండటం క్రేజ్‌తోపాటు ఆసక్తిని రేపుతోంది.