ఇన్వెస్టర్ల విశ్వాసం చూరగొన్న రేవంత్ సర్కార్.. గ్లోబల్ సమ్మిట్‌లో పెట్టుబడుల వెల్లువ!
posted on Dec 10, 2025 11:56AM

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు అనూహ్య స్పందన లభించింది. ఈ సదస్సు వేదికగా ఊహించిన దాని కంటే రెట్టింపుగా రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తాయి. మొత్తంగా రెండు రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో మొత్తం 5 లక్షల 75 వేల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబుడులు రాష్ట్రానికి వచ్చాయి. తొలి రోజు సదస్సులో 2 లక్షల 43 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి.. కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అలాగే.. రెండో రోజు కూడా ఈ జోష్ ఏమాత్రం తగ్గలేదు. రెండో రోజు సదస్సులో 3 లక్షల కోట్లకు పైన పెట్టుబడులకు సంబంధించిన ఎంవోయూలు కుదిరాయి. రెండు రోజుల గ్లోబల్ సమ్మిట్ లో ఒక్క పవర్ సెక్టార్‌లోనే 3 లక్షల 24 వేల 698 కోట్ల పెట్టుబడులకు ఎంవోయూలు కుదిరాయి. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్, డేటా సెంటర్లు, ఫార్మా సెక్టార్, క్లీన్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్, టూరిజం రంగాల్లో భారీగా ఇన్వెస్ట్ చేయడానికి సంస్థలు ముందుకు వచ్చాయి.
ప్రముఖ నటుడు అజయ్ దేవగన్ స్టూడియోలు, వీఎఫ్ఎక్స్, వర్క్ షాప్‌ల లాంటి ఫిల్మ్ ఎకోసిస్టమ్‌ను.. పీపీపీ మోడల్‌లో డెవలప్ చేయడానికి ముందుకు వచ్చారు. ఇక ఫిఫా-ఏఐఎఫ్ఎఫ్ ఫుట్‌బాల్ అకాడమీ టాలెంట్ అభివృద్ధికి.. ప్రపంచ స్థాయి అకాడమీ హైదరాబాద్‌లో స్థాపించనున్నాయి. తెలంగాణని గ్లోబల్ హకీ హబ్‌గా మార్చేందుకు, హాకీ మహిళల వరల్డ్ కప్ క్వాలిఫయర్ 2026ని.. 8 దేశాలు పాల్గొనే అంతర్జాతీయ పోటీని గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించనున్నారు. 18 దేశాలు పాల్గొనే ఏషియా రోయింగ్ ఛాంపియన్‌షిప్ 2026ని నిర్వహించనున్నారు. వచ్చే ఏడాదిలో.. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్.. ప్రపంచంలోనే అతిపెద్ద చెస్ ఉత్సవం కానుంది.
ఇన్ని లక్షల కోట్ల ఇన్వెస్ట్‌మెంట్లు చూశాక తెలంగాణ రైజింగ్ అన్‌స్టాపబుల్ అన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది. రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల తర్వాత.. దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిది ద్దేందుకు ఇప్పుడిప్పుడే ప్రయత్నాలు మొదలుపెట్టామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ చరిత్రలోనే ఈ గ్లోబల్ సమ్మిట్ ఓ మైల్ స్టోన్‌గా నిలుస్తుందనడంలో సందేహం లేదంటున్నారు దేశీయ, అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు కీలక రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వంలో ఒప్పందాలు కుదుర్చుకునేందుకు పోటీ పడ్డాయి. గ్లోబల్ సమ్మిట్ లో రాష్ట్ర ప్రభుత్వంతో దిగ్గజ సంస్థలు కుదుర్చుకున్న ఎంవోయూలు తెలంగాణ రైజింగ్-2047 విజన్ సాధనలో కీలకపాత్ర పోషించనున్నాయని పరిశీలకులు విశ్లేషి స్తున్నారు.
ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ చేసిన డీప్ టెక్, గ్రీన్ ఎనర్జీ, ఏరోస్పేస్, డేటా సెంటర్లు, విద్యుత్, కోర్ ఇన్‌ఫ్రా లాంటి భవిష్యత్ రంగాలలోనే ఇన్వెస్టర్లు భారీగా ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వచ్చారు. ఈ భారీ పెట్టుబడులు గ్రౌండ్ అయ్యి, ఆయా సంస్థలు తమ కార్యకలాపాలు చేపట్టడంతోనే రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించడం ఖాయమని అంటున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పరిశ్రమలకు అందిస్తున్న మద్దతు, సుస్థిర విధానాలపై పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పొందిందనడానికి గ్లోబల్ సమ్మిట్ లో వెల్లువెత్తిన పెట్టుబడులే తార్కానం అని చెప్పవచ్చు. ఈ గ్లోబల్ సమ్మిట్ కేవలం ఓ ఆర్థిక సదస్సుగా కాకుండా, భవిష్యత్ తెలంగాణకు ఒక రోడ్ మ్యాప్‌ని, భరోసాని ఇచ్చిందని చెప్పవచ్చు.
ఈ సమ్మిట్ ఇంతలా సక్సెస్ కావడానికి త్రీ జోన్ గ్రోత్ స్ట్రాటజీ కూడా ఒక ప్రధాన కారణంగా పరిశీలకులు చెబుతున్నారు. రాష్ట్రంలో సమతుల్య అభివృద్ధి కోసం ఆర్థిక వ్యవస్థను క్యూర్ జోన్, ప్యూర్ జోన్, రేర్ జోన్ అంటూ మూడు ప్రత్యేక జోన్‌లుగా విభజించారు. ఇది. క్యూర్ జోన్‌లో హైదరాబాద్ కేంద్రంగా హై-ఎండ్ సర్వీసెస్, టెక్నాలజీ, అర్బన్ ఇన్నోవేషన్ రంగాలపైనా, ప్యూర్ జోన్‌లో నగర శివారు ప్రాంతాల్లో మ్యానుఫాక్చరింగ్, దాని అనుబంధ రంగాలపైనా, ఇక రేర్ జోన్‌లో.. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ ఉత్పాదకత, అగ్రి ప్రాసెసింగ్, గ్రామీణాభివృద్ధి పై సర్కార్ దృష్టి పెట్టింది. ఈ స్ట్రాటజీ ఇన్వెస్టర్లు, ఇండస్ట్రియలిస్టులను విశేషంగా అకర్షించిందని పరిశీలకులు అంటున్నారు. ఇప్పటికే.. దేశ జనాభాలో దాదాపు 3 శాతం ఉన్న తెలంగాణ.. నేషనల్ జీడీపీలో 5 శాతం సమకూరుస్తోంది. 2047 నాటికి.. ఈ మొత్తాన్ని 10 శాతానికి పెంచాలన్న లక్ష్యం సాధించే దిశగా ప్రభుత్వ అడుగులు ఉన్నాయని ఈ సదస్సు వేదికగా తేటతెల్లమైందంటున్నారు.