మన్యంలో మావోయిస్టు బ్యానర్ల కలకలం

ఆపరేషన్ కగార్ తో మావోయిస్టు పార్టీ కకావికలమైపోయిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పలువురు మావోయిస్టు అగ్రనేతలు లొంగుబాట పట్టారు. సాయుధ పోరాటాన్ని విఫల ప్రయోగంగా అభివర్ణించారు. ఇంకా చాలా మంది మావోలు, కేంద్ర కమిటీ నాయకులు ఎన్ కౌంటర్లలో హతమయ్యారు. ఇకేముందు.. మావోయిస్టు పార్టీ పనైపోయిందన్న చర్చలూ పెద్ద ఎత్తున సాగాయి. సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మావోయిస్టుల పోస్టర్లు, బ్యానర్లు ఆంధ్రప్రదేశ్ మన్యంలో సంచలనం రేపాయి. మావోయిస్టుల సంచారం పెద్దగా కనిపించని అల్లూరి మన్యంలో ఇటీవల ఎన్ కౌంటర్ లో హతమైన మావోయిస్టు అగ్రనేత హిడ్మాకు నివాళులర్పిస్తూ మావోయిస్టులు బ్యానర్లు ఏర్పాటు చేశారు.

 ముంచంగిపుట్టు మండలం  కుమ్మిపుట్టు గ్రామ సమీపంలో ప్రధాన రహదారి పక్కన చెట్టుకు మావోయిస్టు అగ్రనేత హిడ్మాకు నివాళులర్పిస్తూ బ్యానర్లు దర్శనమిచ్చాయి. ఇటీవలి కాలంలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోతున్న క్రమంలో ఇప్పుడు ఏజెన్సీలో మావోయిస్టుల బ్యానర్లు సంచలనం సృష్టించాయి.

ఆయుధాలను విడిచే ప్రశ్నే లేదనీ, లొంగుబాటుకు మావోయిస్టులు ప్రభుత్వాలతో ఎటువంటి  ఒప్పందం కుదుర్చుకోలేదనీ ఇటీవల మావోయిస్టు అగ్రనేత వికల్ప్ పేర లేఖ విడుదలైన నేపథ్యంలో ఇప్పుడు ఈ బ్యానర్లు వెలియడం ప్రాధాన్యత సంతరించుకుంది. మావోయిస్టులు కొత్త ప్రాంతాలకు విస్తరిస్తున్నారన్న అనుమానాలకు ఈ బ్యానర్లు తావిచ్చాయి. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu