గాడిన పడిన ఇండిగో విమాన సర్వీసులు!
posted on Dec 10, 2025 12:52PM
.webp)
ఇండిగో సంక్షోభం ముగిసింది. ఇండిగో విమాన సర్వీసులు దాదాపుగా సాధారణ స్థితికి చేరుకున్నాయి. ఈ విషయాన్ని ఆ సంస్థ సీఈవో పీటర్ ఎల్పర్స్ ప్రకటించారు. బుధవారం (డిసెంబర్ 10) నాటికి పరిస్థితిని చక్కదిద్దుతామన్న ఆ సంస్థ తన మాటను నలిబెట్టుకుంది. ఈ సందర్భంగా ఇండిగో సీఈవో గత రెండు దశాబ్దాలుగా ఇంతటి ఘోర పరిస్థితి ఎన్నడూ ఎదురు కాలేదనీ, మళ్లీ ఇటువంటి పరిస్థితి పునరావృతం కానీయబోమని చెప్పారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇండిగో సేవలు సాధారణ స్థితికి చేరుకున్నాయన్న ఆయన ఇక మీదట ఇండిగో విమాన సేవల్లో ఎటువంటి అసౌకర్యం కలిగే ప్రసక్తి ఉండదని హామీ ఇచ్చారు.
దేశీయ విమానయాన సంస్థ ఇండిగో విమానాల రద్దుతో ఎనిమిది రోజులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. పెద్ద సంఖ్యలో విమానాలు రద్దు చేసి ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసినందుకు 24 గంటల్లోగా వివరాలు ఇవ్వాలంటూ సంస్థ సీఈవో పీటర్ ఎల్బర్స్, సీవోవోలకు డీజేసీఏ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇండిగోపై విచారణ కమిటీ వేసిన కేంద్రం దాని నివేదిక రాగానే సంస్థపై చర్యలు చేపనున్నట్లు పేర్కొంది. తమ విమానయాన నెట్‌వర్క్‌ను దాదాపు పునరుద్ధరించినట్లు ఇండిగో బుధవారం (డిసెంబర్ 10) తెలిపింది. తమ సంస్థ 138 గమ్య స్థానాలకు రాకపోకలు సాగిస్తుండగా, అందులో 135 గమ్యస్థానాలకు సేవలు తిరిగి ప్రారంభించామంది. 95 శాతం మేర రూట్లు రీకనెక్ట్ అయ్యాయని వివరించింది. ప్రస్తుతం ఇండిగో నడిపే పైలట్ల సంఖ్య 700 ఉండగా, వాటిని 1500కు పెంచి ప్రజలకు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టేందుకు కృషి చేస్తున్నామని పేర్కొంది.
విమానాలను రద్దు చేసి తీవ్ర గందరగోళం సృష్టించిన ఇండిగో విమానయాన సంస్థ ప్రయాణికుల టికెట్ల చార్జీ రీఫండ్ ప్రక్రియ ప్రారంభించింది. అయితే రీఫండ్ సందర్భంగా ఎలాంటి అదనపు చార్జీ వసూలు చేయరాదని కేంద్రం ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడమే కాక, కొన్ని మార్గదర్శకాలు నిర్దేశించింది. ఇప్పటివరకు ప్రయాణికులకు ఇండిగో రూ.610 కోట్లను రీఫండ్ ఇచ్చిందని, అలాగే దేశ వ్యాప్తంగా 3,000 లగేజీలను వారికి అందజేసిందని పౌర విమానయాన శాఖ ప్రకటించింది. ప్రస్తుతం ఎయిర్‌లైన్స్ ఆన్‌టైమ్ పనితీరు 75 శాతానికి చేరుకుందని, విమానాల రద్దు ప్రయాణికులు అనవసరంగా విమానాశ్రయానికి రాకుండా నిరోధించడంలో సహాయపడ్డాయని సంస్థ సీఈవో పీటర్ ఎల్‌బర్స్ తెలిపారు. మొత్తానికి డిసెంబర్ 10వ తేదీ నాటికి సర్వీసులు పూర్తిగా చక్కబడటంతో ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఇండిగో ఎయిర్ లైన్స్ పరిస్థితులు మెరుగుపడుతున్నాయని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పార్లమెంటులో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మంగళవారం (డిసెంబర్ 9) ప్రకటించారు.