సూపర్ విక్టరీతో ఆసియాకప్ లో శుభారంభం చేసిన టీమ్ ఇండియా

ఆసియా కప్‌ను సూపర్ విక్టరీతో ఆరంభించింది టీమిండియా. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్‌లో యూఏఈను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసింది ఘన విజయాన్నందుకుంది సూర్యకుమార్   సేన. మొదట బ్యాటింగ్ చేసిన యూఏఈ 13.1 ఓవర్లలో 57 పరుగులకే కుప్పకూలింది. లక్ష్య చేధనలో భారత్ 4.3 ఓవర్లలో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 60 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది.

యూఏఈ ఓపెనర్ అలీషన్.. 22 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. యూఏఈ బ్యాటింగ్ లైనప్‌లో ఏకంగా 8 మంది సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. మరొకరు డకౌట్‌గా వెనుదిరిగారు.  టీమిండియా స్పిన్నర్ల దాటికి ఆతిధ్య జట్టు పూర్తిగా చేతులెత్తేసింది.  9వ ఓవర్‌లో కుల్దీప్ ఏకంగా మూడు వికెట్లు తీయడంతో యూఏఈ పీకల్లోతు కష్టాల్లో పడింది. చివరి 8 వికెట్లను యూఏఈ కేవలం 10 పరుగుల వ్యవధిలో కోల్పోవడం మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ నాలుగు, శివమ్ దూబే మూడు వికెట్లు పడగొట్టారు. వీరితో పాటు బుమ్రా, వరుణ్‌ చక్రవరి, అక్షర్ పటేల్ తలో వికెట్ తీశారు.

ఆ తర్వాత 58 పరుగుల టార్గెట్ ఛేజింగ్‌లో.. టీమిండియా ఫస్ట్ ఓవర్ నుంచే దాటిగా ఆడింది. ఓపెనర్ అభిషేక్ శర్మ మొదటి బంతికే సిక్సర్ కొట్టి తనదైన శైలిలో ఇన్నింగ్స్ ఆరంభించాడు. అభిషేక్ వర్మ 16 బంతుల్లో 30 పరుగులు చేసి ఔటయ్యాడు.  గిల్ 20 పరుగులతో.. సూర్యకుమార్ 7 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.

ఇక ఈ మ్యాచ్‌లో కేవలం 4.3 ఓవర్లలో టార్గెట్‌ను ఫినిష్ చేసిన భారత్ పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. ఆసియాకప్ టీ 20 టోర్నీలో బంతులు పరంగా భారీ విజయం సాధించిన జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్‌లో 93 బంతులు మిగిలుండగానే భారత్ లక్ష్యాన్ని చేధించింది. ఇంతకుముందు ఈ రికార్డు అఫ్గానిస్తాన్ పేరిట ఉండేది. ఇంటర్నేషనల్ టీ20ల్లో అత్యంత వేగంగా రన్ ఛేజ్ చేసిన రెండో జట్టుగా భారత్ నిలిచింది. టీ20 వరల్డ్ కప్-2024లో ఒమన్‌పై కేవలం 3.1 ఓవర్లలోనే ఇంగ్లండ్ లక్ష్యాన్ని చేధించి అగ్రస్దానంలో ఉంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu