ఫలిస్తున్న లోకేష్ కృషి.. నేపాల్ లో చిక్కుకున్న తెలుగువారు క్షేమంగా వెనక్కు!
posted on Sep 11, 2025 12:32PM

లోకేష్ ఆధ్వర్యంలో ఆపరేషన్ నేపాల్ విజయవంతంగా సాగుతోంది. తీవ్ర సంక్షోభంలో ఉన్న నేపాల్ లో చిక్కుకున్న తెలుగువారిని స్వరాష్ట్రానికి తీసుకురావడానికి లోకేష్ బుధవారం (సెప్టెంబర్ 10) నుంచి నిర్విరామంగా చేస్తున్న కృషి ఫలిస్తోంది. నేపాల్ లో చిక్కుకున్న పలువురు ఆంధ్రప్రదేశ్ వాసులు స్వరాష్ట్రానికి బయలు దేరారు సిమికోట్‌లో చిక్కుకున్న 12 మందిని ప్రత్యేక విమానంలో అధికారులు ఉత్తర్‌ప్రదేశ్ సరిహద్దు సమీపంలోని నేపాల్ గంజ్ విమానాశ్రయానికి తరలించారు.
అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాహనాల్లో లక్నో చేరుకుంటారు. అక్కడ నుంచి విమానాంలో వారిని హైదరాబాద్ తీసుకువస్తారు. అలాగే నేపాల్ రాజధాని ఖాట్మండూ లో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడానికి అధికారులతో సమన్వయం చేసి మంత్రి లోకేశ్ ప్రత్యేక విమానం ఏర్పాటుచేశారు. నేపాల్‌లో చిక్కుకున్న వారు రాష్ట్రానికి సురక్షితంగా తిరిగివచ్చి ఇళ్లకు చేరే వరకూ సంబంధిత అధికారులు అంతా అప్రమత్తంగా ఉండాలని లోకేష్ ఇప్పటికే అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా పరిశీలించి, పర్యవేక్షించడం కోసం ఆయన అనంతపురం వేదికగా జరిగిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ విజయోత్సవ సభకు కూడా వెళ్ల లేదు. ఇక పోతే విజయనగరం జిల్లా నుంచి మానససరోవర యాత్ర కోసం వెళ్లి నేపాల్ లో చిక్కుకుపోయిన 61 మందిని కూడా సురక్షితంగా తిరిగి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. లోకేష్ ఆదేశం మేరకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఫోన్ ద్వాయా ఆ యాత్రికుల యోగక్షేమాలు విచారించారు. ఇక పొఖారాలో చిక్కుకున్న తెలుగువారిని తరలించడానికి ప్రత్యేక విమానం ఖాట్మండు చేరుకుంది. ఇప్పటి వరకూ 176 మంది తెలుగు వారు అక్కడి విమానాశ్రాయానికి చేరుకున్నారు.
మొత్తంగా.. ఖాట్మండు, హేటౌడా, పొఖారా, సిమికోట్ సహా నేపాల్‌లోని 12 ప్రదేశాల్లో సుమారు 217 మంది తెలుగు ప్రజలు చిక్కుకున్నారు. వీరిలో చాలా మందిని విమానాలు, రోడ్డు మార్గాల ద్వారా తరలిస్తున్నారు. సహాయక చర్యలను ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. చిక్కుకుపోయిన ప్రజలకు ఆహారం, నీరు, వసతి, ఇతరత్రా సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకుంది. ఈ మొత్తం వ్యవహారాన్ని మంత్రి లోకేష్ రియల్ టైమ్ గవర్నెన్స్ కమాండ్ సెంటర్ ద్వారా రెండు రోజులుగా పర్యవేక్షిస్తున్నారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారు. చిక్కుకున్న ప్రజలందరినీ సురక్షితంగా ఆంధ్రప్రదేశ్ చేర్చడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది.