దామోదర్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి నివాళి
posted on Oct 3, 2025 2:56PM
.webp)
జూబ్లీహిల్స్‌లో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి భౌతికకాయానికి సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళి అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి పరామర్శించారు. దామోదర్ రెడ్డి ప్రజాసేవలను కొనియాడారు. ఆయన మృతి సమాజానికి తీరని లోటని రేవంత్ తెలిపారు. మరోవైపు దామోదర్ రెడ్డి అంత్యక్రియలు రేపు తుంగతుర్తిలో నిర్వహించే అవకాశం ఉంది. గత కొంతకాలంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు.
రాంరెడ్డి దామోదర్‌రెడ్డి తుంగతుర్తి నియోజకవర్గం నుంచి ఆయన నాలుగు సార్లు శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. తుంగతుర్తి నియోజకవర్గం నుంచి 1985 నుంచి 2009 వరకు ఐదుసార్లు పోటీ చేసి.. నాలుగుసార్లు గెలిచారు. ఒక్కసారి మాత్రమే ఓడిపోయారు. 1988, 1989లలో కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు.
1994లో కాంగ్రెస్ టికెట్ నిరాకరించినప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలవడం ఆయన రాజకీయ పట్టుకు నిదర్శనం. 1999లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. 2004లో టీడీపీ అభ్యర్థిపై మళ్లీ గెలిచారు. ఆ తర్వాత 2009లో సూర్యాపేట నుంచి గెలిచి, దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో ఐటీ శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు.