నేపాల్ లో రాజకీయ సంక్షోభం.. దేశంలో అంతర్యుద్ధ పరిస్థితులు
posted on Sep 9, 2025 2:10PM

దుబాయ్ కి పారిపోయిన ప్రధాని
మంత్రుల నివాసాలపై దాడులు
పార్లమెంటును ముట్టడించిన ఆందోళనకారులు
ప్రధాని ఓలీ రాజీనామా
నేపాల్ లోని కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం తీసుకున్న ఓ అనాలోచిత చర్య ఆ ప్రభుత్వాన్ని పీకల్లోతు సంక్షోభంలోకి నెట్టివేసింది. పదుల సంఖ్యలో మరణాలకు కారణమైంది. మంత్రుల రాజీనామాలకూ దారి తీసింది. చివరకు ప్రభుత్వ మనుగడే ప్రశ్నార్ధకం అన్న పరిస్థితిని కల్పించింది. అంతెందుకు ప్రధాని తన పదవికి రాజీనామా చేసి దుబాయ లో ఆశ్రయం తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చేశారంటేనే పరిస్థితి తీవ్రత ఏంటన్నది అర్ధమౌతుంది. ఇంతకీ ఈ పరిస్థితి రావడానికి కారణమేంటంటే.. దేశంలో సామాజిక మాధ్యమ వేదికలపై నిషేధం విధించడం. అలా నిషేధించడానికి ఓలీ సర్కార్ కారణాలేవైనా చెప్పొచ్చుగాక.. కానీ ఆ నిషేధం దేశ వ్యాప్తంగా తీవ్ర ఆశాంతికి దారి తీసింది.
జనం పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వచ్చి నిరసనలకు దిగేలా చేసింది. ఆ నిరసనలు హింసాత్మక రూపం దాల్చడం, పోలీసు కాల్పులకు దారి తీయడం, పదుల సంఖ్యలో మరణాలు సంభవించడం చకచకా జరిగిపోయాయి. ఇంత జరిగిన తరువాత ఓలీ ప్రభుత్వం దిగి వచ్చింది. తన నిర్ణయం పట్ల ఎలాంటి పశ్చాత్తపమూ వ్యక్తం చేయకుండానే సామాజిక మాధ్యమాలపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ఓ ప్రకటన చేసి చేతులు దులిపేసుకుంది. అంత మాత్రాన పరిస్థితి చక్కబడుతుందని భావించే పరిస్థితులు కనిపించడం లేదు.
చేతులు కాలాకా ఆకులు పట్టుకున్న చందంగా ఓలీ సోమవారం (సెప్టెంబర్ 8) అత్యవసరంగా కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి సామాజిక మాధ్యమాలపై నిషేధం ఎత్తివేత నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని అధికారికంగా సమాచార, ప్రసార శాఖ మంత్రి పృథ్వీ సుబా గురుంగ్ అధికారికంగా వెల్లడించారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇద్దరు కేబినెట్ మంత్రులు ఓలీపై విశ్వాసాన్ని కోల్పోయి రాజీనామా చేశారు. ఇప్పటికే ఓలీ తీరుకు వ్యతిరేకంగా నేపాల్ హోంమంత్రి రాజీనామా చేశారు. తాజాగా వ్యవసాయ మంత్రి రామ్ నాథ్ అధికారి సైతం తన పదవికి రాజీనామా చేశారు. మరి కొందరు మంత్రులు కూడా అదే బాట పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి,
ప్రధానంగా సామాజిక మాధ్యమ వేదికలపై నిషేధాన్ని వ్యతిరేకిస్తూ యువత రోడ్లపైకి వచ్చింది. నేపాల్‌లో ఇన్‌స్టా, ఎక్స్, యూట్యూబ్, ఫేస్‌బుక్‌తో సహా 26 సామాజిక మాధ్యమ వేదికల యాప్ లు సెప్టెంబర్ 4నుంచీ నిలిచిపోయాయి. ఒక్క రెండు రోజుల వ్యవధిలో దేశ వ్యాప్తంగా దీనికి వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంటాయి. తొలుత ఈ ఆందోళనలను అణచివేయాలని చూసిన ఓలీ సర్కార్ పోలీసులనే కాదు, సైన్యాన్నీ మోహరించింది. రాజధాని నగరం ఖాడ్మండూ సహా ప్రలు ప్రాంతాలలో కర్ఫ్యూ విధించింది. అయితే ప్రజాగ్రహాన్ని అణచడంలో కానీ, తగ్గించడంలో కానీ ఇవేవీ పని చేయలేదు.
సరే ఇప్పుడు నేపాల్ ప్రభుత్వం అసలు సామాజిక మాధ్యమ వేదికలపై నిషేధం విధించడానికి కారణమేంటా అని చూస్తే.. దేశంలో చట్టాలను పాటిస్తామని డిక్లరేషన్ ఇవ్వాలంటూ సామాజిక మాధ్యమ వేదిక సంస్థలకు నేపాల్ సర్కార్ గడువు విధించింది. ఆ గడువులోగా వాటి నుంచి స్పందన లేకపోవడంతో కొన్నిటిపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. అలా నిషేధానికి గురైన వాటిలో కమ్యూనికేషన్ కు ప్రాణాధారంలాంటి మెసేజింగ్ యాప్ లు ఉండటమే నేపాల్ ప్రజల అశాంతికి కారణమైంది. పెద్ద సంఖ్యలో నేపాలీయులు విదేశాలలో నివసిస్తున్నారు. దీంతో అక్కడ నివసించే వారు ఇక్కడ ఉన్న తమ వారితో కాంటాక్ట్ చేయడానికీ, అలాగే ఇక్కడి వారు విదేశాలలో ఉన్న తమవారితో కాంటాక్ట్ లో ఉండడానికి మెసేజింగ్ యాప్ లో వారధులు. అటువంటి యాప్ లు నిషేధం కారణంగా పని చేయకపోవడంతో అశాంతి ప్రబలింది. ఇప్పుడు ప్రభుత్వం వెనక్కు తగ్గి నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించినా.. జనం నిరసనలను వదిలేలా కనిపించడం లేదు.
మొత్తంగా ఓలీ ప్రభుత్వం అవినీతి మయం, అసమర్థతకు నిలువెత్తు నిదర్శనమంటూ గళమె త్తుతున్నారు. ప్రభుత్వం పతనమయ్యే వరకూ పోరాటాన్ని వదిలేది లేదంటున్నారు. దీంతో నేపాల్ లో రాజకీయ సంక్షోభం పీక్స్ కు చేరింది. ప్రధాని ఓలి ఇంటికి ఆందోళనకారులు నిప్పు పెట్టారు. సోషల్ మీడియాపై ఆంక్షలు ఎత్తివేసినా అల్లర్లు అదుపులోకి రాలేదు. నిరసనకారులపై పోలీసులు టీయర్ గ్యాస్ ప్రయోగించడంతో పాటు లాఠీ ఛార్జీ చేసినా ఫలితం లేకపోయింది. ప్రధాని ఓలి దుబాయ్ కు పరారైపోయారు. సైన్యం ఒత్తిడితో ప్రధాని పదవికి రాజీనామా చేశారు. ఇక మాజీ ప్రధానమంత్రి, మంత్రుల నివాసాలకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. అధ్యక్షుడి భవనంలోకి ప్రవేశించి విధ్వం సానికి పాల్పడ్డారు. మంగళవారం ఉదయం నుంచీ దేశ వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలూ కొనసాగుతునే ఉన్నాయి. నేపాల్ ప్రధాని , ప్రభుత్వ ప్రతినిధి, సమాచార, కమ్యూనికేషన్ మంత్రి నివా సానికి నిరసనకారులు నిప్పుపెట్టారు. దేశ పార్లమెంట్ భవనాన్నీ ముట్టడించి ప్రభుత్వాన్ని రద్దు చేయాలంటూ నినాదాలు చేస్తున్నారు. పరిస్థితిని చక్కదిద్దడానికి సైన్యం రంగంలోకి దిగింది. ప్రధాని పదవికి రాజీనామా చేసిన ఓలీ మంగళవారం సాయంత్రం అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఉప ప్రధానికి బాధ్యతలు అప్పగించిన ఆయన ఆరోగ్యం సాకుగా చూపుతో అఖిలపక్ష సమావేశం తరువాత దుబాయ్ వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.