కొడిగడుతున్న నక్సలైట్ ఉద్యమం

దేశంలో మావోయిస్టు ఉద్యమం దాదాపు అంత్య దశకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది మార్చి 31 నాటికి నక్సల్ విముక్త భారత్ లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ కగార్ సత్ఫలితాలను ఇస్తున్నది. వరుస ఎన్ కౌంటర్ లలో కీలక నేతలు సహా  వందల మంది హతమయ్యారు. ఈ నేపథ్యంలోనే పలువురు అగ్రనేతల సహా వందల సంఖ్యలో మావోయిస్టులు ఆయుధాలను విడిచి జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారు.

మావోయిస్టు ఉద్యమానికి ఆయువుపట్టులాంటి ఛత్తీస్ గఢ్ నుంచే మావోయిస్టులు పెద్ద సంఖ్యలో లొంగిపోతుండటంతో మావోయిస్టు ఉద్యమం ఇప్పట్లో పుంజుకునే అవకాశాలు కనిపించడం లేదని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. వరుస ఎన్ కౌంటర్లలో కీలక నేతలు హతమవ్వడం,  అలాగే మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు సైతం ఆయుధాలు అప్పగించి లొంగుబాట పడుతున్నారు. బుధ గురు (అక్టోబర్ 15, 16) వారాలలో ఛత్తీస్ గఢ్ లో మొత్తం  258 మంది మావోలు ఆయుధాలు విడిచి జనజీవన స్రవంతిలో కలిశారు. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా వెల్లడించారు. దేశంలో మావోయిజాన్ని పూర్తిగా నిర్మూలించడమే తమ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు. ఆయుధాలు అప్పగించి జనజీవన స్రవంతిలో కలవడానికి వచ్చిన వారు సమాజంలో గౌరవంగా బతికేలా సౌకర్యాలు కల్పించి అన్నివిధాలుగా సహకారం అందిస్తామనీ, అలా కాకుండా ఆయుధాలు విసర్జించకుండా పోరాటమే బాట అనే వారిపై చర్యలు తప్పవనీ అమిత్ షా హెచ్చరించారు.

ఇలా ఉండగా శుక్రవారం (అక్టోబర్ 17)న   దండకారణ్యం ప్రాంతానికి చెందిన సీనియర్ మావోయిస్టు నేతలు సహా రెండు వందల మంది  ఆయుధాలు అప్పగించి లొంగిపోయారు.  బస్తర్ లో సీఎం ఛత్తీస్ గఢ్ సమక్షంలో ఆ లొంగుబాటు కార్యక్రమం జరగనుంది. అర్ధ శతాబ్దంగా ప్రభుత్వాలకు పెను సవాల్ గా నిలిచిన మావోయిస్టు  ఉద్యమం ఇప్పుడు కొడిగట్టినట్లుగా విశ్లేషకులు చెబుతున్నారు.  ఉద్యమంలోని అంతర్గత విభేదాలు, స్థానిక ప్రజల నుంచి మద్దతు కరువవడం, ప్రభుత్వ నిర్బంధం కూడా మావోయిస్టులు లొంగుబాట పట్టడానికి కారణమని అంటున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu