జగమంత కుటుంబం.. జగమేలిన ఆనందం

తోపుడుబండిపై తిరుగుతూ గ్రామాన్ని పలకరించి పులకరించిన వృద్ధురాలు

పూర్తిగా మంచానికే పరిమితమై బతుకు బండి నడిపిస్తున్న ఓ వృద్ధురాలికి.. తన ఊరంతా ఒక సారి చూడాలన్న కోరిక కలిగింది. అడుగుతీసి అడుగు వేయలేని పరిస్థితిలోనూ ఆమెలో తన ఊరంతటినీ కళ్లారా చూసుకోవాలన్న తపన రోజురోజుకూ పెరిగిపోతోంది. ఇదే విషయాన్ని తన కుటుంబ సభ్యులకు చెప్పింది. వృద్ధాప్యంలోనూ ఆమెకు ఆ ఊరిపట్ల ఉన్న మమకారానికి ముగ్ధులైన వారు ఆమె కోరిక తీర్చాలని నిర్ణయించుకున్నారు. అంతే ఓ తోపుడు బండిలో ఆమెను కూర్చోపెట్టి ఊరంతా తిప్పారు. ఇక ఊరు ఊరంతా ఆమెను పలకరిస్తూ, ఆప్యాయంగా మాట్లాడారు.

దారి పొడవునా ఆమెను పలకరిస్తూ వెంటనడిచారు. కొన్ని ఇళ్ల ముందు ఆమె తోపుడుబండిని ఆపించి మరీ తన పరిచయస్తులను, ఆత్మీయులను పలకరించారు. ఇక ఊరిలో అందరూ ఆమె దగ్గరకు వచ్చి పలకరించారు. ఇలా దారంతా ఆనందభాష్పాలు రాలుస్తూ ఆమె మధురానుభూతి పొందారు. ఈ సంఘటన జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం వేంపల్లిలో జరిగింది. ఊరిపట్ల అంతులేని మమకారాన్ని పెంచుకుని ముదిమి వయస్సు లోనూ ఊరంతా తోపుడుబండిపై కలియదిరిగిన ఆమె పేరు శ్రీరాముల నర్సమ్మ. ఆమె వయస్సు 90 ఏళ్లు.

కొడుకు, కోడలు, మనవలు, మనవరాళ్లు ఇలా ఆత్మీయులంతా వెంటరాగా ఆమె తోపుడుబండిపై కూర్చుని గ్రామమంతా కలియదిరిగి, స్నేహుతులు, బంధువుల ఇళ్ల ముందు ఆగుతూ ఆత్మీయ పలకరింపులు, మధురానుభూతుల నెమరవేతలకు సంబంధించి ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. నవమాసాలు మోసి కనిపెంచిన తల్లి రుణం తీర్చుకోవడానికీ, ఆమె కోరిక ఈడేర్చడానికి కుటుంబ సభ్యులు చేసిన వినూత్న ఆలోచన పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమౌతోంది.  గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu