పెన్నా వరదలో చిక్కుకున్న పేకాటరాయుళ్లు!
posted on Sep 16, 2025 10:09AM

పోలీసుల కళ్లు కప్పి చతుర్ముఖపారాయణంలో మునిగిపోయిన పేకాటరాయుళ్లు వరదలో చిక్కుకుని హాహాకారాలు చేసిన సంఘటన నెల్లూరులో జరిగింది. ఏ పోలీసుల కళ్లు కప్పి అయితే పేకాట ఆడుతున్నారో.. ఆ పోలీసులే రిస్క్ ఆపరేషన్ చేసి మరీ వారిని రక్షించాల్సి వచ్చింది. వివరాల్లోకి వెడితే నెల్లూరు పెన్నానది బైపాస్ వంతెన ఫిల్లర్ ల కింద లైట్లు ఏర్పాటు చేసుకుని మరీ పేకాట ఆడుతున్న పదిహేను మంది జూదరులు ఒక్కసారిగా వచ్చిన పెన్నా నదీ ప్రవాహంలో చిక్కుకున్నారు.
సోమశిల జలాశయం నుంచి నీటిని విడుదల చేయడంతో పెన్నానదికి వరద పోటెత్తింది. దీంతో బైపాస్ వంతెన ఫిల్లర్ల కింద పేకాటలో మునిగిపోయి ఉన్న పేకాట రాయుళ్లు ఆ వరదలో చిక్కుకున్నారు. గంటగంటకూ వరద ప్రవాహం పెరుగుతుండటంతో ప్రాణభయంతో హాహాకారాలు చేశారు.
ఎలాగైనా తమను రక్షించమని కోరుతూ తెలిసిన వారికి ఫోన్ల మీద ఫోన్లు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. బ్రిడ్జిపైనుంచి నిచ్చెన సాయంతో ఒక్కొక్కిగా పేకాటరాయుళ్లు 15 మందినీ రక్షించారు. పోలీసులు ఇంతటి రిస్క్ ఆపరేషన్ చేసి ఉండకపోతే ప్రాణనష్టం జరిగి ఉండేదని స్థానికులు అంటున్నారు. పోలీసుల సహసాన్ని అభినందిస్తున్నారు.