వివేకా హత్య కేసు.. సీబీఐ కోర్టులో సునీత పిటిషన్
posted on Oct 23, 2025 1:53PM

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరింత లోతైన దర్యాప్తు జరపాలని కోరుతూ డాక్టర్ సునీతారెడ్డి హైదరాబాద్‌లోని నాంపల్లి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో దర్యాప్తును కేవలం కొందరికే పరిమితం చేస్తే అసలు సూత్రధారులు తప్పించుకునే ప్రమాదం ఉందని ఆమె ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. ఇప్పటికే తండ్రిని కోల్పోయి తీవ్ర బాధలో ఉన్న తనకు అన్యాయం జరగకూడదని డాక్టర్ సునీత తన పిటిషన్ లో పేర్కొన్నారు. తదుపరి దర్యాప్తు కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించవచ్చని సుప్రీంకోర్టు ఇటీవల సూచించిన నేపథ్యంలో డాక్టర్ సునీత ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో సాక్షులను ప్రభావితం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆమె.. ఈ విషయాన్ని స్వయంగా సీబీఐ, ఏపీ పోలీసులే సుప్రీం కోర్టుకు తెలియజేశారన్నారు.
ఈ కేసులో ఐదో నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్య రెడ్డి, కడప జైలులో అప్రూవర్‌గా మారిన నాలుగో నిందితుడు దస్తగిరితో భేటీ అయి, ఆయన్ను ప్రలోభపెట్టేందుకు, బెదిరించేందుకు ప్రయత్నించారని సునీత ఆరోపించారు. ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపితే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఆమె తన పిటిషన్ లో కోర్టును కోరారు. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేసి సప్లిమెంటరీ చార్జిషీట్ దాఖలు చేసేలా సీబీఐని ఆదేశించాలని ఆమె కోర్టును అభ్యర్థించారు.