యూఏఈలో సక్సెస్ ఫుల్ గా సాగుతున్న బాబు పెట్టుబడుల వేట
posted on Oct 23, 2025 11:18AM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టుబడుల వేటలో దూకుడు పెంచింది. ప్రపంచ దేశాల నుంచి పెట్టుబడులకు ఏపీ గమ్యస్థానం అన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆ విషయంలో విజయవంతం అవుతోంది. నవంబర్ లో విశాఖలో జగరనున్న సదస్సుకు ఏపీ సర్కార్ పలు సంస్థలను ఆహ్వానిస్తున్నది.
భారీగా పెట్టుబడులు ఆకర్షించేందుకు ఆయా సంస్థలతో ఒప్పందం చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అందులో భాగంగా మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దుబాయ్ పర్యటనలో బిజీగా ఉన్నారు. కాగా వీరిద్దరి ప్రయత్నాలకూ ఆయా దేశాలలోని పారిశ్రామిక వేత్తల నుంచి మంచి సానుకూలత లభిస్తోంది. ఎనిమిదేళ్ల తరువాత ఏపీ రొయ్యలు ఆస్ట్రేలియాకు ఎగుమతి కావడానికి మార్గం సుగమమైందంటే అది లోకేష్ కృషి ఫలితమేనని చెప్పక తప్పదు.
ఇక చంద్రబాబుకు అయితే పారిశ్రామిక వేత్తలు దుబాయ్ లో రెడ్ కార్పెట్ పరిచారనే చెప్పాలి. తన దుబాయ్ పర్యటనలో చంద్రబాబు ట్రాన్స్ వరల్డ్ గ్రూప్ చైర్మన్ రమేష్ ఎస్ రామకృష్ణన్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ట్రాన్స్ వరల్డ్ గ్రూప్ ఏపీలో షిఫ్ట్ బిల్డింగ్ ప్రాజెక్టును ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపింది. లాజిస్టిక్స్ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఇది ఎంతగానో దోహదం చేస్తుందన్న అంచనాలు ఉన్నాయి. అలాగే చంద్రబాబు బుర్జిల్ హెల్త్ కేర్ హోల్డింగ్స్ చైర్మన్ సంషీర్ వయాలీల్ తో సమావేశమయ్యారు. ఆ సంస్థ అబుదాబిలో అతిపెద్ద క్యాన్సర్ ఆసుపత్రి నిర్వహిస్తోంది. ఏపీలో అత్యధునిక క్యాన్సర్ సెంటర్ నిర్మాణానికి ముందుకు వచ్చింది. ఇంకా చంద్రబాబు శుక్రవారం వరకూ యూఏపీలోనే పర్యటించనున్నారు. ఆయన వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. ప్రముఖ సంస్థలతో అక్కడే ఒప్పందాలు చేసుకుని గ్లోబల్ సమ్మిట్ లో వాటిపై ప్రకటనలు చేసేలా ముందుకు సాగుతున్నారు.
ఇక గురువారం ఉదయం ఆయన అబుదాబీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ అహ్మద్ జైసిమ్ అల్ జాబీతో, జీ 42 సీఈఓ మన్సూర్ అల్ మన్సూరీతో చంద్రబాబు భేటీ అయ్యారు. అలాగే అబుదాబీ నేషనల్ ఆయిల్ కంపెనీ ప్రతినిధులు అహ్మద్ బిన్ తలిత్, లాజిస్టిక్స్ విభాగం ప్రతినిధి అబ్దుల్ కరీమ్ అల్ మసాబీ, అదే సంస్థకు చెందిన రషీద్ అల్ మజ్రోయి, జాయేద్ అల్ షాయేయా, సయీద్ అల్ అమేరి తదితరులనూ భేటీ అయ్యారు. గురువారం (అక్టోబర్ 23) యూఏఈలో ఆయన రెండో రోజు పర్యటన ఆద్యంతం బిజీబిజీగా సాగనుంది.
అబుదాబీలోని స్థానిక టెక్నాలజీ కంపెనీల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న అనంతరం, మధ్యాహ్నం అబుదాబీ పెట్టుబడుల విభాగం చైర్మన్ ఖలీఫా ఖౌరీతో సీఎం భేటీ కానున్నారు. అలాగే లులూ గ్రూప్ సీఎండీ యూసఫ్ అలీతో కూడా సమావేశమై విశాఖ, విజయవాడలలో లులూ మాల్స్ నిర్మాణం, మల్లవల్లిలో లాజిస్టిక్స్ కేంద్రంపై చర్చించనున్నారు. ఏపీలో ఫుడ్ ప్రాసెసింగ్ పార్కును ఏర్పాటు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్న అగితా గ్రూప్ సీఈఓ సల్మీన్ అల్మెరీతో కూడా ముఖ్యమంత్రి భేటీ కానున్నారు. అబుదాబీలోని మస్దార్ సిటీ సీఈఓ మహ్మద్ జమీల్ అల్ రమాహితో సమావేశమవుతారు. అనంతరం యాస్ ఐలాండ్‌లోని పర్యాటక ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై ఆ సంస్థ సీఈఓ మహ్మద్ అబ్దల్లా అల్ జాబీతో భేటీ కానున్నారు. ఈ సమావేశం అనంతరం భారత కాన్సుల్ జనరల్ నివాసంలో ముఖ్యమంత్రి గౌరవార్ధం ఇచ్చే విందుకు చంద్రబాబు హాజరవుతారు. నేడు మొత్తం 9 సమావేశాలకు ముఖ్యమంత్రి హాజరుకానున్నారు.