ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టిన ఏబీవీ
posted on Oct 23, 2025 2:37PM
.webp)
కందుకూరు ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవల్లో జరిగిన హత్య ఘటనలో బాధిత కుటుంబానికి ప్రభుత్వ పరిహారం చెల్లించడంపై విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్, ఏబీ వెంకేటశ్వరరావు ఈ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రధాన సమస్యలన్నిటినీ పక్కనపెట్టి కుల గొడవలు, హత్యలు మీద దృష్టి పెడుతున్నదని విమర్శించారు. ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పోలీసులు తాము చేయాల్సిన పని చేయడం లేదని దుయ్యబట్టారు.
కులాల గొడవలతో కొట్టుకు చస్తే.. ఎకరాలకు ఎకరాలు, లక్షలకు లక్షలు ఇవ్వడం ఏమిటని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. ఏపీలో ఏడాదికి 900 హత్య కేసులు నమోదవుతున్నాయనీ, హతులందరికీ ఇలాగే నష్టపరిహారం ఇచ్చుకుంటూ పోతారా? అని ప్రశ్నించారు.
నెల్లూరు జిల్లా కందుకూరు సమీపంలోని దారకానిపాడు గ్రామంలో దసరా పండుగ రోజు జరిగిన దారుణ హత్య ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. పాతికేళ్ల తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు అనే వ్యక్తిని హరిచంద్రప్రసాద్ అనే వ్యక్తి కారుతో గుద్ది హత్య చేశాడు. లక్ష్మినాయుడు సోదరులకు కాళ్లు, చేతులు విరిగాయి. ప్రత్యక్ష సాక్షుల సమాచారం ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీల కారణంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసులు తేల్చారు. అయితేఈ ఈ హత్య రాజకీయ, కులాల కుంపటిగా మారింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం హతుడు లక్ష్మీ నాయుడు కుటుంబానికి పరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించింది.
భార్యకు 2 ఎకరాల భూమి, రూ.5 లక్షల నగదు పరిహారం ఇవ్వాలని నిర్మయించారు. ఇద్దరు పిల్లలకు 2 ఎకరాల చొప్పున భూమి, రూ.5 లక్షల చొప్పున ఫిక్స్‌డ్ డిపాటిజ్ చేయాలని సీఎం ఆదేశించారు. లక్ష్మీ నాయుడు పిల్లలను చదివించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. అలాగే కారు దాడిలో గాయపడ్డ పవన్, భార్గవ్‌కు కూడా పరిహారం అందించాలని సీఎం ఆదేశించారు. లక్ష్మీ నాయుడు హత్య కేసు విచారణ వేగంగా జరిగేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పగించి.. కోర్టులో కేసు విచారణ కోసం ప్రత్యేక పీపీని నియమించాలని సీఎం చంద్రబాబునాయుడు ఆదేశించారు. అయితే భారీ పరిహారం ఇవ్వడాన్ని ఏబీవీ తప్పుపట్టారు.