మోడీగిరితో సోనియా రాహుల్ కు అగ్నిపరీక్షలు
posted on Nov 16, 2013 @ 9:09PM
క్రికెట్ లో సచిన్ అధ్యాయం ముగిసే సమయానికి భారత రాజకీయాలలో మోడీ అధ్యాయం మొదలవుతోంది. కాంగ్రెస్ పార్టీ అంతకు ముందు బీజేపీలో అనేకమంది అతిరధ మహారధులను ఎంతో సమర్ధంగా డ్డీ కొనప్పటికీ, మోడీ రాకతో ఇప్పుడు ఒక సరికొత్త ఇబ్బందిని ఎదుర్కొంటోంది. మంచి రాజకీయ అనుభవజ్ఞుడు మరియు మంచి వక్త అయిన మోడీని డ్డీ కొనేందుకు కాంగ్రెస్ లో చాల మంది నేతలున్నపటికీ, వారిలో ఎవరికీ కూడా ప్రజలలో సరయిన గుర్తింపు లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ వారి సేవలు ఉపయోగించుకోలేకపోతోంది.
ఇక బీజేపీ మోడీని తమ ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించేసి చేతులు దులుపుకొన్నపతి నుండి ఆయన చెలరేగిపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీనే తన ప్రధాని అభ్యర్ధిగా భావిస్తున్నకారణంగా, ప్రజలు సహజంగానే వారిరువురిని ఒకరితో మరొకరిని పోల్చి చూడటం మొదలుపెట్టారు. దానితో మోడీ ముందు రాహుల్ గాంధీ ప్రతీ విషయంలోను తేలిపోతున్నారు.
కనీసం అతను తన ఉపన్యాసాల ద్వారానయినా జనాలను ఆక్కట్టుకొంటారంటే, నాయనమ్మ, తండ్రి, తన మరణాల గురించి, ముజఫర్ నగర్ లో పాకిస్తానీ గూడచారుల కదలికల గురించి అసందర్భ ప్రసంగాలు చేస్తూ, పార్టీకి మేలు చేయకపోగా సరి కొత్త సమస్యలు తెచ్చిపెడుతున్నారు. ఈ పరిస్థితుల్లో అతని తల్లి సోనియా గాంధీయే చొరవ తీసుకోక తప్పడం లేదు.
కానీ ఆమెకు భాష పెద్ద ఇబ్బందిగా మారింది. ఇటలీ దేశస్తురాలయిన ఆమెకు హిందీపై నేటికీ పూర్తి పట్టు లేకపోవడంతో ముందుగా వ్రాసిచ్చిన ప్రసంగాలతో ఆమె గ్రామీణులను ఆకట్టుకోవడంలో విఫలం అవుతున్నారు. హిందీపై మంచి పట్టున్న రాహుల్ గాంధీకి అనుభవ రాహిత్యం సమస్య అయితే, అనుభవమున్న తల్లికి బాష సమస్యగా మారింది.
మోడీకి సరిగ్గా ఈ రెండు అంశాలే బాగా కలిసి వచ్చాయి. అపారమయిన రాజకీయ పరిజ్ఞానం, సమయం, సందర్భానుసారంగా మాట్లాడే నేర్పు, హిందీ బాషాపై మంచి పట్టు, పండిత పామరులను సైతం అక్కట్టుకోగల సరళమయిన ప్రసంగ శైలి, బాషలతో ఆయన ప్రచారంలో దూసుకుపోతున్నారు. సోనియా, రాహుల్ విసురుతున్న ప్రతీ అస్త్రాన్నిఆయన సమర్ధంగా తిప్పి కొట్టడమే కాకుండా, వారి ప్రసంగాల నుండే లోపాలను వెతికి పట్టుకొని వారిపైనే వాటిని తన అస్త్రాలు ప్రయోగిస్తూ ముప్పతిప్పలు పెడుతున్నారు.
సోనియా ప్రసంగాలు ప్రజలకు అర్ధం కావు. రాహుల్ గాంధీ ప్రసంగాలు ఆకట్టుకోలేకపోతున్నాయి. అందువల్ల వారు ఎంత గొప్ప ప్రసంగాలు చేసినా అవి మోడీ చేస్తున్న ప్రసంగాలకి సరి తూగడం లేదు. చివరికి ఇది సోనియా, రాహుల్ గాంధీలకు ఎన్నికల యుద్ధంగా కాక, రాజకీయ ప్రసంగ పరీక్షగా తయారయింది. “కేవలం మాటకారితనంతోనే ప్రజలను ఆకట్టుకొని ఓట్లు రాబట్టుకోవచ్చునని మోడీ భావించడం చాలా హాస్యాస్పదం,” అని సోనియా గాంధీ పలకడం ఈవిషయంలో మోడీ ఆధిక్యతను అంగీకరిస్తున్నట్లుగా అర్ధం అవుతోంది.
ప్రస్తుత రాజకీయాలలో మంచి వక్త అయి ఉంటే ఏవిధంగా లాభిస్తుందో తెలుసుకోవడానికి మోడీయే సజీవ ఉదాహరణగా నిలుస్తారు. మరి కాంగ్రెస్ ఈ ‘మోడీగిరి’ని తట్టుకొని గెలుస్తుందో లేదో మరొక నెలలో స్పష్టమయిపోతుంది.