హైటెక్ సిటీకి 15వ పుట్టిన రోజు నేడు
posted on Nov 22, 2013 @ 6:23PM
హైదరాబాద్ సమీపంలో హైటెక్ సిటీ నిర్మాణం జరిగి నేటికి సరిగ్గా పదిహేనేళ్ళు పూర్తయింది. హైటెక్ సిటీ నిర్మాణంతో హైదరాబాదుకి ఐటీ కేంద్రంగా మరో కొత్త గుర్తింపు ఏర్పడింది. అప్పటి నుండే నగరం మెట్రో హంగులు సంతరించుకోవడం కూడా మొదలయింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఐటీ దిగ్గజాలు ఒకటొకటిగా హైటెక్ సిటీలో తమ కార్యాలయాలను తెరవడంతో వేలాది మంది యువతకి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి దొరికింది. దీనితో రాష్ట్రం, దేశం నలుమూలల నుండి హైదరాబాద్ నగరానికి భారీ వలసలు కూడా మొదలయ్యాయి.
సాంకేతిక నిపుణులను తయారుచేసే విద్యాసంస్థలు ఉద్భవించాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం, హోటల్స్, మౌలిక సదుపాయాలూ, విమాన సర్వీసులు, విద్యాసంస్థలు ఒకటేమిటి క్రమంగా అన్నిరంగాలలో ఊహించనంత అభివృద్ధి జరిగింది. ఐటీ రంగం పూర్తిగా నిలద్రోక్కుకొన్న తరువాత ఐటీసంస్థల ఆదాయం ఊహించనంతగా పెరిగింది.
దానితో బాటే ప్రజల తలసరి ఆదాయాలు కూడా పెరిగాయి. మధ్యతరగతి కుటుంబాలు ఎగువ మధ్య తరగతిలోకి మారారు. బంగారు బాతువంటి ఐటీ కంపెనీలకు అవసరమయిన వివిధ రకాల సేవలందించడం ద్వారా దిగువ తరగతుల వారి జీవన ప్రమాణాలు క్రమంగా పెరిగాయి. ఇప్పుడు హైదరాబాద్ ఐటీ రంగమే రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరుగా మారిందంటే హైదరాబాదులో ఐటీ రంగం ఎంతగా అభివృద్ధి చెందిదో అర్ధం అవుతుంది.
ఈ ఐటీ రంగం కేవలం హైదరాబాదుతోనే ఆగిపోకుండా వైజాగ్ వంటి నగరాలకు కూడా వ్యాపించింది. ఇప్పుడు రాష్ట్రంలో హైదరాబాదు తరువాత వైజాగ్ రెండవ ఐటీ కేంద్రంగా ఎదుగుతోంది.
నేటి ఈ అభివృద్దికి మూల కారకుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబేనని ఏ రాజకీయ పార్టీ అయినా అంగీకరిస్తుంది. హైటెక్ సిటీని, చంద్రబాబుని వేరుగా చూడలేము. హైటెక్ సిటీ అనగానే ముందుగా గుర్తుకు వచ్చే పేరు ఆయనదే. దాని అభివృద్ధి కోసం ఆయన అంతగా కృషి చేసారు.
హైటెక్ సిటీ నిర్మాణం జరిగి నేటికి 15సం.లు పూర్తయిన శుభసందర్భంగా ఏర్పాటు చేసిన ఒక సభకు ఐటీ సంస్థలు చంద్రబాబుని ఆహ్వానించాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,”ఒకప్పుడు కొండలు గుట్టలతో పనికిరాని ప్రాంతంగా పడి ఉన్న ఈ ప్రాంతాన్నిహైటెక్ సిటీగా మలచడానికి మా ప్రభుత్వం చాలా కృషి చేసింది. తత్ఫలితంగా ఈ రోజు కనబడుతున్న అభివృద్ధిని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నా మనసు తృప్తితో నిండిపోయింది. హైటెక్ సిటీ నిర్మాణం ఒక ఎత్తయితే, ఇక్కడికి ఐటీ సంస్థలను రప్పించి అవి ఇక్కడ స్థిరపడేలా చేయడం మరో ఎత్తు. చివరికి మా కృషి ఫలించి హైదరాబాద్ ఐటీ కేంద్రంగా యావత్ దేశంలోనే కాక ప్రపంచంలో కూడా ఒక ప్రత్యేక గుర్తింపు పొందింది."
"ఇంతవరకు ఒక తరంవారు దీని ఫలాలను పొందగలిగారు. ఇక ముందు కూడా ఇలాగే యువత దీనివలన ప్రయోజనం పొందాలని నేను మనసారా కోరుకొంటున్నాను. అయితే గత కొన్నేళ్లుగా ప్రభుత్వం ఈ ఐటీ రంగాన్ని, హైటెక్ సిటీని నిర్లక్ష్యం చేయడంతో జరుగవలసినంతగా అభివృద్ధి జరుగలేదు. యువత కూడా రాజకీయాలలో ప్రవేశించిన నాడే అభివృద్ధి వేగవంతం అవుతుంది. అభివృద్దిని సాధించగల ఒక చక్కటి ప్రభుత్వాన్ని ఏర్పరుచుకోవలసిన బాధ్యత యువత మీదే ఉంది,” అని చంద్రబాబు అన్నారు.