రాష్ట్ర విభజనకు ఆర్టికల్ 371 బ్రేక్
posted on Nov 20, 2013 7:15AM
రాష్ట్ర విభజన ప్రక్రియ ఎవరికీ అంతుచిక్కని ఒక బ్రహ్మ పదార్ధంగా తయారయింది. ఇంతవరకు హైదరాబాద్, నదీ జలాలు, విద్యుత్, ఉద్యోగాలు వంటి చిక్కు ముళ్ళని విప్పేందుకు ప్రయత్నిస్తున్న కేంద్రమంత్రుల బృందానికి ఇప్పుడు ఆర్టికల్ 371 (డీ) ప్రధాన అడ్డంకిగా మారింది. దీని గురించి న్యాయ నిపుణులే కాక, సీమాంధ్ర నేతలు, ఉద్యోగులు కూడా మొదటి నుండి హెచ్చరిస్తున్నపటికీ కాంగ్రెస్ అధిష్టానం మొండిగా ముందుకు సాగింది.
కానీ నిన్న భారత అటార్నీ జనరల్ వాహనవతి ఆర్టికల్ 371ని సవరించడమో లేక రద్దు చేయడమో చేయకుండా రాష్ట్ర విభజనపై ముందుకు సాగడం అసాధ్యమని కేంద్రమంత్రుల బృందానికి స్పష్టం చేసినట్లు సమాచారం. రాజ్యాంగంలో ఆర్టికల్ 3ప్రకారం ఏ రాష్ట్రాన్నయినా విభజించాలంటే ముందుగా ఆర్టికల్ 371ని సవరించడమో లేక రద్దు చేయడమో తప్పనిసరి అని ఆర్టికల్ 4లో స్పష్టంగా పేర్కొన్నట్లు వాహనవతి కేంద్రమంత్రుల బృందానికి చెప్పినట్లు తెలుస్తోంది.
అయితే ఇది రాష్ట్ర విభజనకి ఎంతమాత్రం అడ్డంకి కాదని, దీనిని యధాతదంగా కొనసాగిస్తూనే విభజన చేయవచ్చని, ఆ తరువాత కూడా దీనిని చిన్నచిన్న రాజ్యంగా సవరణలతో రెండు రాష్ట్రాలలో యధాతధంగా కొనసాగించవచ్చని టీ-కాంగ్రెస్ నేతలు, తెరాస నేతల వాదన.
అయితే రాజ్యాంగంలో ఆ వెసులుబాటు ఉన్నప్పటికీ, దానివలన తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణాలో పనిచేస్తున్న ఉద్యోగులను వెళ్లిపొమ్మనే హక్కు ఎవరికీ ఉండదు. ఎక్కడివారు అక్కడే ఉద్యోగాలు చేసుకోవచ్చును. అంతే కాక, జోనల్, క్యాడర్ విధానాలు అమలు కూడా సాధ్యం కాదని న్యాయ నిపుణుల అభిప్రాయం. ఇది కొత్త రాష్ట్రంగా అవతరిస్తున్న తెలంగాణాకు ప్రధాన అవరోధంగా మారుతుంది గనుక రాష్ట్ర విభజన కంటే ముందుగానే ఆర్టికల్ 371ని సవరించడమో లేక రద్దు చేయడమో తప్పనిసరి అవుతుందని న్యాయ నిపుణుల అభిప్రాయపడుతున్నారు.
ఆ పనిచేయాలంటే పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్షమయిన బీజేపీ మద్దతు తప్పనిసరి. బీజేపీ తెలంగాణా బిల్లుకి మద్దతు ఇస్తామని హామీ ఇచ్చింది గానీ ఆర్టికల్ 371ని సవరించేందుకు మద్దతు ఇస్తామని ఎన్నడూ హామీ ఇవ్వలేదు. బీజేపీ తెలంగాణాలో తన పార్టీ కోరిక మేరకు తెలంగాణా బిల్లుకి బేషరతుగా మద్దతు ఇస్తామని ప్రకటించినప్పటికీ, ఇటువంటి సాంకేతిక అంశాలను అడ్డుపెట్టుకొని తప్పించుకోవచ్చును.
తెలంగాణా ఏర్పాటుకి కాంగ్రెస్ కి సహకరించడం వలన బీజేపీకి తెలంగాణాలో కొత్తగా ఒరిగేదేమీ లేకపోగా దానివల్ల కాంగ్రెస్ మరింత బలపడేందుకు అవకాశం కలుగుతుంది. పైగా ప్రస్తుతం ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్,బీజేపీలు ఒకదానిపై మరొకటి నిప్పులు చేరుకొంటున్న తీరు చూస్తే, బీజేపీ ఈ విషయంలో కాంగ్రెస్ కి ఎట్టి పరిస్థితుల్లో సహకరించే అవకాశం లేదని స్పష్టం అవుతోంది.
ఈ పరిసితుల్లో కాంగ్రెస్ దీనిని తప్పనిసరిగా రాజకీయంగా పరిష్కరించవలసి ఉంటుందే తప్ప ఈవిషయంలో బహుశః కేంద్రమంత్రుల బృందం కూడా ఏమీ చేయలేకపోవచ్చును.