టీ-కాంగ్రెస్ కి కూడా సీమాంధ్ర నేతల గతి తప్పదా?
posted on Nov 19, 2013 @ 9:41AM
రానున్న ఎన్నికల తరువాత రాహుల్ గాంధీని ప్రధాని కుర్చీలో కూర్చోబెట్టలేకపోయినట్లయితే, ఇక నరేంద్ర మోడీ అతనికి మరెన్నటికీ ఆ కుర్చీలో కూర్చొనీయడనే భయమే కాంగ్రెస్ అధిష్టానాన్ని రాష్ట్ర విభజనలో మొండి దైర్యం కలిగించిందని చెప్పక తప్పదు. రెండు రాష్ట్రాలనుండి కీలకమయిన యంపీ సీట్లు సంపాదించుకోవడమే ఏకైక లక్ష్యంగా మొదలయిన ఈ ప్రక్రియను ఎన్నిఅడ్డంకులు ఎదురయినా లెక్కజేయకుండా అందుకే కాంగ్రెస్ ముందుకు సాగుతోంది.
తను నిర్దేశించుకొన్న ఈ మహత్తర లక్ష్యం కోసం కాంగ్రెస్ తన స్వంత పార్టీని, తన నేతల భవిష్యత్తుని కూడా పణంగా పెట్టేందుకు కూడా వెనకాడట్లేదంటేనే ఈ విషయంలో అది ఎంత పట్టుదలగా ఉందో అర్ధం అవుతోంది. ముందు కేంద్రంలో ఏదో ఒక విధంగా అధికారం నిలబెట్టుకోగలిగితే, ఆ తరువాత రాష్ట్రం సంగతి ఆలోచించవచ్చనే ఉద్దేశ్యంతోనే ఇంతకు తెగిస్తోందని చెప్పవచ్చును.
ఈ లెక్కన చూస్తే ఇప్పుడు సీమాంధ్రలో నేతలని కాలరాసి ముందుకు సాగుతున్నట్లే రేపు తెలంగాణా కాంగ్రెస్ నేతలనీ తన ప్రయోజనం కోసం బలిచేసినా ఆశ్చర్యం లేదు. రానున్న ఎన్నికలలో తెరాసకే మెజారిటీ యంపీ సీట్లు రావచ్చని సర్వేల ఖరారు చేస్తునందున, తెరాస ఇప్పుడు ఒంటరిగా పోటీ చేయడానికి సిద్దపడుతోంది. కాంగ్రెస్ కాకపోతే బీజేపీ ఉండనే ఉందని విస్పష్టంగా చెపుతున్నతెరాస, నిజంగా అన్నంత పనీ చేస్తే కాంగ్రెస్ ఇబ్బందుల్లో పడుతుంది. కనుక తెరాస కోసం తన టీ-కాంగ్రెస్ నేతలను బలిపెట్టినా ఆశ్చర్యం లేదు.
అయితే ముందు జాగ్రత్తగా కేంద్రమంత్రి జైపాల్ రెడ్డిని రంగంలోకి దింపింది. టీ-కాంగ్రెస్ నేతలలో కేసీఆర్ ను ఎదుర్కొని నిలువరించే మొనగాడు ఎవరూ లేడని భావించినందునే ఆయనని తెరమీదకి తెచ్చింది. అయితే అనేక ఏళ్లుగా తెలంగాణకు దూరంగా ఉంటున్నఆయన, ప్రజలతో మమేకమయి తిరుగాడే కేసీఆర్ ను సమర్ధంగా ఎదుర్కొని ఓడించగలడని ఆశించడం అత్యాశే అవుతుంది. కేసీఆర్ ప్రజాకర్షక శక్తి, మాటకారితనం ముందు జైపాల్ రెడ్డి చెప్పే నీతి సూక్తులు ప్రజల చెవులకెక్కడం కష్టమే.
ఇక ప్రస్తుత పరిస్థితులు చూస్తే కాంగ్రెస్ పార్టీయే తెలంగాణా ఇస్తున్నపటికీ ఆ క్రెడిట్ మొత్తం కేసీఆర్ ఖాతాలోనే జమా అవుతోందని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఈ సంగతి తమ అధిష్టానం కూడా దృడంగా నమ్మినట్లయితే తమకు కూడా సీమాంధ్ర కాంగ్రెస్ నేతల గతే పడుతుందనే భయంతోనే వారు జైత్రయాత్రలు చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం వారివల్ల తనకు ఉపయోగం ఉండదని భావిస్తే, వారు ఎన్ని యాత్రలు చేసి ఎంత సోనియా భజన చేసినా వారిని కూడా పక్కన బెట్టి కేసీఆర్ ని చంకనెత్తుకోక మానదు.
ఇంతకాలం ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్నటీ-కాంగ్రెస్ నేతలందరినీ పక్కనబెట్టి కాంగ్రెస్ అధిష్టానం ఏవిదంగా హటాత్తుగా జైపాల్ రెడ్డిని చంక నెత్తుకొందో, రేపు జైపాల్ రెడ్డి కేసీఆర్ ను, అతని తెరాసను ఓడించలేడని అనుమానం కలిగిననాడు, వెంటనే ఆయనని కూడా పక్కన పడేసి కేసీఆర్ ను చంక నెత్తుకోవడానికి కాంగ్రెస్ అదిష్టానం వెనకాడబోదని ఖచ్చితంగా చెప్పవచ్చును. ఎందుకంటే దాని ప్రధాన లక్ష్యం కేంద్రంలోనే కానీ రాష్ట్రంలో అధికారం సంపాదించడం కాదు.