రాష్ట్ర విభజన కూడా ఒక బ్రహ్మ పదార్ధమా?
posted on Nov 14, 2013 @ 8:10PM
జైపాల్ రెడ్డి మాటలలో చెప్పాలంటే రాష్ట్ర విభజన అంతుపట్టని ఒక బ్రహ్మపదార్ధంగా మారింది. కాంగ్రెస్ రహస్య వైఖరే అందుకు ప్రధాన కారణం. విభజన సవ్యంగా ఎలా చేయాలనే విషయంపై తనకు అవగాహన లేదనే సంగతిని ప్రతిపక్షాలు గుర్తించకుండా ఉండేందుకు చాలా తిప్పలుపడుతోంది.
ఇదివరకే ఈ ఈంశంపై అందరితో చర్చించినందున ఇకపై ఎవరితో చర్చలు ఉండబోవని ప్రకటించిన షిండే, మళ్ళీ తనే స్వయంగా మొన్న అఖిలపక్ష సమావేశం నిర్వహించడమే చక్కటి ఉదారణ. అప్పుడు ప్రతిపక్ష పార్టీలు ముందు మీ వైఖరి ఏమిటో చెప్పమని నిలదీసినప్పుడు, రాష్ట్ర విభజన చేస్తున్న కేంద్రమంత్రుల బృందానికి నాయకత్వం వహిస్తున్న షిండే ఆ విషయం గురించి తనకూ పూర్తిగా తెలియదని చెప్పడం కాంగ్రెస్ లో నెలకొన్నఅయోమయ పరిస్థితికి అద్దం పడుతోంది. అయితే మళ్ళీ ఆయనే “ఈ శీతాకాల సమావేశాలలోనే పార్లమెంటులో తెలంగాణా బిల్లుపెట్టి ప్రవేశపెడతామని” ప్రకటించడం విశేషం.
బొటాబొటి మెజార్టీతో తుమ్మితే ఊడిపోయే ముక్కులా సాగుతున్న యు.పీ.యే. ప్రభుత్వం ఎంత చమటోడ్చినప్పటికీ బీజేపీ మద్దతు లేకపోతే బిల్లుని ఆమోదింపజేసేందుకు సరిపోయే యంపీలను కూడగట్టలేదు.
రెండు రోజుల క్రితమే బీజేపీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ “సీమాంధ్రకు అన్యాయం జరుగుతుంటే మేము గుడ్డిగా ఆ బిల్లుకి మద్దతు ఈయబోమని తెలిపారు. ఈ రోజు ఛత్తీస్ ఘర్ ఎన్నికల ప్రచార సభలో నరేంద్రమోడీ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ తనపై సీబీఐని ఉసిగొల్పుతోందని తెలిపారు.
అంటే ఏ పార్టీ నుండి బిల్లుకి మద్దతు ఆశిస్తోందో, ఆ పార్టీకి చెందిన సాక్షాత్ ప్రధాని అభ్యర్ధిపై సీబీఐని ప్రయోగిస్తుంటే, బీజేపీ అవేమి పట్టించుకోకుండా తనకు ఇంత కీడు చేస్తున్నకాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టే బిల్లుకి ఉదారంగా మద్దతు తెలుపుతుందా? తెలిపి తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ మరింత పడేందుకు సాయపడి తన పార్టీని ముంచుకొంటుందా? అని ప్రశ్నించుకొంటే బీజేపీ ఏవిధంగా వ్యవహరించాబోతోందో స్పష్టంగా అర్ధం అవుతుంది.
కనీసం తెరాస తరపునున్న ఏకైక ఓటు కేసీఆర్ దయినా ఈ బిల్లుకి పడుతుందా అంటే అదీ అనుమానమే. ఎందుకంటే తమకు ఎటువంటి షరతులు లేని తెలంగాణా కావాలని, అలా కాకపోతే బీజేపీ ఉండనే ఉందని కేసీఆర్ స్వయంగా చెపుతున్నప్పుడు, తెలంగాణా బిల్లుకి కనీసం తెరాస ఓటు కూడా పడకపోవచ్చునని అర్ధం అవుతోంది.
ఇక సీమాంధ్రలో కాంగ్రెస్ యంపీలలో ఎంతమంది బిల్లుకి మద్దతు ప్రకటిస్తారనేది అనుమానమే. స్వంత పార్టీవారి మద్దతే అనుమానంగా ఉన్నఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ బిల్లుకి ఎక్కడి నుండి మద్దతు కూడగడుతుంది? యు.పీ.యే. ప్రభుత్వం పడిపోకుండా బయట నుండి మద్దతు ఇస్తున్నవాటిలో యస్పీ, బీయస్పీ మాత్రమే ప్రధానమయినవి. వీటిలో యస్పీ రాష్ట్ర విభజనను నిర్ద్వందంగా వ్యతిరేఖిస్తుండగా, బీయస్పీ మాత్రం మద్దతు ఇస్తోంది. అంటే భూమి గుండ్రంగా ఉన్నట్లు, తెలంగాణా బిల్లు ఆమోదం పొందాలంటే తను నిత్యం దూషిస్తున్నబీజేపీ తప్ప వేరే గతి లేదని స్పష్టం అవుతోంది. కానీ బీజేపీ మద్దతు ఈయకపోతే? అందుకే రాష్ట్రవిభజన ఒక బ్రహ్మ పదార్ధంగా మారిందని ఒప్పుకోక తప్పదు.
మరి ఈ విషయాలన్నీ కాంగ్రెస్ నేతలకి తెలియవనుకోవాలా? తెలిసి భ్రమలో ఉన్నారనుకోవాలా? లేక ప్రజలని మభ్యపెట్టవచ్చనుకొంటున్నారా? ఈ జైత్ర యాత్రలు దేనికి? జనవరి ఒకటో తేదీ గడువు దేనికి?