కాంగ్రెస్ పార్టీకి ప్రతికూల వాతావరణం
posted on Dec 5, 2013 @ 9:31AM
రాష్ట్ర విభజనపై నెలరోజులు పైగా కసరత్తు చేసిన కేంద్రమంత్రుల బృందం, తెలంగాణా, రాయల తెలంగాణా అనే అంశంపై కేంద్రమంత్రి వర్గమే తుది నిర్ణయం తీసుకోవలసి ఉంటుందని సూచిస్తూ రెండు ప్రతిపాదనలతో తన తుది నివేదికను ఈ రోజు కేంద్రానికి సమర్పించబోతోంది. విభజన ప్రక్రియ కొలిక్కి వస్తున్నఈ దశలో కూడా సందిగ్దత కొనసాగడం కాంగ్రెస్ ప్రతిష్టని మసకబారుస్తోంది. అందువల్ల ఈరోజు తప్పని సరిగా దానిపై కేంద్ర మంత్రి వర్గం ఒక నిర్ణయం తీసుకొని దానిని ప్రకటించవలసి ఉంది.
ముందు ప్రకటించినట్లు తెలంగాణా ప్రకటిస్తే, తెలంగాణాలో ప్రశాంతత ఏర్పడుతుంది. కానీ, తెలంగాణా బిల్లు ఎటువంటి అభ్యంతరాలు లేకుండా రాష్ట్ర శాసనసభ గడప దాటే అవకాశాలుండవు. అలాగని శాసనసభ అభిప్రాయాలను బేఖాతరు చేస్తూ మొండిగా ముందుకు సాగినట్లయితే రాష్ట్రపతి లేదా కోర్టులు లేదా పార్లమెంటులో ప్రతిపక్షాలు అభ్యంతరాలు లేవనెత్తితే కాంగ్రెస్ పరువు గంగలో కలుస్తుంది.
ఈ సమస్యలను అధిగమించడానికి అది చేస్తున్న రాయల తెలంగాణా ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేఖిస్తూ నేడు తెలంగాణా అంతటా బంద్ కొనసాగుతోంది. ఒకవేళ కాంగ్రెస్ దానికే మొగ్గు చూపినట్లయితే ఇక నుండి తెలంగాణాలో ఆందోళనలు, ఉద్యమాలు మళ్ళీ ఉదృతంగా మొదలవవచ్చును. రాష్ట్ర విభజన అంశం సరిగ్గా పరిష్కరించలేక నానా తిప్పలు పడుతున్నకాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు ఆఖరి నిమిషంలో ఈ రాయల తెలంగాణా ప్రతిపాదన తెరపైకి తీవడంతో చేజేతులా సమస్యను మరింత జటిలం చేసుకొన్నట్లయింది.
ఇక రాష్ట్రంలో పరిస్థితులు చూస్తే నానాటికి కాంగ్రెస్ పార్టీకి పూర్తి వ్యతిరేఖంగా తయారవుతున్నాయి. రాష్ట్ర విభజన, తుఫాను సహాయం అందించడంలో కేంద్రం ప్రదర్శించిన నిర్లక్ష్య వైఖరి, బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పు తదితర అంశాలపై రాష్ట్రంలో మొదలయిన ఆందోళనలకు ఇప్పుడు తాజాగా రాయల తెలంగాణాకు వ్యతిరేఖంగా తెరాస మొదలుపెట్టిన ఆందోళనలు కూడా తోడవడంతో రాష్ట్రంలో పరిస్థితులు మళ్ళీ మొదటికి వచ్చాయి.
ఇక జగన్మోహన్ రెడ్డి పనిగట్టుకొని దేశమంతా తిరుగుతూ అన్ని రాజకీయ పార్టీలను కలిసి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేఖంగా చేస్తున్న ప్రచారంతో యావత్ దేశం దృష్టి రాష్ట్ర రాజకీయాలు, విభజన అంశాలపై పడింది. దీనివల్ల కాంగ్రెస్ పార్టీకి పార్లమెంటులో కూడా వ్యతిరేఖత తప్పకపోవచ్చును.
ఇవి చాలవన్నట్లు వివిద మీడియా సంస్థలు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై జరిపిన సర్వేలలో బీజేపీ నాలుగు రాష్ట్రాలలో విజయం సాధించే అవకాశాలున్నట్లు నిన్ననే ప్రకటించాయి. అంతే గాక 2014 ఎన్నికలలో కూడా బీజేపీయే విజయం సాదించే అవకాశాలున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఈ సర్వే నివేదికలను చూసి ఉప్పొంగిపోతున్న బీజేపీ నేటి నుండి మొదలవనున్నపార్లమెంటు శీతాకాల సమావేశాలలో కాంగ్రెస్ పార్టీపై తీవ్రంగా దాడిచేయవచ్చును.
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలోనే కాకుండా కేంద్రంలో కూడా వ్యతిరేఖ వాతావరణం కనిపిస్తోంది. ఈ గడ్డు పరిస్థితుల నుండి కాంగ్రెస్ ఏవిధంగా బయటపడుతుంది? అసలు బయటపడగలదా లేదా? అనే సంగతి త్వరలోనే తేలిపోతుంది.