తెదేపా-బీజేపీల మధ్య పొత్తుల కమలం వికసిస్తుందా
posted on Dec 6, 2013 @ 11:34AM
మరొక నాలుగయిదు నెలల్లో ఎన్నికలు ముంచుకొస్తున్నపటికీ, రాష్ట్ర విభజన కారణంగా సీమాంధ్రలో రాజకీయ పార్టీలు వాటి కోసం కసరత్తు మొదలు పెట్టలేకపోతున్నాయి. దానిపై దృష్టి సారిస్తే, తమ రాజకీయ ప్రత్యర్ధులు సమైక్యాంధ్ర సెంటిమెంటుతో ముందుకు దూసుకుపోతారనే భయమే వాటిని నిలువరిస్తోంది. అయితే కనీసం మరో నెల రెండు నెలలు కాలం పాటు సాగే ఈ ప్రక్రియ పూర్తయ్యేవరకు ఎదురుచూస్తూ కూర్చొంటే చేతులు కాలాక ఆకులు పట్టుకొన్నట్లే అవుతుందని గ్రహించిన తెదేపా ఇతర పార్టీలతో పొత్తులు, అభ్యర్ధుల పేర్లు ఖరారు చేసే ప్రక్రియ సమాంతరంగా మొదలుపెట్టినట్లు సమాచారం.
బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీ తెదేపాతో సానుకూల సంకేతాల ఇచ్చిన తరువాత ఆ పార్టీతో తెరవెనుక చర్చలు జరుగుతున్నాయి. తెదేపాతో పొత్తులకు ఇష్టపడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, నాగం జనార్ధన్ రెడ్డి ఈసంగతి గ్రహించినందునే పదేపదే వ్యతిరేఖిస్తూ మాట్లాడుతున్నారు.
వారి అభ్యంతరాల కారణంగా బీజేపీ, తెదేపాలు తమ పొత్తులను కేవలం సీమాంధ్రకే పరిమితం చేసుకొంటాయా లేక తెలంగాణాలో కూడా కొనసాగిస్తాయా? అనే సంగతి కాంగ్రెస్-తెరాసల మధ్య ఏర్పడే బంధం బట్టి నిర్ణయం అవుతుంది. ఒకవేళ తెరాస, కాంగ్రెస్ పార్టీతో పొత్తులు పెట్టుకోకపోతే బీజేపీ తెదేపా కంటే తెరాసతో పొత్తులకే ప్రాధాన్యం ఈయవచ్చును. వచ్చే ఎన్నికల తరువాత బీజేపీ గెలుపు తధ్యమని వెలువడుతున్న సర్వేనివేదికల నేపధ్యంలో తెరాస కూడా బీజేపీతో పొత్తులకి మొగ్గు చూపినట్లయితే, తెలంగాణాలో తెదేపా ఒంటరి పోరాటం చేయక తప్పదు.
ఇక వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు సిద్దమని చూచాయగా ప్రకటించినప్పటికీ, ఒక కులం, మతానికే ఎక్కువ ప్రాధాన్యమిచ్చే వైకాపాతో పొత్తులకి బీజేపీ అంగీకరించే అవకాశం లేదు. అయితే ఎన్నికల అనంతరం అవసరమయితే వైకాపా మద్దతు స్వీకరించ వచ్చును. అందువల్ల సీమాంధ్రలో తెదేపా-బీజేపీల మధ్య ఎన్నికల పొత్తులకి ఎటువంటి అభ్యంతరమూ, ఇబ్బంది కూడా ఉండదు.
గతంలో ఎన్డీయే కూటమిలో ప్రధాన పాత్ర వహించిన చంద్రబాబు నాయుడుకి మళ్ళీ ఎన్డీయే సారధ్య భాద్యతలు అప్పగించే అవకాశం కూడా ఉంది. జాతీయ స్థాయిలో పనిచేసిన అనుభవం ఉన్న ఆయన సేవలు ఉపయోగించుకోవడం ద్వారా మళ్ళీ జేడీ(యూ) వంటి పార్టీలను కూడా ఎన్డీయే కూటమిలోకి తిరిగి రప్పించే వీలు కలుగుతుంది.
బీజేపీతో జతకడితే తన ముస్లిం ఓటు బ్యాంకు దూరమవుతుందని తెదేపా తొలుత కొంత బయపడినా, దేశ్యవ్యాప్తంగా క్రమంగా మోడీకి పెరుగుతున్న అన్నివర్గాల ఆదరణ చూసిన తరువాత బీజేపీతో పొత్తులు తన ముస్లిం వోటు బ్యాంకుపై పెద్దగా ప్రభావం చూపవని తెదేపా భావించడంతో రెండు పార్టీల మధ్య తెరవెనుక చర్చలు ఊపందుకొన్నాయి. ఈనెల 8న ఐదు రాష్ట్రాల ఫలితాలు వెలువడిన తరువాత ఏ క్షణంలోనయినా బీజేపీ-తెదేపాలు బహిరంగంగానే ఎన్నికల పొత్తుల గురించి ప్రకటన చేయవచ్చును.
రాష్ట్ర విభజన కారణంగా లెఫ్ట్ పార్టీలలో కూడా చీలిక రావడంతో ఈసారి సీపీయం పార్టీ మాత్రమే తెదేపాతో రెండు ప్రాంతాలలో పొత్తులకు సిద్దపడవచ్చును. అయితే సీపీఐ కూడా సీమాంధ్రలో మాత్రమే తెదేపాతో పొత్తులకి అంగీకరించవచ్చును. అయినప్పటికీ తెదేపా అందుకు అభ్యంతరం వ్యక్తం చేయకపోవచ్చును.
ఈసారి సమైక్యవాదం సెంటిమెంటుతో ఎన్నికలలో లబ్దిపొందాలని యోచిస్తున్న వైకాపాను డ్డీకొనేందుకు ఈవిధంగా పొత్తులు కుదుర్చుకొనగలిగితే అవి తేదేపాకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.