అంటరాని బీజేపీతో అంటుకట్టేందుకు సై
posted on Nov 26, 2013 @ 11:08AM
ఇంతవరకు మన దేశంలో దాదాపు అన్ని రాజకీయపార్టీలు బీజేపీని అంటరాని పార్టీగా చూసేవి. కారణం బీజేపీ మతతత్వ పార్టీ అని భావించే ఆయా పార్టీల కుహనా లౌకికవాదమే.
బీజేపీతో చేతులు కలపాలని అనేక పార్టీలకు ఆసక్తి ఉన్నపటికీ, తమ ముస్లిం వోటు బ్యాంకులో లాభనష్టాలు లెక్కలు సరిచూసుకొని, తదనుగుణంగానే ఆ పార్టీతో చేతులు కలపాలా? వద్దా? అనేది నిర్ణయించుకొంటాయి తప్ప, అవి చెపుతున్న మతతత్వపార్టీ కారణం కానే కాదు. తమకున్న ముస్లిం ఓటు బ్యాంకుతో పోలిస్తే, బీజేపీతో చేతులు కలపడం వలనే తమకు ఎక్కువ లాభం కలుగుతుందని అవి భావిస్తే, అప్పుడు వాటికి ఆ మతతత్వ ముద్ర అడ్డు రాదు.
ఒకవేళ వాజపేయి వంటి నిజమయిన లౌకికవాది నేడు ఆ పార్టీకి సారధ్యం వహిస్తూ ఉండి ఉంటే, బహుశః ఈ చర్చ అవసరం కూడా ఉండేది కాదేమో! కానీ నూటికి నూరు శాతం హిందూవాది అయిన నరేంద్ర మోడీ పార్టీ పగ్గాలు చెప్పటడం వలనే పార్టీలలో కొంత అయోమయం నెలకొని ఉంది. అయితే ఆయన నాయకత్వంలో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రావచ్చుననే సర్వే నివేదికలు చూసిన తరువాత రాజకీయ పార్టీల ఆలోచనా ధోరణిలో కూడా కొంత మార్పు కనబడుతోంది.
ప్రస్తుతం ఐదు రాష్ట్రాలలో జరుగుతున్న ఎన్నికలలో బీజేపీ గనుక విజయం సాధిస్తే దేశ వ్యాప్తంగా అనేక రాజకీయ పార్టీలు బీజేపీ వైపు ఆకర్షించబడినా ఆశ్చర్యం లేదు.
ఇక మన రాష్ట్రానికి సంబంధించినంత వరకు చూసుకొంటే, ప్రస్తుతం తెదేపా, తెరాస, వైకాపా ఆ పార్టీతో దోస్తీకి సై అంటున్నాయి. పార్లమెంటులో తన రాజకీయ ప్రత్యర్ధి ప్రవేశపెట్టే తెలంగాణా బిల్లుకి బీజేపీ మద్దతు ఇస్తుందా? లేదా? అనే అంశంపై ఆ దోస్తీలు పెరిగే, తరిగే అవకాశాలున్నాయి.
ఒకవేళ కాంగ్రెస్ గనుక తెలంగాణా బిల్లుని పార్లమెంటులో ఆమోదింప జేయలేక చేతులెత్తేస్తే, రానున్నఎన్నికల కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో కూడా పూర్తిగా తుడిచిపెట్టుకు పోవడం ఖాయం. గనుక, అప్పుడు తెరాస బీజేపీకి మద్దతు ఇచ్చి తెలంగాణా సాధించుకొనే ప్రయత్నం చేయవచ్చును. అయితే బీజేపీ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు అంగీకరిస్తేనే వైకాపా మద్దతు ఇస్తానని షరతు పెట్టవచ్చును. కేంద్రంలో అధికారం చెప్పట్టాలంటే బీజేపీకి రాష్ట్రంలో అన్ని పార్టీల మద్దతు అత్యవసరమే గనుక, అందరికీ ఆమోదయోగ్యంగా రాష్ట్ర విభజన చేస్తానని హామీ ఇచ్చి మద్దతు కోరే అవకాశం ఉంది. ఈవిధంగా బీజేపీ రాష్ట్రంలో అన్ని పార్టీల మద్దతు పొందవచ్చని కాగితాల మీద ఎన్ని లెక్కలు వేసుకొన్నపటికీ, రెండు కత్తుల వంటి తెదేపా, వైకాపా ఒకే ఒరలాంటి ఎన్డీయే కూటమిలో ఇముడుతాయా? లేదా? అనే విషయం అప్పటి పరిస్థితులు, రాజకీయ సమీకరణాలను బట్టి తేలుతుంది.
ఏమయినప్పటికీ, డిశంబర్ 8న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత రాష్ట్రంలో బీజేపీతో ఏ పార్టీలు పొత్తులకి, మద్దతుకి ఆసక్తి చూపుతాయో క్రమంగా స్పష్టమయ్యే అవకాశం ఉంది. దానిని బట్టే పార్టీలు రాష్ట్రంలో సీట్ల సర్దుబాట్లు చేసుకోవలసి ఉంటుంది గనుక వీలయినంత త్వరగానే చర్చలు మొదలు కావచ్చును.