తెలంగాణా ఏర్పాటుతో భద్రతా సంస్థలకు పెను సవాలు
posted on Nov 21, 2013 @ 9:09PM
తెలంగాణా ఏర్పడితే అక్కడ నక్సల్స్ మరియు ఉగ్రవాద సమస్యలు పెరిగిపోతాయని ముఖ్యమంత్రితో సహా చాలా మంది హెచ్చరిస్తునప్పటికీ అవన్నీతెలంగాణాను అడ్డుకొనేందుకు చెపుతున్నభూటకపు కబుర్లని టీ-కాంగ్రెస్, తెరాస నేతలు ఎదురుదాడి చేస్తున్నారు. సాక్షాత్ హోం మంత్రి షిండే “తెలంగాణా ఏర్పడితే నక్సల్స్ సమస్య ఉండదు” అని భరోసా ఈయలేక “నక్సల్స్ సమస్య పెరుగుతుందని మేము భావించడం లేదు” అని అనడం చూస్తే ఆ సమస్య తీవ్రతను ఆయన కూడా అంగీకరించినట్లు అర్ధం అవుతోంది.
తమిళనాడు పోలీసు అధికారి విజయ్ కుమార్ నేతృత్వంలో కేంద్రం నియమించిన టాస్క్ ఫోర్స్ కూడా ఇంచుమించు ఇదేవిధమయిన అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే కాంగ్రెస్ అధిష్టానం తన రాజకీయ ప్రయోజనాలను మాత్రమే దృష్టిలో ఉంచుకొని మొండిగా ముందుకు సాగిపోతోంది.
ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ అధీనంలో పనిచేసే మరో ఉన్నత నిఘా సంస్థ అయిన కేంద్ర ఇంటలిజన్స్ బ్యూరో అధిపతి ఆసిఫ్ ఇబ్రహీం నిన్నడిల్లీలో జరిగిన అఖిలభారత పోలీసు అధికారుల సమావేశంలో వివిధ రాష్ట్రాల నుండి వచ్చి పాల్గొన్న రాష్ట్ర పోలీసు డీఐజీ మరియు ఇనస్పెక్టర్ జనరల్స్ ని ఉద్దేశించి మాట్లాడుతూ, “తెలంగాణా ఏర్పాటు కేవలం ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికే పరిమితమయిన సమస్య కాదు. రాష్ట్ర విభజన తరువాత రాష్ట్రంలో, దేశంలో అన్ని భద్రతా వ్యవస్థలకు ఇదొక సరికొత్త సవాళ్ళను విసరబోతోంది,”అని అన్నారు.
రాష్ట్ర రాజకీయాలతో కానీ, పార్టీలతో గాని ఎటువంటి సంబంధమూ లేని దేశంలో ఒక అత్యున్నత నిఘావ్యవస్థ అధిపతి ఈవిధంగా రాష్ట్ర విభజన వలన ఏర్పడే దుష్పరిణామాలు గురించి ఆందోళన వ్యక్తం చేయడం చూస్తే సామాన్య ప్రజలకు ఊహలకు అందనంత తీవ్ర సమస్యలు దీనిలో ఇమిడి ఉన్నాయని అర్ధం అవుతోంది.
కానీ, రాష్ట్రంలో, దేశంలో రాజకీయ నేతలు, కొన్ని పార్టీలు తమ వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాలకోసమే ఇంత రిస్క్ తీసుకొంటున్నట్లు అర్ధం అవుతోంది. హైదరాబాద్ మరో పదేళ్ళవరకు ఉమ్మడి రాజధానిగా ఉండబోతున్న కారణంగా అక్కడ ఒక రాజకీయ సందిగ్ధ వాతావరణం నెలకొని ఉంటుంది. దానిని ఆసరాగా తీసుకొని సంఘ వ్యతిరేఖ శక్తులు, నక్సల్స్, ఉగ్రవాదులు చాప క్రింద నీరులా విస్తరించే ప్రమాదం ఉంది. కనుక ఈ విషయంలో మరింత అప్రమత్తత అవసరం. దేశంలో ఎక్కడ ఉగ్రవాదుల దాడులు జరిగినా దాని మూలాలు హైదరాబాద్ లోనే బయటపడుతుండటం వలన నగరానికి ప్రత్యేకమయిన అదనపు భద్రత వ్యవస్థ ఏర్పాటు కూడా అవసరమే.
తెలంగాణా ప్రజల ఆకాంక్షను నెరవేర్చడం అవసరమే. కానీ ఏర్పాటు చేసే ముందు అందుకు తగిన విధంగా భద్రతాపరంగా అన్ని జాగ్రత్తలు తీసుకోకుండా రాజకీయ ప్రయోజనాల కోసం తొందరపాటు చూపడాన్ని మాత్రం ఖండించవలసిందే. ఇదే పనిని రానున్న ఎన్నికల తరువాత చేప్పట్టి ఉండి ఉంటే మరింత పటిష్టంగా తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు చేయగలిగే అవకాశం ఉండేది. కానీ ప్రజల భావోద్వేగాలని సొమ్ము చేసుకోవాలని చూస్తున్న రాజకీయ పార్టీలు, నేతలు ఇదే సరయిన సమయమని తొందరపాటు ప్రదర్శించడమే అనర్ధాలకు దారి తీసే ప్రమాదం ఉంది.
ఇంటలిజన్స్ బ్యూరో అధిపతి ఆసిఫ్ ఇబ్రహీం వ్యక్తం చేసిన ఆందోళనను రాజకీయాలకు, ప్రాంతీయ విద్వేషాలకు అతీతంగా చూడవలసి ఉంది, ఇది తెలంగాణా ఏర్పాటుకి వ్యతిరేఖమనో లేక సమైక్యవాదుల వాదనలకు ఉపయోగపడే కొత్త అస్త్రంగానో భావించరాదు.