ఒక హైటెక్ విషాద కధ
posted on Nov 24, 2013 @ 2:09PM
సంపదను సృష్టించడం ఎంత కష్టమో దానిని నిలుపుకోవడం, అభివృద్ధి చేయడం కూడా అంతే కష్టం.
చంద్రబాబు హయంలో ఏర్పాటు చేసిన హైటెక్ సిటీ మొన్ననే 15ఏళ్ళు పూర్తి చేసుకొంది. ఆయన వ్యక్తిగత శ్రద్ద కృషి, పట్టుదల వలన ఏర్పడిన ఈ హైటెక్ సిటీ నేడు రాష్ట్ర ప్రధాన ఆదాయవనరని వేరే చెప్పనవసరం లేదు. ఆ బంగారు బాతు కోసం ఆంధ్ర, తెలంగాణావాదులు నేడు చేస్తున్న పోరాటం గమనిస్తే దాని ప్రాముఖ్యత అర్ధం అవుతోంది. అయితే దానికోసం కీచులాడుకొంటున్నవారికి అక్షయపాత్ర వంటి ఈ అపార సంపదను సృష్టించిన చంద్రబాబుని, అతని ప్రభుత్వాన్ని మెచ్చుకోవడానికి రాజకీయాలు అడ్డువస్తున్నాఅది ఖచ్చితంగా ఆయన గొప్పదనమేనని వారికీ తెలుసు.
చంద్రబాబు కృషి ఫలితంగా ఏర్పాటయిన ఈ హైటెక్ సిటీ వల్ల రాష్ట్రానికి జరుగుతున్న మేలు కంటికెదురుగా స్పష్టంగా కనబడుతున్నపటికీ, తొమ్మిదేళ్లుగా రాష్ట్రాన్నిపాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం దానిని పూర్తిగా నిర్లక్ష్యం వహింది.
మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి ఈ ఐటీ రంగాన్ని విశాఖకు విస్తరించే ప్రయత్నం చేసినప్పటికీ, ఆయన ఆకస్మిక మరణంతో అవన్నీ గాలి మేడలయ్యాయి. ఆ తరువాత వచ్చిన ముఖ్యమంత్రులెవరూ కూడా ఈ ఐటీ రంగం పట్ల పెద్దగా శ్రద్ద కనబరచకపోవడం వలన, ఐటీ రంగం ఎటువంటి అభివృద్దికి నోచుకోకుండా పోయింది. దానికి తోడూ గత రెండు మూడేళ్ళుగా తెలంగాణాలో జరుగుతున్న సమ్మెలు ‘హైదరాబాద్ బ్రాండ్’ విలువను ఘోరంగా దెబ్బతీసాయి.
ఆ దెబ్బకి కొత్త కంపెనీలు ఏవీ కూడా రాష్ట్రం వైపు కన్నెతి చూడలేదు. వచ్చినవాటిని వ్రేళ్ళ మీద లెక్కించవచ్చును. రాష్ట్రంలో నెలకొన్న అశాంతి, అరాచకం, ప్రభుత్వ అసమర్దత, నిర్లక్ష్యం వెరసి, ఇరుగుపొరుగు రాష్ట్రాలకు ఐటీ రంగం తరలించుకుపోయెందుకు గొప్ప సదావకాశాన్ని కల్పించాయి. అయితే అందుకు మన నేతలు కానీ, ప్రభుత్వం గానీ కించిత్ చించలేదు. పరిస్థితిని చక్కదిద్దుదామని ప్రయత్నం చేసింది లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి మొదలు గల్లీలో కార్పొరేటర్ వరకు అందరికీ రాష్ట్ర విభజన ధ్యాసే తప్పమరొకటి లేకపోవడమే.
ఈ పరిస్థితులు ఇలాగుంటే, హైదరాబాదులో హైటెక్ సిటీ ఏర్పడిన తరువాత నగరం ఐటీ కేంద్రంగా ఎదిగి ఐటీ రంగంలో ఉద్యోగావకాశాలు పెరగడంతో, జీవితంలో త్వరగా స్థిరపడవచ్చనే ఆశతో యువత ఐటీ సంబంధిత ఇంజనీరింగ్ కోర్సులలో చేరేందుకు ఆసక్తి చూపడంతో, వారి బలహీనతను సొమ్ము చేసుకొనే ప్రయత్నంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ కాలేజీలు పుట్టగొడుగుల్లా వీధికొకటి, ఊరుకి వంద చొపున వెలిసి , గత ఐదు-పదేళ్ళలో లక్షలాది ఇంజనీరింగ్ విద్యార్ధులను తయారు చేసి రోడ్ల మీదకు వదిలేయి.
అయితే అందుకు తగ్గట్టుగా రాష్ట్రంలో ఐటీ రంగం అభివృద్ధి జరగకపోవడంతో వారందరూ నిరుద్యోగులుగా మిగిలిపోయారు. దానితో యువతలో అశాంతి పెరిగి సామాజిక సమస్యలు కూడా క్రమంగా పెరగసాగాయి. ఉన్నదంతా ఊడ్చిపెట్టి లక్షలు పోసి ఇంజనీరింగ్ చేయించినా కూడా పిల్లలకు ఉద్యోగాలు దొరకకపోవడంతో, అనేక మధ్యతరగతి కుటుంబాలు ఆర్ధిక సమస్యలతో చిన్నాభిన్నం అవుతున్నాయి. విద్యార్దులు లేక ఇంజనీరింగ్ కాలీజీలు ఒకటొకటిగా మూతపడటం ఆరంభం అయ్యింది.
ఐటీ రంగాన్నిఅభివృద్ధి చేయాలనే చిత్తశుద్ది, పట్టుదల ప్రభుత్వానికి ఉంటే దాని ఫలితాలు ఎంత అద్భుతంగా ఉంటాయో చంద్రబాబు చూపిస్తే, అశ్రద్ద వహిస్తే ఎటువంటి దుష్పరిణామాలు ఏర్పడుతాయో కాంగ్రెస్ ప్రభుత్వం మన కళ్ళకు కట్టినట్లు చూపుతోందిప్పుడు.
కనీసం రానున్న ఎన్నికలలోనయినా ప్రజలు “పనిచేసే ప్రభుత్వాలను” ఏర్పరుచుకొంటే ఈ పరిస్థితుల్లో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. లేకుంటే ఇటువంటి వ్యాసాలే మరిన్ని చదువుకోక తప్పదు.