సడలిన "ఉక్కు" సంకల్పం
posted on Jul 27, 2016 @ 12:23PM
16 ఏళ్లు పచ్చి మంచి నీళ్లు తాగలేదు..అమ్మను చూడలేదు..ఇంటిముఖం తెలియదు...డాక్టర్ అవ్వాలనుకుంది..ఉక్కు మహిళగా మారింది, ఆమె ఎవరో ఈపాటికే మీకు అర్థమై ఉంటుంది. ఆవిడే ఇరోమ్ షర్మిల. మణిపూర్‌లో సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని రద్దు చేయాలంటూ 16 ఏళ్లు పాటు చేసిన దీక్షకు ముగింపు పలకాలని ఆమె నిర్ణయించుకున్నారు. ఆగస్టు 9న తన దీక్షను విరమిస్తున్నట్టు ప్రకటించారు. ఆత్మహత్యాయత్నం ఆరోపణలపై ఇంఫాల్ కోర్టులో విచారణకు హాజరైన షర్మిల..నిరాహారదీక్ష వల్ల సాధించేది లేదని భావిస్తున్నందున వివాదాస్పద ఏఎఫ్ఎస్‌సీఏ చట్టం రద్దుకోసం త్వరలోనే రాజకీయాల్లోకి చేరనున్నట్టు ప్రకటించారు.
కల్లోల ప్రాంతాలుగా ఉన్న అరుణాచల్‌ప్రదేశ్, అసోం, మణిపూర్, మేఘాలయా, మిజోరం, నాగాలాండ్, త్రిపురలలో పరిస్థితుల్ని అదుపు చేయడం కోసం సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని భారత పార్లమెంట్ 1958 సెప్టెంబర్ 11న ఆమోదించింది. ఆ తర్వాత ఈ చట్టాన్ని జమ్మూకాశ్మీర్‌కు కూడా వర్తింపజేస్తూ సాయుధ దళాల(జమ్మూకశ్మీర్) ప్రత్యేకాధికారాల చట్టం..1990 అమల్లోకి వచ్చింది. ఈ చట్టం భారత సాయుధ దళాలకు విస్తృతాధికారాలను కల్పించింది. కనిపిస్తే కాల్చివేతకు, ఏ సాకుతోనైనా, ఎవరినైనా అరెస్ట్ చేసేందుకు, ఎటువంటి వారెంట్ లేకుండానే సోదాలు నిర్వహించే అవకాశం సైన్యానికి దక్కింది. అయితే ఈ అధికారాన్ని సైన్యం దుర్వినియోగం చేస్తున్నట్టు ఎప్పటి నుంచో ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారం మాటున సైన్యం మానభంగాలు, చిత్రహింసలు, పౌరుల్ని విచక్షణారహితంగా కాల్చివేయడం లాంటి చర్యలకు పాల్పడింది. ఈ చట్టం ఆసరాతో అక్రమాలకు పాల్పడిన సైనికుల్ని అరెస్ట్ చేయడం గాని, ఎటువంటి విచారణకైనా గురిచేయడానికి కాని అవకాశం లేదు.
ఈ నేపథ్యంలో 2000 నవంబర్‌లో మణిపూర్ రాజధాని ఇంఫాల్‌కు సమీపంలోని మాలమ్‌లో బస్టాప్‌లో నిలబడిన 10 మందిని అస్సామ్ రైఫిల్స్ దారుణంగా కాల్చిచంపింది. మృతుల్లో 62 ఏళ్ల మహిళతో పాటు..సినామ్ చంద్రమణి అనే జాతీయ సాహస బాలల అవార్డు అందుకున్న యువతి కూడా ఉంది. ఈ ఘటన షర్మిల జీవితాన్ని మలుపు తిప్పింది. కనీస విచారణ లేకుండా సైన్యం అంతటి దారుణానికి పాల్పడటంపై తీవ్రంగా చలించిన షర్మిల..ఇందుకు కారణమైన సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని రద్దు చేయాలంటూ దీక్ష ప్రారంభించారు. ఆహారాన్ని తీసుకోకపోవటం మాత్రమే కాదు..ఈ చట్టాన్ని రద్దు చేసేంతవరకు అద్దంలో మొహం కూడా చూసుకోనని, జుట్టును కూడా ముడివేయనని, చివరికి తన తల్లిని కూడా చూడనని తనకు తాను కట్టుబాట్లు విధించుకున్నారు.
అలా ఒకరోజు, రెండు రోజులు కాదు ఏకంగా 16 సంవత్సరాల పాటు అన్నపానీయాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో ఆమెను ఇంఫాల్‌లోని జేఎన్ ఆసుపత్రిలో ఉంచి ముక్కులోపలి నుంచి గొట్టాల ద్వారా ద్రవాహారం అందిస్తున్నారు. అప్పటి నుంచి ఆసుపత్రినే జైలుగా మార్చి అందులోనే షర్మిలనునిర్భందించారు. 16 ఏళ్ల ఈ నిరసన కాలంలో ఆమె ఇంతవరకు తన ఇంటికి వెళ్లనప్పటికీ ఒక్కసారి మాత్రం యాదృచ్ఛికంగా తన తల్లిని కలిశారు. 2009లో ఆమె తల్లి సఖీదేవిని అనారోగ్య కారణాలతో షర్మిల ఉన్న ఆసుపత్రిలోనే చేర్చడంతో తల్లీకూతుళ్లు ఒకరినొకరు చూసుకున్నారు. అంతే తప్ప తనకు తానుగా తల్లిని చూడకపోవడం షర్మిల మొండిపట్టుదలకు నిదర్శనం.
2004లో 30 మంది షర్మిల మద్ధతుదారులు ఢీల్లిలోని అస్సాం రైఫిల్స్ ప్రధాన కార్యాలయం వద్ద నగ్నంగా నిరసన చేశారు. దీంతో ఈ విషయం అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాల చెవిన పడింది. అనేక మంది నోబెల్ బహుమతి అవార్డు గ్రహీతలు, అమ్మెస్టీ ఇంటర్నేషనల్, అన్నాహజారే వంటి సామాజిక వేత్తలు షర్మిల దీక్షకు మద్ధతు పలికారు. అయినా ప్రత్యేకాధికారాల చట్టాన్ని రద్దు చేయించలేకపోయారు. రోజులు గడుస్తున్నా..ప్రభుత్వ వైఖరిలో ఏ మార్పు లేకపోవడం, ప్రజలు, ప్రజాసంఘాల మద్ధతు కరువువ్వడంతో తన దీక్షను విరమించి రాజకీయ పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు షర్మిల.
దీనిలో భాగంగా 2017లో జరిగే మణిపూర్ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తానని..వివాహం చేసుకుంటానని ఆమె ప్రకటించారు. ఇరోమ్‌ను రాజకీయాల్లోకి రావాల్సిందిగా 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలోనే తృణమూల్ కాంగ్రెస్, సీపీఎంలు కోరాయి. ఈ ప్రతిపాదనను ఆమె నిరాకరించారు. 28 సంవత్సరాల వయసున్నపుడు దీక్ష ప్రారంభించిన షర్మిలకు ఇప్పుడు 44 సంవత్సరాలు. బహుశా వయసు మీద పడుతుండటం, మునుపటి శక్తి లేకపోవడం కూడా ఆమె దీక్ష విరమణకు కారణం కావచ్చు. ఏది ఏమైనా ప్రపంచంలోనే అత్యంత సుధీర్ఘకాలం పాటు నిరాహార దీక్ష చేసి ఇప్పుడు ఉన్నపళంగా దీక్ష విరమణ చేయడం కుటుంబీకులు, పోరాట సహచరులు సహా యావత్ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది.