ఒక్క ఎన్‌కౌంటర్..వంద ప్రశ్నలు
posted on Aug 10, 2016 @ 10:43AM
వెయ్యి ప్రాణుల్ని వేట్నో మెక్కిన శాల్తీ ఒకటి... ఒక్క గాలివానకు తుడిచి పెట్టుకుపోయిందట! నయీమ్ ఎన్ కౌంటర్ ఇదే సామెత నిజం చేసింది! ఏళ్లుగా , దశాబ్దాలుగా నయీమ్ పేరు వినటమే తప్ప నిజంగా అతను ఎవరు, ఏంటని పెద్దగా ప్రచారం జరగలేదు. అయితే, అతనో గ్యాంగస్టర్ అని, సెటిల్మెంట్లు చేస్తుంటాడని అందరికీ తెలుసు. కాని, నయీమ్ హఠాత్తుగా ఆగస్ట్ ఎనిమిదన పోలీసుల చేతుల్లో ఎన్‌కౌంటర్ కావటంతో తీగలు మెల్లమెల్లగా లాగబడుతున్నాయి. డొంక కూడా అదే స్థాయిలో ఆశ్చర్యకరంగా కదులుతోంది! నయీమ్ ది నల్గొండ జిల్లా. విద్యార్థిగా వున్నప్పుడే జేబులో పాముల్ని, తేళ్లని వేసుకుని వచ్చి తోటి పిల్లల్ని గడగడలాడించే వాడట! ఆ బుద్దీ ఎన్‌కౌంటరై టపా కట్టేదాకా ఆయనకి పోలేదు. కాకపోతే ఏజ్ పెరిగిన కొద్దీ నయీమ్ భయపెట్టే వాళ్ల స్థాయి కూడా మారుతూ వచ్చింది. ఆయన ఫోన్ నుంచి కాల్ వస్తే చెమటలతో తడిసేపోయే వారి రేంజ్ మామూలు బిజినెస్‌మెన్ మొదలు ఐపీఎస్, పొలిటీషన్స్ వరకూ వుండేది.
అసలు నయీమ్ క్రిమినల్ సత్తా మనకు సరిగ్గా తెలియాలంటే ఒక్క విషయం చాలు! ఆయన వద్దకు పోయి పెద్ద పెద్ద ఐపీఎస్‌లే తమకు పోస్టింగ్ లు ఎక్కడ కావాలో అక్కడ వేయించుకునే వారట! ప్రభుత్వంలో మనోడి అక్రమ ప్రమేయం ఆ రేంజ్లో వుండేది! అయితే, ఇలాంటివి పక్కాగా ఎవరికీ తెలియకపోయినా నయీమ్ గురించిన అనేక షాకింగ్ విషయాల్లాగే ఈ పోస్టింగ్ ల విషయం కూడా ప్రచారంలో వుంది. నయీమ్ పోస్టింగ్‌లు చేయించటం లాంటి విషయాలు పక్కన పెడితే అతని వ్యవహారం మాత్రం హై రేంజ్ అనేది క్లియర్. వందల కోట్ల సెటిల్మెంట్లు నయీమ్‌కి నిత్యకృత్యం. ఆ క్రమంలో దమ్కీలు, మర్డర్లు ఎక్సెట్రా ఎక్సెట్రా అన్నీ కూడా మామూలే. దావూద్ మొదలు సోహ్రాబుద్దీన్ వరకూ , ఇప్పుడు నయీమ్ దాకా అందరు క్రిమినల్స్ టాప్ క్రిమినల్స్ బయోడేటా ఇలాగే వుంటుంది. కాని, నయీమ్ విషయం లో మాత్రం ఒక్క ప్రత్యేకత మనల్ని ఆశ్చర్యపరుస్తుంది...
నయీమ్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. కాని, పోలీసులకి ఎన్నో రోజులుగా దొరక్కుండా తిరుగుతున్నాడని ప్రచారం జరుగుతోన్న నయీమ్ ఎన్ కౌంటర్ కాగానే కొందరు లోకల్ జర్నలిస్టులతో సహా చాలా మందినే అదపులోకి తీసుకుని విచారించి వదిలిపెడుతున్నారు. పోలీసులు అనుమానంతో అరెస్ట్ చేసిన వారంతా నయీమ్ మనుషులే అవ్వాల్సిన పని లేకున్నా అతడితో చాలా మందే టచ్ లో వుంటూ వచ్చారన్నది మాత్రం క్లియర్. అసలు బయట నడుస్తున్న అనధికారిక ప్రచారం నయీమ్‌ను చాలా సార్లు పోలీసులు , పొలీటీషన్స్ కూడా వాడుకున్నారట. తాము నేరుగా హ్యాండిల్ చేయటం కుదరని సెటిల్మెంట్లు వంటివి నయీమ్ చేత చేయించి తిలా పాపం తల పిడికెడు పిడికెడు పిడికెడు... అన్నట్టు అందరూ పంచుకునే వారట! రాజకీయ నేతలు, పోలీసు అధికారులతో వున్న ఈ లింక్ వల్లే నయీమ్ ఇంత కాలం మహారాజాలా లైఫ్ గడిపాడు. లేకపోతే వందల కోట్ల సెటిల్మెంట్లు చేస్తూ పెద్ద తలనొప్పిగా మారిన ఒక క్రిమినల్ ఇంత కాలం ఎన్‌కౌంటర్ అవ్వకపోవటం, అది అతను దావూద్‌లా ఏ విదేశానికీ పారిపోకుండా ఇక్కడే వున్నా కూడా అంటే... వ్యవస్థలోనే నయీమ్ అభివృద్ధి, చావు రెండూ వున్నాయని అర్థం!
నయీమ్ హతం కావటంలో మరో కోణం కూడా వుంది. అతను పోయాక పోలీసులు చెబుతున్న దాని ప్రకారం లభించింది కేవలం కొన్ని గన్నులు, బుల్లెట్లు, కొన్ని కోట్ల నగదు మాత్రమే! తన జీవితమంతా ప్రాణాలకు తెగించి పెద్ద పెద్ద సెటిల్మెంట్లు చేసిన నయీమ్ ఇంతే వెనుకేసుకున్నాడా అంటే... కాదని చెప్పటానికి పెద్ద తెలివితేటలు అక్కర్లేదు. మరి నయీమ్ వందల కోట్ల ఆస్తులు, నగదు, ఇతర విలువైన వస్తువులు ఇప్పుడు ఏమైనట్టు? ఖచ్చితంగా ఇటు నుంచి ఇటు పోయాయని ఎవ్వరం చెప్పలేం! సాధ్యమైనంత ఎక్కువ ప్రభుత్వ ఖజానాకు చేరి ప్రజల శ్రేయస్సుకు ఉపయోగపడాలని కోరుకుందాం. కాని, అదీ మనమిప్పుడున్న వ్యవస్థలో దురాశే! ఎందుకంటే, ఇప్పుడంతా అందరి పరిస్థితి , నీతి... చీకట్లో దాక్కున్న తేలు కుట్టిన తోడు దొంగల మౌనం లాంటిది! ఒక దొంగ సొమ్ము మరో దొంగ పాలో, దొంగలకే దొంగ పాలో అవుతూంటూంది! నయీమ్ రక్తపు సంపదంతా ఏమౌతుందో చూద్దాం...