కాలగర్భంలోకి "యాహూ"
posted on Jul 26, 2016 @ 12:48PM
ఆధునిక సాంకేతిక రంగంలో ఒక దిగ్గజ సంస్థ శకం ముగిసింది. సుమారు రెండు దశాబ్దాల పాటు ఇంటర్నెట్ ప్రపంచాన్ని శాసించిన "యాహూ" వేరొకరి గుప్పిట్లోకి వెళ్లబోతోంది. యాహూ ఇంక్స్ కోర్ ఇంటర్నెట్ బిజినెస్‌లు అమెరికాకే చెందిన ప్రముఖ సంస్థ "వెరిజోన్" చేతికి వెళ్లిపోయాయి. 4.83 బిలియన్ డాలర్లకు (భారత కరెన్సీలో రూ. 32, 491.41కోట్లు) యాహూను కొనుగోలు చేస్తున్నట్లు వెరిజోన్ ప్రకటించింది. ఈ డీల్ మొత్తం నగదు రూపంలో ఉండనుందని తెలిపింది. మొదటి నుంచి గట్టి పోటీదారుడిగా వచ్చిన వెరిజోన్ చివరికి యాహూను కైవసం చేసుకోవడం విశేషం. ప్రపంచంలో తొలి తరం ఇంటర్నెట్ వాడకం దార్లకు తొలి మెయిల్‌గా యాహూనే అయి ఉంది. అంతేకాదు తొలినాళ్లలో ఇంటర్నెట్‌ను పరిచయం చేసింది కూడా యాహూనే. అందుకే ఆ తరం ఈ-మెయిల్ వినియోగదార్లలో ఎక్కువ మంది ఐడీలు యాహూ పేరుతోనే ఉంటాయి.
1994లో స్టాన్‌ఫోర్డ్ విద్యార్థులైన "జెర్రీ యాంగ్", "డేవిడ్ ఫిలో"లు యాహూను స్థాపించగా..1996లో స్టాక్ ఎక్స్జేంజీలో లిస్ట్ అయ్యింది. అలా దశాబ్దకాలం పాటు ఇంటర్నెట్ ప్రపంచాన్ని శాసించింది. 2000 సంవత్సరం నాటికి డాట్.కామ్ బూమ్ వచ్చి, సెర్చ్ ఇంజన్‌కు ఆదరణ పెరగటం మొదలైంది. దీన్ని యాహూ గుర్తించింది. కానీ సొంతంగా సెర్చ్ ఇంజన్‌ను అభివృద్ధి చేసుకోవటానికి బదులు అటువంటి సేవలు అందించే ఇతర సంస్థల వైపు దృష్టి సారించింది. కానీ ఆ తర్వాత శరవేగంగా వచ్చిన సాంకేతిక మార్పులకు, ఎదురైన సవాళ్లకు సన్నద్ధం కాలేకపోయింది. మరో పక్క "మైక్రోసాఫ్ట్", "గూగుల్" వంటి సంస్థలు యాహూకు పోటీనిచ్చాయి. ప్రోడక్ట్స్ రంగంలో మైక్రోసాఫ్ట్ ఆధిపత్యాన్ని సాధిస్తే..సెర్చ్ ఇంజన్‌తో మొదలు పెట్టి సోషల్ నెట్‌వర్కింగ్, వార్తలు, డాక్యుమెంట్లు, డ్రైవ్..తదితర పలు రకాలుగా తన సేవలను గూగుల్ విస్తరించింది.
కేవలం ఇంటర్నెట్ సేవలకే పరిమితమైన యాహూ ఈ సంస్థలతో పోటీపడలేని పరిస్థితిని ఎదుర్కొంది. గత కొన్నేళ్లుగా మళ్లీ పైకి రావటానికి, ప్రజాదరణ పొందటానికి యాహూ విశ్వ ప్రయత్నాలు చేసింది. కానీ అవేవి సత్ఫాలితాలు ఇవ్వలేదు. నాలుగేళ్ల క్రితం ఎంతో ఆశతో సీఈవోగా నియమించిన "మరిస్సా మాయర్" కూడా కంపెనీ క్షీణతను నిలువరించలేకపోవడంతో చివరికి అమ్మకానికి సిద్ధమైంది. అయితే 2008లోనే యాహూను కొనుగోలు చేసేందుకు మైక్రోసాఫ్ట్ ఆసక్తి చూపించింది. అందుకు ప్రతిఫలంగా 44 బిలియన్ డాలర్లను ఇవ్వజూపింది. అంటే డీల్ విలువ 1.76 లక్షల కోట్లు అది కూడా రూపాయి మారకం విలువ రూ 40 ఉన్నపుడు( ఇపుడు డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 67). ఈ ఒప్పందాన్ని అప్పట్లో యాహూ డైరెక్టర్ల బోర్డు తిరస్కరించింది.
ఎన్ని అడ్డంకులు ఎదురైనా నిలబడిన యాహూ.. గతేడాది సంభవించిన 4.4 డాలర్ల నష్టం దెబ్బకు కోలుకోలేని స్థితికి పడిపోయి తన వ్యాపారాన్ని ఎంతో తక్కువ విలువకు విక్రయించేందుకు సిద్ధపడింది. దాని ఫలితమే వెరిజోన్‌తో 4.83 బిలియన్ డాలర్ల ఒప్పందం. ఈ ఒప్పందంలోకి యాహూకు సంబంధించిన నగదు, యాహూ కన్వర్టబుల్ నోట్స్, కొన్ని మైనారిటీ వాటాలు, యాహూ ప్రధానేతర పేటెంట్లు పరిగణనలోకి రావని వెరిజోన్ ప్రకటించింది. అన్ని అనుమతులు పొంది 2017 తొలి త్రైమాసికంలో ఈ డీల్ పూర్తికావొచ్చని అంచనా. ఈ ఒప్పందం ఫలితంగా డిజిటల్ వ్యాపార ప్రకటనల మార్కెట్‌లో గూగుల్, ఫేస్‌బుక్ తర్వాత మూడో స్థానానికి చేరనుంది. తద్వారా వినియోగదార్లకు బదులుగా వ్యాపార ప్రకటనల నుంచి ఆదాయం పొందాలని అది భావిస్తోందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
చీకటిలో చిరుదీపం:
13 ఏళ్లుగా క్షీణిస్తూ..ఎన్నో నష్టాలను చవిచూస్తూ వస్తోన్న యాహూ చివరికి వేరొకరికి సొంతం అవ్వడానికి నిర్ణయించుకుంది. ఇంతటి కష్టంలో చీకటిలో చిరు దీపంలా నిలిచింది అలీబాబా. ఇ-కామర్స్ విభాగంలో అమెజాన్ స్థాయి కలిగిన చైనా సంస్థ అలీబాబాలో యాహూ కొంతకాలం క్రితం పెట్టుబడి పెట్టి 15 శాతం వాటా కొనుగోలు చేసింది. ఇప్పుడు ఈ పెట్టుబడి విలువ ఎంతో తెలుసా 40 బిలియన్ డాలర్లు. అంటే యాహూ ఇంటర్నెట్ వ్యాపారానికి ఉన్న విలువ కంటే అలీబాబాలో పెట్టిన పెట్టుబడి విలువ దాదాపు 9 రెట్లు అధికం.
ఏ రంగంలో అయినా ముందుచూపు, భవిష్యత్తు ఎలా ఉంటుందో అంచనా వేయడం అత్యంత ఆవశ్యం. ఇంటర్నెట్ ప్రపంచంలో వినియోగదారుల నాడిని పట్టుకోవడంలో విఫలమై తను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నట్లుగా వ్యవహరించిన యాహూ కోరి కష్టాలు తెచ్చుకుని పతనానికి తనకు తానే బాటలు వేసుకుంది. ఏది ఏమైనా వెబ్, ఈ-మెయిల్, సెర్చ్ వంటి మాధ్యమాలతో ప్రపంచ గతిని మార్చిన కంపెనీగా..యాహూ చరిత్రలో నిలిచిపోతుంది.