పుష్కరకాలం వచ్చేసింది
posted on Aug 11, 2016 @ 12:30PM
మొత్తానికి కొద్ది నెలలుగా ఎదురుచూస్తున్న పుష్కరాలు ముంచుకువచ్చేశాయి. రేపు తెల్లవారుజామున కృష్ణమ్మతల్లికి నీరాజనాలను అర్పించి, పుష్కరుని స్వాగతించేందుకు పండితులంతా సిద్ధమైపోయారు. ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తరువాత కృష్ణమ్మకు వస్తున్న తొలి పుష్కరాలు కావడంతో ఇరు ప్రభుత్వాలూ వీటి నిర్వహణను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కానీ గత పుష్కరాల నుంచి ఏమన్నా గుణపాఠాలు నేర్చుకున్నాయా లేదా అన్నదే అందరిలోనూ మెదుల్తున్న ప్రశ్న!
గత ఏడాది గోదావరి పుష్కరాల సమయంలో జరిగిన పొరపాటు సామాన్యమైనది కాదు. రాజమండ్రి కోటగుమ్మం వద్దనున్న పుష్కరఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో 29 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. షార్ట్‌సర్క్యూట్ జరిగిందన్న వదంతితో జనం తోపులాటకు దిగారని కొందరంటే, ముఖ్యమంత్రిగారి కోసం జనాలని ఆపి ఉంచడం వల్లే ప్రమాదం జరిగిందని కొందరు ఆరోపించారు. ఏది ఏమైనా, అధిక మొత్తంలో భక్తులు ఒక్కసారిగా స్నానానికి సిద్ధపడటంతో ఈ అనర్థం జరిగిందన్నది సుస్పష్టం. ఫలానా చోట పుష్కర స్నానం చేస్తేనే పుణ్యం వస్తుంది. మొదటి రోజునే మునిగితే అధికఫలం దక్కుతుంది.... వంటి ప్రవచనాలతో ఊదరగొట్టిన ప్రవచనకారులు, జరిగిన అనర్థానికి కిమ్మనకుండా మిన్నకుండిపోయారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం జాతీయస్థాయిలో అభాసుపాలైంది.
గోదావరి పుష్కరాల అనుభవం దృష్ట్యా ఈసారి ప్రభుత్వం మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లే కనిపిస్తోంది. ఇరు రాష్ట్రాలలోనూ కృష్ణాతీరం వెంబడి వందలాది ఘాట్లను నిర్మించారు. ఒక్క కృష్ణాజిల్లాలోనే 70కి పైగా ఘాట్ల నిర్మాణం జరిగింది. వీటికి తోడు ఆంధ్రప్రదేశ్‌లో పుష్కరాల నిర్వహణ కోసం ఏకంగా లక్షమంది అధికారులను నియమించినట్లు తెలుస్తోంది. వేల కొద్దీ ప్రత్యేక బస్సులు, రైళ్లు పరుగులెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి! మరోవైపు శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలుగకుండా ముందస్తుగా రౌడీషీటర్లను అదుపులోకి తీసుకుంటున్న వార్తలూ వినిపిస్తున్నాయి. ఇక రోజూ లక్షలమందికి అన్నదానాలు, సాంస్కృతిక కార్యక్రమాల సంగతి సరేసరి.
కాగితాల మీద చూడ్డానికి పుష్కరాల ఏర్పాట్లు చాలా ఘనంగానే కనిపిస్తున్నాయి. కానీ లక్షలాది మంది జనం ఒక్కసారిగా వచ్చిపడ్డాక పరిస్థితి ఎలా ఉంటుందన్నదే ఉద్వేగాన్ని కలిగించే అంశం. కొన్ని చోట్ల ఘాట్ల నిర్మాణం హడావుడిగా, నాసిరకంగా సాగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పైగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత ఏడాదిలాగానే ఈసారి కూడా ప్రచార ఆర్భాటానికే ప్రాధాన్యతని ఇస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదృష్టవశాత్తూ ఈసారి భారీ వర్షపాతం కారణంగా పుష్కరఘాట్ల పొడవునా స్నానానికి తగినంత నీరు ఉంది. పైగా తెలుగుప్రాంతాల నడిబొడ్డున ఉండే ఆరు జిల్లాలగుండా (నల్లగొండ, మహబూబ్‌నగర్, కర్నూలు, కృష్ణా, గుంటూరు) కృష్ణానది సాగడంతో పుష్కర స్నానం కాస్త సులువుగానే జరిగే అవకాశం ఉంది.
ప్రభుత్వాలు ఎన్ని ఏర్పాట్లు చేసినా, ప్రకృతి ఎంత చల్లగా చూసినా... ప్రమాదాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత భక్తుల మీద కూడా ఉంటుంది. ఫలానా రోజునే స్నానం చేయాలి, స్నానం చేశాక నదిలోకి మట్టిగడ్డలు విసరాలి, పుణ్యక్షేత్రాలు ఉన్నచోటే పుష్కరస్నానం చేయాలి... వంటి పట్టుదలలకు పోకుండా ఉంటే చాలు. అన్నింటికీ మించి... పుష్కర స్నానం అనేది ఒక మంచి ఆచారమే కానీ, స్నానం చేయనంత మాత్రాన నానా పాపాలూ చుట్టుకుంటాయన్న భ్రమని వీడితే మంచిది.