ఇది తెలుగు విజయం..
posted on Aug 9, 2016 @ 12:51PM
తమిళ గడ్డపై తెలుగు భాష ఘన విజయం సాధించింది. తెలుగు, కన్నడ, మలయాళం, ఒడియా భాషలకు ప్రాచీన హోదా కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. భాషలకు ప్రాచీన హోదా కల్పించే విషయంలో తాము జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. ప్రాచీన హోదా ఇచ్చేందుకు తెలుగుకు అన్ని అర్హతలూ ఉన్నట్లు కేంద్రప్రభుత్వం నియమించిన ప్రత్యేక కమిటీ చేసిన సిఫారసులతో తాము ఏకీభవిస్తున్నట్టు స్పష్టం చేసింది. మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఆర్.మహదేవన్‌లతో కూడిన థర్మాసనం ఈ చరిత్రాత్మక నిర్ణయం వెల్లడించింది.
ప్రాచీన భాషా హోదా కోసం 2006లో నిపుణులతో కూడిన ప్రత్యేక కమిటీ ముందుగా సంస్కృతం, తమిళ భాషలకు ప్రాచీన హోదా కల్పించింది. అనంతరం 2008లో తెలుగు, కన్నడ భాషలకూ ప్రాచీన హోదా కల్పించింది. ఈ రెండు భాషలకు ప్రాచీన హోదా కల్పించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ మద్రాస్ హైకోర్టులో సీనియర్ న్యాయవాది ఆర్.గాంధీ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణలో ఉండగానే 2013లో మలయాళం, 2014లో ఒడియా భాషలకు కేంద్రం ప్రాచీన హోదా కల్పించింది. దీంతో ఈ రెండు భాషలకు కూడా ప్రాచీన హోదా కల్పించడాన్ని సవాలు చేస్తూ గాంధీ 2014లో మరో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై 2009లో అప్పటి ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడు ఏబీకే ప్రసాద్ మద్రాస్ హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ వేశారు.
2014 జూన్‌లో ఆంధ్రరాష్ట్ర విభజన జరగనున్న నేపథ్యంలో ప్రాచీన హోదా పిటిషన్లను త్వరగా పరిష్కరించాలని తెలుగు భాషాభిమాని, "చెన్నై తెలుగు ప్రకాశం పత్రిక" సంపాదకుడు తూమాటి సంజీవరావు మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు. ఇందుకు న్యాయస్థానం సమ్మతించినా ప్రతివాదులు హాజరుకాలేదు. సరిగ్గా ఆ సమయంలోనే ఆంధ్రప్రదేశ్ విభజన జరగడంతో మద్రాసు హైకోర్టు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. 2016 జూన్ 20న తుది విచారణ ప్రారంభమైంది. ప్రాచీన హోదాపై నిర్ణయం తీసుకునే కమిటీలోని సభ్యులు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల తరపున రవీంద్రనాథ్ చౌదరి, చెన్నై తెలుగు ప్రకాశం పత్రిక సంపాదకులు తూమాటి సంజీవరావు ధర్మాసనం ముందు హాజరై తమ వాదనలు వినిపించారు. న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసి నిన్న తుది తీర్పు వెలువరించింది. ఈ సందర్భంగా న్యాయమూర్తులు కీలకవ్యాఖ్యలు చేశారు.
తెలుగు, కన్నడ, మలయాళం, ఒడియా భాషలకు ప్రాచీన హోదా కల్పించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్లను తోసిపుచ్చుతున్నట్లు తెలిపారు. పిటిషనర్ అభ్యంతరాలతో తాము ఏకీభవించడం లేదన్నారు. భాషలకు ప్రాచీన హోదా కల్పించడంపై ఏర్పడిన కమిటీ అన్ని రకాల అంశాలను పరిశీలించి సంతృప్తి చెందితేనే ఈ భాషలకు ప్రాచీన హోదా కల్పించింది. కమిటీ అభిప్రాయాల్లో న్యాయస్థానం జోక్యం చేసుకోదు. ఇప్పటికీ పిటిషనర్‌కు ఏవైనా అభ్యంతరాలు ఉంటే ప్రాచీన హోదా కల్పించిన నిపుణుల కమిటీకి నివేదించవచ్చని సూచించారు. తీర్పు వెలువడిన వెంటనే న్యాయవాది రవీంద్రనాథ్ చౌదరి మీడియాతో మాట్లాడారు. తెలుగు భాష ప్రాచీనమైనదని ఎప్పుడో రుజువైందని, మధ్యలో కొంతమంది అవాంతరాలను సృష్టించేందుకు ప్రయత్నించినా న్యాయస్థానం వాటిని తోసివేయడం హర్షణీయమని వ్యాఖ్యానించారు. అటు మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పార్లమెంట్ ఆవరణలో స్వీట్లు పంచి తన ఆనందాన్ని పంచుకున్నారు.
ప్రాచీన హోదా వల్ల వచ్చే లాభాలు:
ఏ భాషకైనా ప్రాచీన హోదా లభిస్తే దాని అభివృద్ధి కోసం కేంద్రం ఐదేళ్లకొకసారి రూ.100 కోట్లు ఇస్తుంది. దీని వల్ల ఆ భాషకు సంబంధించి అంతర్జాతీయ సదస్సులు నిర్వహించుకోవచ్చు. తెలుగు భాషకు కృషి చేసిన పండితుల్లో ప్రతి సంవత్సరం ముగ్గురికి లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డులతో పాటు లక్ష రూపాయల నగదు బహుమతిని అందజేస్తారు. ఐదు జాతీయస్థాయి అవార్డులు ప్రకటిస్తారు. ఇందుకు గానూ ఒక్కో అవార్డు గ్రహీతకు రూ.50 వేలు నగదుగా ఇస్తారు. ఆ భాషకు సంబంధించి ప్రత్యేక కేంద్రం ఏర్పాటవుతుంది. ప్రాచీన సాహిత్యాన్ని ఇతర భాషల్లోకి అనువదించి, పుస్తకాలను ముద్రించి ప్రచారం చేసుకోవచ్చు.