పుష్కరశోభ
posted on Aug 12, 2016 @ 2:40PM
శ్రావణమాసపు శోభతో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిస్తున్న సమయంలో తెలుగురాష్ట్రాలకు మరో కొత్త పండుగ వచ్చింది. పవిత్ర కృష్ణవేణీ పుష్కరాలు ఇవాళ్టీ నుంచి ప్రారంభంకానున్నాయి. భక్తజనం పారమార్థిక భావనతో పులకరించిపోయేలా.. ప్రకృతి అందాల నడుమ నదీమతల్లి ఆశీర్వాదంతో మైమరచిపోయేలా.. కృష్ణవేణి పుష్కర సంరంభం ఆరంభమయ్యింది. గురుడు ప్రతి సంవత్సరం ఒక్కోరాశిలో సంచరిస్తాడు. అందువల్ల దేశంలోని 12 నదులకు పుష్కరాలు వస్తాయి. ఆ ప్రకారం ఆయన కన్యారాశిలోకి ప్రవేశించినందువల్ల కృష్ణానదికి పుష్కరాలు వస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. నిన్న రాత్రి 9.28 నిముషాలకు బృహస్పతి కన్యారాశిలోకి ప్రవేశించడంతో కృష్ణానదీకి పుష్కరాలు ఆరంభమయ్యాయి.
మహారాష్ట్రలోని సహ్యాద్రి పర్వతసానువుల్లో రావి చెట్టు మొదటి నుంచి చిన్న బిందువుగా కృష్ణా ప్రవాహం ప్రారంభమైంది. విష్ణుమూర్తి అంశ కాబట్టి "కృష్ణ"గా..నల్లరేగడి మీద ప్రస్థానాన్ని ప్రారంభించింది కాబట్టి, నేలను బట్టి "కృష్ణ" అన్న పేరొచ్చిందిని చెబుతారు. మహారాష్ట్రలోని సహ్యాద్రిలో పుట్టి..కన్నడిగుల ఇంట కస్తూరి తిలకం దిద్దుకుని..తెలంగాణలో కుడికాలు మోపి..ఆంధ్రలో బిరబిరా పరుగులిడుతూ హంసలదీవి వద్ద సముద్రుడితో సంగమించేదాకా..నాలుగు రాష్ట్రాల్లో పద్నాలుగు వందల కిలోమీటర్ల ప్రస్థానంలో లక్షల ఎకరాల నేలను సస్యశ్యామలం చేసింది, కోట్లాది మంది ప్రజల గొంతు తడిపింది, ఎన్నెన్నో జలచరాలకు ఆవాసమైంది. అలా పంటలిచ్చి కడుపునింపే తల్లికి, నీళ్లిచ్చి గొంతు తడిపే దేవతకు..పన్నెండేళ్లకోసారి జరిగే పండుగే పుష్కరం.
కృష్ణానదికి పుష్కరాలంటే తెలుగుజాతికి ఓ పెద్ద పండుగ. ఈ పండుగకు తెలుగు రాష్ట్రప్రభుత్వాలు భారీ ఏర్పాట్లు చేశాయి. రెండు రాష్ట్రాలను దాటి తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా "సంగం" వద్ద తెలుగింట కాలు మోపుతుంది కృష్ణమ్మ. తెలంగాణ రాష్ట్రంలో 300 కిలోమీటర్ల మేర ప్రయాణించే కృష్ణవేణి ఆ నేలను సుభిక్షం చేస్తోంది. తెలంగాణ ఆవిర్భవించాక జరుగుతున్న మొట్టమొదటి కృష్ణాపుష్కరాలు కావడంతో ఆ రాష్ట్రప్రభుత్వం ఏర్పాట్లు ఘనంగా చేసింది. ముఖ్యమంత్రి ఆదేశం మేరకు కృష్ణా పుష్కరాల ఆహ్వాన కమిటీ చైర్మన్ కేవీ రమణాచార్యుల సారథ్యంలో తెలంగాణ చీఫ్ ఎడిటర్ అష్టకాల రామ్మోహనశర్మ, మృత్యుంజయశర్మ తదితరులు.. శృంగేరీ పీఠాధిపతి జగద్గురువులు శ్రీ భారతీతీర్థ మహాస్వామితో ప్రారంభించి జగద్గురువులను, యతీంద్రులను కృష్ణా పుష్కరాలకు ఆహ్వానించారు. వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య తెలంగాణ సీఎం కేసీఆర్ పుష్కరాలను ఇవాళ లాంఛనంగా ప్రారంభించారు. మహబూబ్‌నగర్ జిల్లా గొందిమళ్ల ఘాట్ దగ్గర సీఎం దంపతులు పుష్కర స్నానం ఆచరించారు.
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకం:
ఆంధ్రప్రదేశ్‌కు ఈ పుష్కరాలు ప్రత్యేకమైనవి..ఆంధ్రరాష్ట్ర తొలి రాజధాని ప్రాంతం నుంచి ఆంధ్రుల ప్రజా రాజధాని మీదుగా కృష్ణమ్మ తాను నడిచి వచ్చే ప్రాంతమంతా ఆకుపచ్చ చీరను చుట్టింది. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రలో జరుగుతున్న తొలి కృష్ణాపుష్కరాలు కావడంతో ప్రభుత్వం వీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కృష్ణా పుష్కర ప్రధాన కేంద్రం విజయవాడతో పాటు కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో మొత్తం 170 ఘాట్లు ఏర్పాటు చేసింది. గురుడు నిన్న రాత్రి సరిగ్గా 9.28 నిమిషాల సమయంలో కన్యారాశిలోకి ప్రవేశించగానే పుష్కరాలు ప్రారంభమైన సంకేతంగా విజయవాడ కృష్ణాతీరంలో కొత్త కాంతులు రంగరించుకున్నాయి.
రంగురంగుల వస్త్రాలు ధరించిన వెయ్యిమంది కళాకారులు శోభాయాత్ర ప్రారంభించారు. అనంతరం దుర్గాఘాట్‌లో తొమ్మిది మంది రుత్వికులు మనసా, వాచా,కర్మణా పవిత్రభావంతో మంత్రోచ్ఛారణతో దీపాలు చేతబట్టి కృష్ణమ్మకు హారతులిచ్చే అద్భుత సన్నివేశంతో ప్రతి హృదయం పులకించిపోయింది. ప్రకాశం బ్యారేజ్ వద్ద పేల్చిన బాణాసంచా చూపరులను కట్టిపడేసింది. ఈ ఉదయం ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృష్ణాపుష్కరాలను లాంఛనంగా ప్రారంభించారు. వేకువ జామునే కుటుంబసభ్యులతో కలిసి ఆయన పుణ్యస్నానమాచరించి పుష్కరుడికి హారతులిచ్చారు. ఈ వేడుకలు ఇవాళ్టీ నుంచి 23 వరకు జరగనుండటంతో ఆ పన్నెండు రోజులు తెలుగు రాష్ట్రాల్లో పండుగే. జీవన ప్రవాహంలా నదిలా నలుగురికీ ఉపయోగపడినప్పుడే..మనిషి పుట్టుకకు పరిపూర్ణత. అప్పుడే నదిని మనం తలుచుకున్నట్లు..జనం మనల్ని తలుస్తారు.