Read more!

ఆత్మహత్యల "భారతం"

భారతదేశాన్ని పట్టిపీడిస్తున్న సమస్యల్లో ఆత్మహత్యలు ముందు వరుసలో ఉండటం ఆందోళన కలిగించే అంశం. సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనే మానసిక బలంలేక..చిన్న కష్టానికే విలవిలాడుతూ బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్న వారు సంవత్సరానికి వేల నుంచి లక్షకు మించి పోవడం కలచివేస్తోంది. దేశవ్యాప్తంగా ఏటా 1.30 లక్షల మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. హోంశాఖ సహాయమంత్రి హన్స్‌రాజ్ జి.ఆహిర్ లోక్‌సభలో వెల్లడించిన గణంకాల ప్రకారం 2012-14 మధ్యకాలంలో మొత్తం 4.01 లక్షల మంది అర్థాంతరంగా తనువు చాలించగా... వీరిలో 2.68 లక్షలమంది పురుషులు, 1.33 లక్షలమంది మహిళలున్నట్టు పేర్కొన్నారు.

 

కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌ల్లో ఆత్మహత్యల ఘటనలు అధికంగా నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సంఖ్య అధికమే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆత్మహత్యల సంఖ్య ఏటా సగటున 14 వేలకుపైగా ఉండగా..విభజన అనంతరం ఏపీలో 6 వేలు, తెలంగాణలో 9 వేలకు పైగా బలవన్మరణాలు నమోదయ్యాయి. అన్ని రంగాల్లో యువత ముందున్నట్లే..ఆత్మహత్యల్లో కూడా వారే అగ్రస్థానంలో నిలిచారు. ఒత్తిడి తాళలేక కొందరు, ర్యాంకుల పరుగుల్లో చతికిలపడి మరికొందరు, తల్లిదండ్రులు మందలించారని ఇంకొందరు, వేధింపులు భరించలేక, కుటుంబ, వ్యక్తిగత సమస్యలతో కొద్దిమంది అర్థాంతరంగా తనువు చాలిస్తున్నారు.

 

ఇంటర్ విద్యార్థుల్లో ఈ సమస్య మరి తీవ్రంగా ఉంది..పదో తరగతి తర్వాత ఇంటర్‌లో ప్రైవేట్ గురుకుల కళాశాలల్లో చేరుతున్న విద్యార్థులు ఒక్కసారిగా ఇంటికి దూరంగా ఉండాల్సి రావడంతో ఆ వాతావరణానికి ఇమడలేకపోతున్నారు. దానికి తోడు ఇంజనీరింగ్, ఇతర వృత్తివిద్య కోర్సుల్లో సీనియర్ల వేధింపులు, ప్రేమ వైఫల్యాల వల్ల ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. విద్యార్థుల తర్వాతి స్థానంలో రైతులు, చేనేత కార్మికులు నిలిచారు. వర్షాలు పడకపోవడంతో బోర్లద్వారానైనా సాగు చేయాలని అధిక వడ్డీలకు అప్పులు తెస్తారు. అంత శ్రమకొర్చి పంట సాగు చేసినా ఆశించిన దిగుబడి రాక..అప్పు చెల్లించలేక..మనస్థాపంతో పురుగు మందులు తాగి తనువు చాలించే రైతన్నలు దేశంలో కొకొల్లలు. నిత్యావసరాలు పెరిగినా..కూలి పెరగకపోవడంతో కుటుంబాన్ని పోషించలేక నేత కార్మికులు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. సిరిసిల్లకెళ్లినా..గద్వాల పోయినా..పోచంపల్లినడిగినా ఈ విషయం తెలుస్తుంది.

 

అప్పులు, పెళ్లి కుదురకపోవడం, వరకట్నం, వివాహేతర సంబంధం, విడాకులు, కుటుంబ సమస్యలతో అత్యధిక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆ తర్వాత అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఆత్మహత్యలవైపు లాగుతున్నాయి. ఎయిడ్స్, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులతో బాధపడేవారికింటే ధీర్ఘకాలిక రోగాలతో సతమతమవుతున్న వారే ఎక్కువగా బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ప్రేమ వ్యవహారాలు, పేదరికం, ఆస్తి తగదాలు, ఉద్యోగ జీవితంలో ఒత్తిడి, టార్గెట్లు కూడా ఆత్మహత్యలకు దారితీస్తున్నాయి.

 

అప్పుల కారణంగా పురుషులు ఎక్కువ సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకుంటుండగా..వివాహసంబంధ సమస్యల వల్ల పురుషులతో పోలిస్తే మహిళలు రెట్టింపు సంఖ్యలో ప్రాణాలు తీసుకుంటున్నారు. దేశానికి పెనుసవాలుగా మారిన ఆత్మహత్యలపై ప్రభుత్వాలు సమగ్రంగా అధ్యయనం చేసి విధానపరమైన చర్యలు చేపట్టాలి. ఆత్మహత్యల్లేని భారత్ నిర్మాణానికి సామాజిక కోణంలో పరిష్కారాలు కనుగొనాలి. ఈ విషయంలో ప్రభుత్వాలతో పాటు ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల పాత్ర కీలకమైనది.