బీజేపీ - తెరాస వార్.. వ్యూహాల నడుమ యుద్ధం
రాజకీయాలలో ఎవరి వ్యూహాలు వారికుంటాయి. అందులో తప్పులేదు. నిజమే . భారతీయ జనతా పార్టీ, జూలై 2-3 తేదీలలో హైదరాబాద్ లో జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించడం కూడా, ఒక వ్యూహం ప్రకారం తీసుకున్న నిర్ణయమే. అందులో అనుమానం లేదు. హుజురాబాద్ ఉప ఎన్నిక విజయంతో వచ్చిన ఉత్సాహంతో తెలంగాణపై దృష్టిని కేంద్రీక రించిన బీజేపీ జాతీయ నాయకత్వం ఆ దిశగా పావులు కదుపుతూ వస్తోంది.
ప్రధాని సహా పార్టీ జాతీయ నేతలు, కేంద్ర మంత్రులు ఇతర కీలక నేతలు రాష్ట్రంలో తరచూ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు .రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా, ముందస్తు ఎన్నికల ఉహాగానాల నడుమ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబద్ లో ఏర్పాటు చేశారు. మరోవంక అదే సమయంలో హుజురాబాద్ లో ఎదురైన చేదు అనుభవంతో ముఖ్యమంత్రి అప్రమత్తమయ్యారు. నిజానికి, హుజురాబాద్ ఓటమి ముఖ్యంత్రి శక్తి యుక్తులను సగానికి సగం మింగేసింది. మాజీ ఎంపీ కొండావిశ్వేశ్వర రెడ్డి మాటల్లో చెప్పాలంటే, హుజురాబాద్ ఓటమితో, రేపటి అసెంబ్లీ ఎన్నికలో తెరాస ‘సగం’ ఒటమి ఖరారై పోయింది. ఇంతవరకు, కేసీఆర్ ఏ ఎన్నికకు ఇవ్వని ప్రాధాన్యత హుజురాబాద్ ఉప ఎన్నికకు ఇచ్చారు. ఈటల మళ్ళీ అసెంబ్లీలో ఆడుగు పెట్టకూడదనే ఒకే ఒక్క లక్ష్యంతో, అస్త్రశస్త్రాలు అన్నిటినీ ప్రయోగించారు.
అయినా, వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా, చివరకు ముఖ్యమత్రి కేసీఆర్ వ్యక్తిగత ప్రతిష్టను పణంగా పెట్టినా హుజురాబాద్ ఉప ఎన్నికల్లో తెరాస ఓడిపోయింది. ఇక అక్కడి నుంచి అధికార తెరాసలో నిర్వేదమనాలో, నిస్తేజమే అనాలో కానీ, ఒక విధమైన ఆందోళన అయితే మొదలైంది. ఇక ఆ తర్వాత ఏమి జరిగింది , అన్నది చరిత్ర. ముందస్తు ప్రమాదాన్ని ముందుగానే గుర్తించిన ముఖ్యమత్రి కేసీఆర్ సమయానుకూలంగా తమ వ్యూహాలను మార్చుకుంటూ, అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం పై యుద్ధం ప్రకటించారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు గల్లీనుంచి ఢిల్లీ వరకు పోరాటం చేశారు. పనిలో పనిగా జాతీయ రాజకీయాల్లో వేలు పెట్టారు. ఫ్రంట్ మొదలు సొంత పార్టీ వరకు చాలా ఆలోచనలు చేశారు. రాష్ట్రాలు తిరిగారు, నేతలను కలిశారు. కోట్లు కుమ్మరించి జాతీయ మీడియాలో ప్రచారం చేసుకున్నారు. ఇంకా చాలా చేశారు. అయితే, ఈ యుద్ధంలో ఇంతవరకు ఏమి సాధించారు, ఎక్కడ విఫల మయ్యారు అనేది పక్కన పెడితే, బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నేపధ్యంగా అటు నుంచి బీజేపీ, ఇటు నుంచి తెరాస యుద్ధ క్రీడను పతాక స్థాయికి తీసుకుపోయాయి. బీజేపీ కార్యవర్గ సమావేశాలకు ముందుగానే, కార్యవర్గ సభ్యులు, కేంద్ర మంత్రులు, వివధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర ముఖ్యనేతలను రాష్ట్రానికి చేరుకొని, నియోజక వర్గాల వారీగా క్షేత్ర స్థాయిలో పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టారు.
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏమి చేసిందో, ఎన్ని నిధులు ఇచ్చిందో వివరిస్తూ, అదే సమయంలో రాష్ట్రం మరింత వేగంగా అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజిన్’ సర్కార్ ( కేంద్రంలో రాష్ట్రంలో ఒకే పార్టీ ప్రభుత్వం) అవసరమని ప్రజలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరో వంక పది లక్షల మందితో భారీ బహిరంగ సభకు పార్టీ సన్నాహాలు చేస్తోంది. ఇందుకు ప్రతిగా తెరాస నేతలు జిల్లాలో పర్యటిస్తూ కేంద్ర ప్రభుత్వం ఎనిమిదేళ్ళలో రాష్ట్రానికి చేసినట్లు చాలా కలంగా చెపుతున్న అన్యాయాలను మరోమారు ఏకరువు పెడుతున్నారు.
అంతవరకు అయితే అదో రకం కానీ, ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం మరో ముందడుగు వేసింది. ఫ్లెక్సీల యుద్ధంగా, ప్రచార యుద్ధంగా మారింది. బీజీపీ, సాలు దొర అంటే తెరాస సంపొద్దు మోడీ అంటూ సమాధానం ఇచ్చింది. ఇక ఫ్లెక్సీలు, హోర్డింగుల విషయంగా రెండు పార్టీలు హద్దులు దాటి వికార పోకడలు పోతున్నాయనే విమర్శలు వస్తున్నాయి, వాటి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదనే విధంగా వ్యవహరిస్తున్నారు.
అదలా ఉంటే, రేపు (శనివారం) బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి.. అయితే, సరిగ్గా ప్రధాని హైదరాబాద్‌కు వస్తున్న రోజునే.. రాష్ట్రపతి ఎన్నికలో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీచేస్తున్నయశ్వంత్ సిన్హాను ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్‌కు ఆహ్వానించారు. అంతేకాదు, గతంలో ప్రధాని రాష్ట్రానికి వచ్చిన ఒకటి రెండు సంధర్భాలలో స్వాగతం పలికేందుకు వెళ్ళని ముఖ్యమంత్రి కేసీఆర్, రేపు శనివారం ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి వస్తున్న యశ్వంత్ సిన్హాకు స్వయంగా స్వాగతం పలుకుతున్నారు. అక్కడి నుంచి భారీ ర్యాలీగా జలవిహార్‌కు చేరుకొని టీఆర్‌ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో సమావేశ మవుతారు.
అయితే, ఈ సమావేసం యశ్వత్ సిన్హా పేరున జరుగుతున్నా, సమావేశం అసలు ఉద్దేశం అదికాదు, అదే వేదిక నుంచి బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధించేందుకు కేసీఆర్ సిద్ధమైనట్లు చెబుతున్నారు. అయితే, హుజురాబాద్ ఓటమితో మొదలైన ఈ యుద్ధం .. అంతిమంగా.. ఎప్పుడు ఎక్కడ.. ఎలా ముగుస్తుంది అనేది.. ప్రస్తుతానికి ఉహకు అందని విషయంగా పరిశీలకులు పేర్కొంటున్నారు. అయితే, ముఖ్యమంత్రి కేసీఆర్, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ను హైర్ చేసుకోవడం మొదలు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను భగ్నం చేసందుకు వందల కోట్ల రూపాయల ప్రజా ధనం ఖర్చు చేసి, నగరంలోని మెట్రో పిల్లర్లు మొత్తానికి మొత్తంగా, ఆక్రమించుకోవడం, చివరకు ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్ధి పర్యటనను అందుకోసం ఉపయోగించుకోవడం.. కేసీఆర్ లో గూడుకట్టుకున్న భయాన్ని బయట పెడుతోందని అంటున్నారు.
నిజానికి, కేసీఆర్ ఎలాంటి తప్పులైన చేస్తారు కానీ, రాజకీయ తప్పులు మాత్రం చేయరు, కానీ, ఎందుకనో ఆయన గత కొంత కాలంగా ఒకదానివెంట ఒకటిగా రాజకీయ తప్పిదాలే చేస్తున్నారని, వాటిలొ ఇప్పుడు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను భగ్నం చేసేందుకు సాగిస్తున్న ప్రయత్నాలు అందుకు పరాకాష్టగా ఉన్నాయని తెరాస నాయకులే అంటున్నారు. ఒక విధంగా కేసీఆర్ వ్యుహత్మక తప్పిదం చేస్తున్నారనే అభిప్రాయానికి బలాన్ని చేకురుస్తోందని అంటున్నారు.