మమతా దీదీ మాస్టర్ స్ట్రోక్ ..
posted on Jul 2, 2022 @ 1:11PM
ఆవిడ అంతే .. ఆవిడ గారి స్టైలే వేరు. అలా ఉన్నటుండి ఒక్కసారిగా, ఎక్కడివాళ్లు అక్కడ బిక్కచచ్చిపోయేలా,పిడుగులాంటి తూటా ఒకటి పెలుస్తారు. అందుకే ఆమె మమతా దీదీ అయ్యారు. రాష్ట్రపతి ఎన్నికలకు సంబందించి అందరికంటే ముందుగా. మమతా దీదీనే ప్రతిపక్ష పార్టీలకు గంట కొట్టారు. ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్ధిని నిలబెట్టాలనే ప్రతిపాదనను తెరమీదకు తెచ్చారు. ప్రతిపక్ష పార్టీల తొలి సమావేశానికి దీదీనే పెద్దరికం వహించారు. ముచ్చటగా ముగ్గురు (శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లా, గోపాల కృష్ణ గాంధీ) పేర్లను కూడా ఆమే ప్రతిపాదించారు. ఆ ముగ్గురు చేతులేత్తేసిన తర్వాత, చంకల్లో పిల్లడు, తృణమూల్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు యశ్వంత్ సిన్హా పేరును ...దీదీనే ప్రపోజ్ చేశారు. కాంగ్రెస్, ఎన్సీపీ సహా 20 వరకు పార్టీలు సిన్హాను ఉమ్మడి అభ్యర్ధిగా బరిలో దించాయి.
అయితే, ఇప్పడు అదే మమతా బెనర్జీ, పిడుగులాంటి ప్రకటన చేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్ధి యశ్వంత్ సిన్హా ఓడి పోతారని అనలేదు, కానీ, అధికార బీజేపీ/ ఎన్డీఎ అభ్యర్ధి ద్రౌపది ముర్మూకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని, అసలు బీజేపీ ముందే అడిగి ఉంటే.. ఆమెకే విపక్షాలు కూడా మద్దతు ఇచ్చి ఉండేవని అన్నారు .అలాగే, మహా రాష్ట్ర పరిణామాలను అడ్డుపెట్టుకుని ఆమె ప్రతిపక్ష పార్టీలకు, ముఖ్యంగా, యశ్వంత్ సిన్హాను హైదరాబాద్ ఆహ్వానించి, హడావిడి చేస్తున్న, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్’ కు ఝలక్ ఇచ్చేందుకే, యశ్వంత్ సిన్హాను చులకనచేసే విధంగా ప్రకటన చేశారని హైదరాబాద్ పొలిటికల్ సర్కిల్స్’లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ ప్రకటన ద్వారా పరోక్షంగానే అయినా, యశ్వంత్ సిన్హా ఆశలు వదులుకుంటే మంచిదని, ప్రచారం ఆపేస్తే ఇంకా మంచిదని చెప్పకనే డీడీ చెప్పకనే చెప్పారని, ఓ సలహా లాంటింది ఇచ్చారని, రాజకీయ పండితులు అంటున్నారు.
మరోవంక మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. "ఆమె మోదీతో రహస్య ఒప్పందం చేసుకుని.. మరోసారి అసలు రంగు బయటపెట్టుకున్నారు. రాష్ట్రపతి అభ్యర్థిని మమతనే ఎంపిక చేశారు. మేము మద్దతు ఇచ్చాం. దీదీ ఇప్పుడు బీజేపీ ఏజెంట్లా ప్రవర్తిస్తున్నారు. గెలిచేందుకు అవసరమైన సంఖ్యా బలం ఉందని నిర్ధరించుకున్నాకే బీజేపీ ద్రౌపది ముర్మూను అభ్యర్థిగా చేసుకుని ఎన్నికల బరిలో దిగింది. ద్రౌపది గెలుస్తారనడం.. ఏదో కొత్తగా కనుగొన్న విషయం కాదు" అని అన్నారు కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి.
నిజానికి, బీజేపీ /ఎన్డీఏ అభ్యర్ధి ద్రౌపది ముర్మునా, మరోకరా అనే విషయాన్ని పక్కన పెడితే,, అధికార కూటమి అభ్యర్ధి గెలుపుకు ముందు నుంచి కూడా డోకా లేదు. ఎలక్టోరల్ కాలేజీలో బీజేపీ /ఎన్డీఎ కూటమికి ఇంచుమించుగా 50 శాతం ఓట్లున్నాయి. ఒక శాతామో రెండు శాతమో తక్కువ ఉన్నా, వైసీపే వంటి,కేంద్రానికి జీహుజూర్’ అనే పార్టీలు ఎటూ ఉండనే ఉన్నాయి. సో ... అభ్యర్ధి ఎంపికకు ముందే, ఎన్డీఎ అభ్యర్ధి గెలుపు ఖరారైంది.
ఇక ఆ తర్వాత ఆదివాసి గిరిజన మహిళ ద్రౌపది ముర్మును బీజేపీ /ఎన్డీఎ రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత, ఇక అధికార కూటమికి ఎదురులేకుండా పోయింది. ఏ కూటమిలోనూ భాగస్వాములు కానీ బిజూ జనతదాల్, వైసేపీ, బీఎస్పీ వంటి పార్టీలే కాదు, కాంగ్రెస్ కూటమిలోని జేడీఎస్, జేఎంఎం వంటి పార్టీలు కూడా ముర్ముకు మద్దతు ప్రకటించాయి. మరోవంక మహారాష్ట్ర పరిణామాల నేపధ్యంలో శివసేన ఎంపీలు, ఎమ్మెల్యేలలో మెజారిటీ సభ్యులు బీజేపీ /ఎన్డీఏ కే మద్దతి ఇస్తారు. సో.. ఇప్పడు ఆమె భారీ మెజారిటీతో గెలవడం ఇంచు మించుగా ఖారారై పోయింది. ఆ దృష్ట్యానే మమతా దీదీ మనసు మార్చుకున్నారని అనుకున్నా, దీదీ వ్యూహత్మకంగానే, ప్రతిపక్షాలో టం పెద్దరికాన్ని నిలుపుకునేందుకు, సమయం సందర్భం చూసుకుని ఆమె ఈ వ్యాఖ్యలు చేశారని, ఏదైనా మమతా దీదీ అంతే .. ఆమె స్టైలే అంత అంటున్నారు.
అదలా ఉంటే, హైదరాబాద్’లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలుప్రారంభమవుతున్న రోజనే యశ్వంత్ సిన్హాను హైదరాబాద్’ కు ఆహ్వానించి, రాజకీయ మైలేజి పొందేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తున్న రోజునే, దీదీ, రాష్ట్రపతి ఎన్నిక ఫలితాలపై భవిష్య వాణి వినిపించడం కూడా రాజకీయంగా చర్చనీయాంశమైంది. నిజానికి సిన్హా ఓటమి గురించి ఎవరికీ అనుమనాలు లేవు.. అలాంటప్పుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ‘పెద్ద పర్సు’ తో యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలకడం, కేవలం బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నుంచి ప్రజల దృష్టిని, ముఖ్యంగా మీడియా దృష్టిని మరల్చడం కోసమే అంటున్నారు.