హైదరాబాద్ ధమ్ బిర్యానీ రుచి చూడండి.. మోడీకి కేటీఆర్ బహారంగ లేఖ
posted on Jul 2, 2022 @ 10:44AM
తెరాస, బీజేపీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి. తెలంగాణకు కేసీఆర్ కుటుంబం దోచుకుంటోందని బీజేపీ ఆరోపణలను గుప్పిస్తుంటే.. తెలంగాణ అభివృద్ధికి కేంద్రంలోని మోడీ సర్కార్ ఇసుమంతైనా చేయూత నివ్వడం లేదని టీఆర్ఎస్ ఆరోపిస్తున్నది. తెలంగాణ ఆకాంక్షలను తెరాస కాలరాస్తున్నదని కమల నాథులు విరుచుకుపడుతుంటే.. బీజేపీ దేశంలో విద్వేషాలు రెచ్చగొట్టి మత సామరస్యాన్ని దెబ్బతీసి అధికారాన్ని పదిలం చేసుకోవాలని చూస్తోందంటూ గులాబి దళం విమర్శలు గుప్పిస్తోంది.
ఈ పరస్పర విమర్శల పర్వంలో తెరాస వైపు నుంచి కేసీఆర్ తరువాత గట్టిగా ఘాటుగా విమర్శలు చేసే దెవరంటే కేసీఆర్ తనయుడు, టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆరే. ఎంత రాజకీయ ప్రత్యర్థి అయినా మోడీ ప్రధాని హోదాలో తెలంగాణకు వస్తున్నారు. ఆయనతో కానీ, ఆయన పార్టీతో కానీ సత్సంబంధాలు లేకపోయినా, రాజకీయంగా ఒకరితో ఒకరు ఢీ కొనే పరిస్థితులు ఉన్నా.. కేటీఆర్ మోడీ తెలంగాణ రుచులను పూర్తిగా ఆస్వాదించాలని కోరుకుంటున్నారు. అందుకే అడగకపోయినా మోడీ గారికి హైదరాబాద్ ధమ్ బిర్యానీ గురించి లేఖ రాశారు.
తెలంగాణ వచ్చి హైదరాబాద్ ధమ్ బిర్యానీ రుచి చూడకుండా వెళ్లకండని ఆ లేఖలో కోరారు. మోడీ పూర్తిగా శాఖాహారి కనుక ధమ్ బిర్యానీ అంటే అదేదో చికెన్, మటన్ కు సంబంధించిందని అనుకుంటారేమోనని, వెజిటెబుల్ ధమ్ బిరియానీ కూడా ఉంటుంది. అడిగి చేయించుకుని తప్పని సరిగా రుచి చూడండని ఆ లేఖలో కేటీఆర్ మోడీకి సూచించారు. అక్కడితో ఆగి ఉంటే కేటీఆర్ పొలిటీషియన్ ఎందుకు అవుతారు.
హైదరాబాదీల ఆతిథ్యం మహ గొప్పగా ఉంటుందని ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే ఫ్లెక్సీల వార్ ఆ ఆతిథ్యంలోకి రాదని ఆయన ప్రత్యేకంగా ఏమీ ప్రస్తావించలేదు. నగరంలో మోడీకి వ్యతిరేకంగా వెలసిన పోస్టర్లను చూస్తే మోడీకి అర్ధం అవుతుందనుకున్నారో ఏమో. ఇక ఇరానీ చాయ్ హైదరాబాద్ స్పెషల్ అని పేర్కొని, గతంలో చాయ్ వాలాగా మీరు సర్వ్ చేసిన చాయ్ కంటే ఇది మహా గొప్ప రుచిగా ఉంటుందని సెలవిచ్చారు. ఆ చాయ్ తాగుతూ అంతరాలు లేని సమసమాజం గురించి మంచి ఆలోచనలు చేయాలని సలహా కూడా ఇచ్చేశారు.
బీజేపీ జాతీయ కార్యవర్గసమావేశాల కోసం హైదరాబాద్ వస్తున్న మోడీకి కేటీఆర్ రాసిన ఈ బహిరంగ లేఖ రాజకీయ ప్రాధాన్యత సంతరించుకోవడమే కాకుండా.. సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతోంది. సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా మారబోతున్న హైదరాబాద్ ఐటీ రంగానికి మీరు పొడిచిన వెన్నుపోటును ఇక్కడి యువత మర్చిపోదని కేటీఆర్ సుతి మెత్తటి హెచ్చరికా చేశారు.
ఐటీఐఆర్‌ను రద్దు చేసి తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని ఆపుదామన్న మీ రాజకీయాలకు టీఆర్ఎస్ సర్కార్ తమ పనితీరుతోనే సమాధానం చెప్పామన్నారు. గత ఎనిమిదేళ్లలో తెలంగాణ ఐటీ ఎగుమతులను మూడు రెట్లు పెంచి రూ. 1.83 లక్షల కోట్లకు చేర్చినట్టు చెప్పారు. పార్లమెంటు సాక్షిగా తెలంగాణకు దక్కిన రాజ్యాంగబద్ధ హామీలైన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీలు ఇవ్వకుండా వంచించిన చరిత్ర మీది అని కేటీఆర్ ఆ లేఖలో గుర్తు చేశారు.