కదిలింది కమల దళం.. నగరం కాషాయమయం
posted on Jul 2, 2022 @ 10:25AM
సుమారు రెండు దశాబ్దాల తర్వాత, భాగ్యనగరం (హైదరాబాద్) భారతీయ జనత పార్టీ ( బీజేపీ) జాతీయ కార్యవర్గ సమావేశాలకు వేదిక అయింది. ఈ రెండు దశాబ్దాల కాలంలో దేశ రాజకీయ ముఖ చిత్రం ఎంతాగానో మారిపోయింది.అప్పుడు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా ఉన్న హైదరాబాద్, ఈ రోజు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణగా విడిపోయిన రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా వుంది. అప్పుడు బీజేపీ మిత్ర పక్షం తెలుగు దేశం అధికారంలో వుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలలో పాల్గొనేందుకు వచ్చిన బీజేపీ నేతలకు ఆతిధ్యమిచ్చారు. ఇప్పుడు... రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెరాస, బీజేపీ సంబంధాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంట మంచిది. రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమనే పరిస్థితి.
అదలా ఉంటే, గడచినా ఎనిమిదేళ్ళుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ 2024 ఎన్నికలో ముచ్చటగా మూడవసారి అధికారం కైవసం చేసుకోవడం లక్ష్యంగా అడుగులు వేస్తున్న బీజేపీ ఎన్నికలు, పార్టీ విస్తరణ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలన గురించి ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లడం ప్రధానాంశాలుగా జాతీయ కార్యవర్గ సమావేశాలు శనివారం (జులై2) హైదరాబాద్‌లో ప్రారంభ మవుతున్నాయి.
జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రతి సంవత్సరం జరుగుతాయి.. అయితే, కరోనా కారణంగా గత రెండు సంవత్సరాలుగా మొగ్గుబడి తంతుగానే, జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించారు.భారీ స్థాయిలో జరగలేదు.మరోవంక నెక్స్ట్ ఇయర్ పలు కీలక రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు, 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల కసరత్తులో నాయకత్వమంతా బిజీగా ఉంటుంది కాబట్టి ప్రస్తుతం హైదరాబాద్‌లో జరిగే సమావేశాలకు, ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడిందని పార్టీ నాయకులు తెలిపారు. ఈ సమావేశాల్లో, రాజకీయ అంశాలు, ముఖ్యంగా దక్షినాదిలో పార్టీ విస్తరణతో పాటుగా సంస్థాగత అంశాలపై సమగ్రంగా చర్చించి నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉందని పార్టీ నేతలు తెలిపారు.
కాగా, జాతీయ కార్యవర్గ సమావేశాలకు ప్రధానమంత్రి మోదీ, హోంమంత్రి అమిత్‌షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, పార్టీ రాష్ట్ర శాఖల అధ్యక్షులు సహా బీజేపీ అగ్రనాయకులంతా హైదరాబాద్ చేరుకుంటున్నారు. ఇప్పటికే, పార్టీ అధ్యక్షుడు నడ్డా సహా పలువురు ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు హైదరాబద్ చేరుకున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్, గడ్కరీ తదితరులు ఈరోజు (శనివారం) హైదరాబద్ చేరుకుంటారు. కార్యవర్గ సమావేశాల కోసం హైదరాబాద్‌లోని మాదాపూర్ హెచ్‌ఐసీసీ (కాకతీయ) ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు.
అదలా ఉంటే, హైదరాబాద్;లో జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించడానికి ప్రత్యేక కారణముందని పార్టీ రాష్ట్ర నాయకులు స్పష్టం చేస్తున్నారు. తెలంగాణ పై కాషాయ జెండా ఎగరేయడమే లక్ష్యంగా పార్టీ జాతీయ నాయకత్వం తెలంగాణపై ద్రుష్టి కేంద్రేకరించిందని పార్టీ నాయకులు చెపుతున్నారు. మరోవంక, రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెరాస, బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్’ లో నిర్వహించడాన్ని గట్టిగా వ్యతిరేకిస్తోంది. ముఖ్యమంత్రి కొంత మౌనగా ఉన్నప్పటికీ, మంత్రి కేటీఆర్, చాల ఆపేద్ద ఎత్తున ‘బీజేపీ’ వ్యతిరేక ప్రచారం సాగిస్తున్నారు. అలాగే, రాష్ట్ర మంత్రులు, కీలక నేతలు... కమలంపై కాలు దువ్వుతున్నారు. అయితే, పార్టీలో కొందరు సీనియర్ నాయకులు మాత్రం, కేటీఆర్ గీత దాతుతున్నారని, కోరి కష్టాలు కొని తెచ్చుకుంటున్నారని అంటున్నారు. అదే విధంగా రాజకీయ విశ్లేషకులు కూడా కాంగ్రెస్’తో వ్యవహరించినట్లు బీజేపీతో వ్యవహరిస్తే ఏమవుతుందో చెప్పేందుకు మహారాష్ట్ర పరిణామాలే నిదర్శనమని అంటున్నారు.
అదలా ఉంటే బీజేపీ రాష్ట్రంపై దండయాత్రాను ప్రకటించిండా అన్న విధంగా గతంలో ఎన్నడూ లేనట్లుగా, కార్యవర్గ సమావేశాలకంటే ముందుగానే ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, ఇతర ముఖ్యనాయకులు రాష్ట్రంలో దిగిపోయారు. జిల్లాల్లో పర్యటించి పార్టీకి అనుకూలమైన వాతావరణం కల్పించే ప్రయత్నం చేశారు. ఎన్నికలు, పార్టీ విస్తరణ కీలక ఎజెండాగా ఉంటుందని, దేశవ్యాప్తంగా 75 వేల బూత్‌ల స్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని మరింత పటిష్ఠం చేయడంతో పాటు కార్యకర్తలను మరింత పెంచుకోవాల్సిన అవసరాన్ని పార్టీ గుర్తించిందని, దీనిపై కూడా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో లోతుగా చర్చించే అవకాశం ఉందని సంబంధిత వర్గాల సమాచారం. తెలంగాణలో తెరాసకు తామే ప్రత్యామ్నాయం అన్న అభిప్రాయాన్ని కల్పించగలిగామని, ఆదివారం జరిగే భారీ బహిరంగ సభ తర్వాత ప్రజల్లో తమ పట్ల మరింత నమ్మకం పెరుగుతుందన్న ఆశాభావాన్ని తెలంగాణ బీజేపీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు.